Share News

దేశాన్ని అమ్మేసిన మోదీ!

ABN , Publish Date - Apr 19 , 2026 | 06:25 AM

ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికాతో చేసుకున్న ఒప్పందంతో భారత్‌ను అగ్రరాజ్యానికి అమ్మేశారని అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌...

దేశాన్ని అమ్మేసిన మోదీ!

ట్రంప్‌ నియంత్రణలో పాలన.. దీనికి కారణం ఎప్‌స్టీన్‌ ఫైల్సే

ఆయన దూకమంటే దూకుతారు.. పడుకోమంటే పడుకుంటారు

తమిళనాడులో చొరబాటుకు బీజేపీ-ఆర్‌ఎ్‌సఎస్‌ యత్నాలు

మోదీ కనుసన్నల్లో అన్నాడీఎంకే.. అసలు పార్టీ చచ్చిపోయింది

మహిళా బిల్లుపై కేంద్ర ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోంది

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ వ్యాఖ్యలు

రాణీపేట, ఏప్రిల్‌ 18: ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికాతో చేసుకున్న ఒప్పందంతో భారత్‌ను అగ్రరాజ్యానికి అమ్మేశారని అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నియంత్రణలో మోదీ పనిచేస్తున్నారని, ట్రంప్‌ దూకమంటే దూకుతారని, పడుకోమంటే పడుకుంటారని ఎద్దేవా చేశారు. మోదీ పూర్తిస్థాయిలో ట్రంప్‌ నియంత్రణలోకి వెళ్లిపోయారని చెప్పారు. దీనికి కారణం ఎప్‌స్టీన్‌ ఫైల్సేనని, మోదీ-అదానీల మధ్య ఉన్న ఆర్థిక బంధం ట్రంప్‌కు బాగా అర్థమైందన్నారు. అందుకే, మోదీ.. ట్రంప్‌ నియంత్రణలోకి వెళ్లిపోయారన్నారు. ‘‘మన రైతులను, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రధాని మోదీ అమెరికాకు అమ్మేశారు. ఇంధన భద్రత సహా మన సమాచారాన్ని(డేటా) కూడా వారి చేతిలో పెట్టారు’’ అని రాహుల్‌ అన్నారు. అలానే.. తమిళనాడు తన కనుసన్నల్లో ఉండాలని మోదీ కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే అన్నాడీఎంకేకు అధికారం కట్టబెట్టాలని పిలుపునిస్తున్నారని దుయ్యబట్టారు. తమిళనాట అన్నాడీఎంకే అధికారంలోకి వస్తే.. ఆ పార్టీ తరఫున ఎంపికయ్యే ముఖ్యమంత్రిని తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాణీపేట, పొన్నేరి సహా పలు ప్రాంతాల్లో నిర్వహించిన ప్రచారంలో రాహుల్‌ గాంధీ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘తమిళనాడు సీఎంగా స్టాలిన్‌ ఉంటే తన పప్పులు ఉడకవని ప్రధాని మోదీకి బాగా తెలుసు. అందుకే.. అన్నాడీఎంకేను ముందుపెట్టి రాష్ట్రంపై నియంత్రణ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ అధికారంలోకి కానీ, డీఎంకే-కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమి రాష్ట్రంలో క్లీన్‌ స్వీప్‌ చేస్తుంది’’ అని రాహుల్‌గాంధీ అన్నారు. ‘‘కొత్త అన్నాడీఎంకే కేవలం ఒక మాస్క్‌ మాత్రమే. అది బీజేపీని కప్పిపుచ్చుతోంది. వాస్తవానికి డీఎంకే మాదిరిగా అన్నాడీఎంకే కూడా తమిళులను కాపాడే సంప్రదాయం ఉండేది. కానీ.. ఆ పార్టీ ఎప్పుడో చచ్చిపోయింది.’’ అని అన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును అడ్డం పెట్టుకుని నియోజకవర్గాల పునర్విభజన ద్వారా దక్షిణాది సహా ఈశాన్య, చిన్న రాష్ట్రాలకు అన్యాయం చేయాలని కేంద్రం భావించిందని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ముఖ్యంగా పార్లమెంటులో తమిళనాడు ప్రాతినిధ్యాన్ని తగ్గించాలన్న కుట్ర ఉందని వ్యాఖ్యానించారు. వాస్తవానికి మహిళా బిల్లును 2023లోనే ఆమోదించుకున్నామని ఆయన తెలిపారు. పార్లమెంటులో డీలిమిటేషన్‌ బిల్లును తిప్పికొట్టడం ద్వారా దేశాన్ని రక్షించుకోగలిగామన్నారు. ‘‘పెరియార్‌ ఆలోచనలను, ప్రభుత్వ నమూనాను, సామాజిక న్యాయ భావనను ధ్వంసం చేయాలని ఆర్‌ఎ్‌సఎస్‌, బీజేపీలు కంకణం కట్టుకున్నాయి. వీరు చేస్తున్న ప్రచారాన్ని తమిళనాడు ప్రజలే అడ్డుకోవాలి.’’ అని రాహుల్‌ పిలుపునిచ్చారు. ఆర్‌ఎ్‌సఎ్‌స-బీజేపీల కబంద హస్తాల్లోకి తమిళనాడు వెళ్లిపోకుండా ఇక్కడి ప్రజలే అడ్డుకోవాలని కోరారు.


మోదీ, షా దేశానికి అబద్ధం చెప్పారు!

మహిళా బిల్లు విషయంలో మోదీ, అమిత్‌ షాలు దేశ ప్రజలకు అబద్ధం చెప్పారని, అసోం, జమ్ముకశ్మీర్‌ నమూనాలను అనుకరించడానికి ప్రయత్నించారని రాహుల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అసోం, జమ్ముకశ్మీర్‌ ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చేసిందని, ఇప్పుడు దేశమంతా అలానే మార్చేయాలని చూసిందని దుయ్యబట్టారు. బిల్లును పాస్‌ చేయడం ద్వారా మహిళలకు రిజర్వేషన్‌ కల్పిస్తున్నామని చెప్పడం శుద్ధ అబద్ధమన్నారు. దేశ ఎన్నికల విధానాన్ని, రాష్ట్లాల ఎన్నికల విధానాన్ని సమూలంగా మార్చేయాలని కుట్ర చేశారన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...

చెవిరెడ్డి కుటుంబ అవినీతి మెుత్తాన్నీ త్వరలో బయటపెడతాం.. పులివర్తి నాని వార్నింగ్

ఎల్‌ఓసీ రద్దు పిటిషన్‌పై సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టు షాక్

Updated Date - Apr 19 , 2026 | 06:25 AM