Share News

భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. వైరల్‌గా మారిన ఆడియో

ABN , Publish Date - Apr 19 , 2026 | 03:09 PM

ఇరాన్ కాల్పుల నేపథ్యంలో రెండు మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును భారత్‌కు తీసుకొస్తున్న ఆ రెండు ట్యాంకర్లు హోర్ముజ్ జలసంధి నుంచి వెనక్కి మళ్లినట్టు ట్యాంకర్ ట్రాకర్ తెలిపింది. దాడికి సంబంధించిన ఓ ఆడియో క్లిప్‌ను ట్యాంకర్ ట్రాకర్ విడుదల చేసింది.

భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. వైరల్‌గా మారిన ఆడియో
Indian tanker Sanmar Herald

ఇంటర్‌నెట్ డెస్క్: హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న రెండు భారత వాణిజ్య నౌకలపై ఐఆర్‌జీసీకి చెందిన గన్‌బోట్లు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. నౌకలపై భారత జెండాలు ఉన్నప్పటికి ఈ దాడి జరిగింది. కాల్పుల నేపథ్యంలో రెండు మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును భారత్‌కు తీసుకొస్తున్న ఆ రెండు ట్యాంకర్లు హోర్ముజ్ జలసంధి నుంచి వెనక్కి మళ్లినట్టు ట్యాంకర్ ట్రాకర్ తెలిపింది. ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని సమాచారం. ఇక, దాడికి సంబంధించిన ఓ ఆడియో క్లిప్‌ను ట్యాంకర్ ట్రాకర్ విడుదల చేసింది.


30 సెకన్లు ఉన్న ఆ ఆడియో క్లిప్‌లో ఏముందంటే.. రెండు భారత వాణిజ్య నౌకలపై ఐఆర్‌జీసీకి చెందిన గన్‌బోట్లు కాల్పులు జరుపుతున్న సమయంలో వాటిలో సన్మర్ హెరాల్డ్ నౌక నుంచి ఓ అధికారి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘సెఫా నేవీ, సెఫా నేవీ.. సన్మర్ హెరాల్డ్ నౌక నుంచి మాట్లాడుతున్నాను. మేము వెళ్లడానికి మీరు అనుమతి ఇచ్చారు. కానీ, ఇప్పుడేమో కాల్పులు జరుపుతున్నారు. నౌకను వెనక్కు తిప్పనివ్వండి’ అని అన్నాడు. ఇరాన్ కాల్పులు జరిపిన మరో భారత నౌక ‘జగ్ ఆర్నవ్’గా తెలియవచ్చింది.


ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్..

భారత వాణిజ్య నౌకలపై ఐఆర్‌జీసీకి చెందిన గన్‌బోట్లు కాల్పులు జరిపటంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. శనివారం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇరాన్ రాయబారితో మాట్లాడింది. వ్యాపార నౌకలు, నావికుల భద్రతకు భారతదేశం ఇచ్చే ప్రాధాన్యతను విదేశీ వ్యవహారాల కార్యదర్శి గుర్తుచేశారు. గతంలో భారతదేశానికి వచ్చే పలు నౌకలు సురక్షితంగా వెళ్లేందుకు ఇరాన్ సహకరించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఇరాన్ అధికారులకు భారతదేశ అభిప్రాయాలను తెలియజేయాలని, అలాగే జలసంధి గుండా భారతదేశానికి వచ్చే నౌకలకు సౌకర్యాలు కల్పించే ప్రక్రియను వీలైనంత త్వరగా పునఃప్రారంభించాలని కోరారు.


ఇవి కూడా చదవండి

భవన నిర్మాణ రంగ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి వివేక్..

ద్రౌపది వస్త్రాపహరణాన్ని తలపించిన విపక్షాల చర్య: యోగి ఆదిత్యనాథ

Updated Date - Apr 19 , 2026 | 03:30 PM