మా హక్కులను హరించే అధికారం ఎవరికీ లేదు: ఇరాన్ అధ్యక్షుడు
ABN , Publish Date - Apr 19 , 2026 | 04:47 PM
అణు కార్యక్రమాలు చేపట్టడం తమ హక్కు అని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తాజాగా స్పష్టం చేశారు. దాన్ని హరించే అధికారం ఎవరికీ లేదని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: తమ గౌరవాన్ని నిలుపుకుంటూనే యుద్ధాన్ని ముగించాలని భావిస్తున్నామని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తాజాగా పేర్కొన్నారు. తమ ‘అణు’ హక్కులను హరించేందుకు ఏ దేశమూ ప్రయత్నించకూడదని స్పష్టం చేశారు. యూరేనియం శుద్ధి తమ హక్కు అని తేల్చి చెప్పారు. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా అభ్యంతరాలు లేవనెత్తుతున్న తరుణంలో పెజెష్కియాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కనీసం 20 ఏళ్ల పాటు ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పునరుద్ధరించకూడదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుబడుతున్న విషయం తెలిసిందే.
యుద్ధాన్ని మరింత విస్తృతం చేయదలుచుకోలేదని పెజెష్కియాన్ అన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. గల్ఫ్‌లో శాంతి స్థాపన, సుస్థిరత లక్ష్యంగా తమ విధానాలు ఉంటాయని ఆయన తెలిపారు. అయితే, తమ అణు కార్యక్రమంపై ఆంక్షలు విధించే అధికారం ఏ దేశానికి ఉండదని అన్నారు. అందరి విషయంలో ఒకేలా వ్యవహరించాలని, వివక్ష ఉండవద్దని తాము డిమాండ్ చేస్తున్నామని పెజెష్కియాన్ తెలిపారు.
తాము ఇప్పటివరకూ ఎలాంటి ఘర్షణలకు కారణం కాలేదని చెప్పారు. ఇతర దేశాలపై దాడులు చేసే ఉద్దేశం తమకు లేదని అన్నారు. తమ హక్కు అయిన స్వీయ రక్షణ చర్యలను మాత్రమే చేపడుతున్నామని చెప్పారు. ‘మా అణు హక్కులపై ట్రంప్ ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏ కారణంతో ఇలా చేస్తున్నారనేది మాత్రం చెప్పడం లేదు. అసలు మా హక్కులను కాదనడానికి ఆయన ఎవరు?’ అని పెజెష్కియాన్ అన్నట్టు ఇరాన్ మీడియా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది.
ఈ వార్తలనూ చదవండి:
భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. వైరల్‌గా మారిన ఆడియో
ఇటలీలో దారుణం.. గురుద్వారా ఎదుట ఇద్దరు భారతీయుల దారుణ హత్య..