Share News

ద్రౌపది వస్త్రాపహరణాన్ని తలపించిన విపక్షాల చర్య: యోగి ఆదిత్యనాథ్

ABN , Publish Date - Apr 19 , 2026 | 02:54 PM

మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) విపక్షాలపై నిప్పులు చెరిగారు. విపక్షాలు మహిళా వ్యతిరేకులని, మహిళలకు రాజకీయ సాధికారత కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును అడ్డుకునేందుకు ఉద్దేశపూర్వకంగా కుట్ర చేశారని ఆరోపించారు.

ద్రౌపది వస్త్రాపహరణాన్ని తలపించిన విపక్షాల చర్య: యోగి ఆదిత్యనాథ్
Yogi Adityanath

లక్నో: మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) విపక్షాలపై నిప్పులు చెరిగారు. విపక్షాలు మహిళా వ్యతిరేకులని, మహిళలకు రాజకీయ సాధికారత కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును అడ్డుకునేందుకు ఉద్దేశపూర్వకంగా కుట్ర చేశారని ఆరోపించారు. వీరిని మహిళలు ఎన్నటికీ క్షమించరని అన్నారు. పార్లమెంటులో విపక్షాల ప్రవర్తన నిండుసభలో 'ద్రౌపది వస్త్రాపహరణ' ఘట్టాన్ని గుర్తుకు తెచ్చిందన్నారు. ఆదివారంనాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యోగి ఆదిత్యనాథ్‌తో పాటు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణ దేవి, ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి, మంత్రులు ఓం ప్రకాష్ రాజ్‌భర్, సంజయ్ నిషాద్ పాల్గొన్నారు.


నారీశక్తి వందన్ చట్టానికి బలం చేకూర్చే ప్రతిపాదిత సవరణ లోక్‌సభలో ఆమోదం పొందినట్లయితే అన్ని పార్టీలకు కూడా ఆ ఘనత దక్కేదని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. విపక్షాల మహిళా వ్యతిరేక ప్రవర్తన మహిళందరికీ ఆగ్రహం తెప్పించిందని, కాంగ్రెస్‌తో పాటు 'ఇండియా' కూటమి భాగస్వాములైన ఎస్‌పీ, ఆర్జేడీ, డీఎంకే ఇతర పార్టీలకు కూడా ఈ పాపంలో భాగం ఉందని విమర్శించారు. దేశం, సమాజ ప్రయోజనాల కోసం ప్రధానమంత్రి తీసుకుంటున్న ప్రతి చర్యను అడ్డుకోవడమే విపక్షాలు పనిగా పెట్టుకున్నాయని ఆరోపించారు. 'పార్లమెంటులో 'ఇండి' కూటమి ప్రవర్తన నిండుసభలో ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టాన్ని గుర్తుచేస్తోంది. విపక్షాలు ఏమాత్రం బాధ్యతలేని వ్యాఖ్యలు చేయడం వారి ప్రవర్తనను తేటతెల్లం చేసింది' అని అన్నారు.


ముస్లిం మహిళలకు రిజర్వేషన్ రాజ్యాంగవిరుద్ధం

ముస్లిం మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలంటూ సమాజ్‌వాదీ పార్టీ పార్లమెంటులో చేసిన డిమాండ్ రాజ్యంగ విరుద్ధమని యోగి ఆదిత్యనాథ్ తప్పుపట్టారు. మతం పేరుతో రిజర్వేషన్లకు రాజ్యాంగం అనుమతించదని చెప్పారు. మతప్రాతిపదకపై రిజర్వేషన్లను బీఆర్ అంబేడ్కర్, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ కూడా వ్యతిరేకించారని గుర్తు చేశారు.


ఏప్రిల్ 17 బ్లాక్ డే

ఏప్రిల్ 17వ తేదీని 'బ్లాక్‌డే'గా కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవి అభివర్ణించారు. దేశంలోని లక్షలాది మంది మహిళలు చట్ట సవరణపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చెప్పారు. మహిళా వ్యతిరేక భావజాలం కలిగిన విపక్షాలు చట్ట సవరణకు వ్యతిరేకంగా ఓటు వేశాయని, కీలకమైన బిల్లును ఓడించడమే కాకుండా, లక్షలాది మంది మహిళల విశ్వాసాన్ని ముక్కలు చేశాయని ఘాటుగా విమర్శించారు. గత శుక్రవారంనాడు మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లుపై ఓటింగ్ జరుగగా, 298 మంది బిల్లుకు అనుకూలంగా, 230 మంది బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో మెజారిటీ లేకపోవడంతో బిల్లు వీగిపోయింది.


ఇవి కూడా చదవండి..

మహిళలూ క్షమించండి

543 సీట్లతోనే మహిళా కోటా..

Updated Date - Apr 19 , 2026 | 02:57 PM