పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి తప్పిన ముప్పు.. కుల్కచర్లలో డ్రోన్ ప్రదర్శనలో అపశృతి!
ABN , Publish Date - Apr 19 , 2026 | 05:41 PM
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి ఇవాళ తృటిలో ప్రమాదం తప్పింది. PACS ఆధ్వర్యంలో రైతుల కోసం కొత్తగా కొనుగోలు చేసిన డ్రోన్ ప్రదర్శన నిర్వహిస్తుండగా, అది ఒక్కసారిగా అదుపు తప్పి ఎమ్మెల్యే బృందంపైకి దూసుకొచ్చింది.
కుల్కచర్ల, ఏప్రిల్ 19: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో ఈరోజు అనూహ్య ఘటన చోటు చేసుకుంది. పరిగి ఎమ్మెల్యే టీ. రామ్మోహన్ రెడ్డికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో రైతుల కోసం కొత్తగా కొనుగోలు చేసిన డ్రోన్ ప్రదర్శన నిర్వహిస్తుండగా, అది ఒక్కసారిగా అదుపు తప్పి ఎమ్మెల్యే బృందంపైకి దూసుకువచ్చింది.
అసలేం జరిగిందంటే?
రైతులు వ్యవసాయ పనుల కోసం ఉపయోగించే డ్రోన్ పనితీరును పరిశీలించేందుకు కుల్కచర్లలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఈ డ్రోన్ ట్రయల్ రన్‌ను ప్రారంభించారు. డ్రోన్ గాలిలోకి ఎగిరిన కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో ఆపరేటర్ నియంత్రణ కోల్పోయారు. దీంతో ఆ డ్రోన్ వేగంగా నేరుగా ఎమ్మెల్యే, అక్కడ ఉన్న నాయకుల వైపు దూసుకొచ్చింది.
ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి డ్రోన్ రెక్కలు బలంగా తగలడంతో ఎమ్మెల్యే కాలికి గాయమైంది. స్థానిక నేత తిరుమలపూర్ వెంకటయ్య గౌడ్ కాలికి కూడా దెబ్బతగిలి రక్తస్రావమైంది. రాంపూర్ సర్పంచ్ తిరుపతయ్యకు చేతి బొటనవేలు తెగిపోయింది.
ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు, అనుచరులు బాధితులను హుటాహుటిన పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే సహా మిగిలిన ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. సాంకేతిక లోపం వల్ల జరిగిన ఈ అపశృతితో ఒక్కసారిగా కుల్కచర్లలో కలకలం రేగింది. ఎమ్మెల్యేకు పెద్ద ప్రమాదం తప్పడంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి:
మా హక్కులను హరించే అధికారం ఎవరికీ లేదు: ఇరాన్ అధ్యక్షుడు
నేనేమీ జ్యోతిష్యుడిని కాదు.. కానీ సీఎస్కేకి సంజు కెప్టెన్ అవుతాడు: అశ్విన్