Share News

సీఎం రేవంత్ రెడ్డికి అల్పాహార విందు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..

ABN , Publish Date - Apr 19 , 2026 | 09:08 PM

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి విందు ఇవ్వడంపై కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్పందించారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమం రాజకీయపరంగా కాకుండా పరిపాలనా అవసరాల దృష్ట్యా జరిగిందని ఆయన తెలిపారు. అనవసరంగా ట్రోల్ చేయవద్దని పేర్కొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డికి అల్పాహార విందు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
Union Minister Bhupatiraju

అమరావతి: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అల్పాహార విందు ఇచ్చిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం ఢిల్లీలో కేంద్ర మంత్రి కుమారస్వామి, సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ఎంపీలకు ఆయన విందు ఇచ్చారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించిన రేవంత్‌కి విందు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్పందించారు.


ఢిల్లీలో జరిగిన ఈ విందు కార్యక్రమం రాజకీయపరంగా కాకుండా పరిపాలనా అవసరాల దృష్ట్యా జరిగిందని తెలిపారు. తెలంగాణకు తమ శాఖ నుంచి 2,500 ఎలక్ట్రిక్ బస్సుల మంజూరు కోసం ఇప్పటికే ఆమోదం తెలిపామని చెప్పారు. ఈ బస్సులను త్వరగా విడుదల చేయాలని ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వినతిపత్రం అందించేందుకు వచ్చారన్నారు. ఈ మేరకు తమ నివాసంలో జరిగిన అల్పాహార విందుకు హాజరయ్యారని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని సోషల్ మీడియాలో కావాలనే ట్రోలింగ్ చేస్తున్నారని కేంద్ర మంత్రి ఆక్షేపించారు.


ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపతిరాజు మాట్లాడుతూ.. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ప్రతిపాదించిన ఈ బిల్లును వ్యతిరేకించడం ద్వారా ఇండి కూటమి చారిత్రక తప్పు చేసిందన్నారు. 2023లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఆమోదించిందని గుర్తుచేశారు. ఈ రిజర్వేషన్లను త్వరితగతిన అమలు చేయడానికి సవరణలు తీసుకొస్తే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని విమర్శించారు.


పార్లమెంట్‌లో మహిళల హక్కులకు విరుద్ధంగా వ్యవహరించారని ఆగ్రహించారు కేంద్ర మంత్రి. జనగణన ఆలస్యమవుతున్న నేపథ్యంలో 2029 నాటికి మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ద్వారా ఎవరికీ అన్యాయం జరగకుండా బిల్లు రూపొందించారన్నారు. అయినా ప్రతిపక్షాలు దాన్ని వ్యతిరేకించాయని ధ్వజమెత్తారు. అలాగే, ప్రతిపక్ష నాయకత్వంపైనా భూపతిరాజు విమర్శలు గుప్పించారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కనిమొళి, డింపుల్ యాదవ్ వంటి నాయకులు చట్టసభల్లో ఉండొచ్చని, కానీ సాధారణ మహిళలకు అవకాశాలు ఇవ్వడంలో విపక్షాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని ఆయన మండిపడ్డారు.


విపక్ష కూటమి పార్టీల కుటుంబసభ్యులు మాత్రమే రాజకీయాల్లో ఉండాలా? అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. మహిళల హక్కులను విస్మరించిన ఈ వైఖరిని దేశ ప్రజలు గమనించారని చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో ఎన్డీయే ఆధ్వర్యంలో మహిళా రిజర్వేషన్ల అమలు చేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రతిపక్షాల వైఖరిని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్తామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

సంపన్న బాలికలే టార్గెట్.. కీలక నిందితుడు అరెస్టు..

9 రాష్ట్రాల్లో హైదరాబాద్ పోలీస్ ఆక్టోపస్‌ ఆపరేషన్‌

Updated Date - Apr 19 , 2026 | 09:08 PM