మహిళలూ క్షమించండి
ABN , Publish Date - Apr 19 , 2026 | 06:35 AM
భారత నారీ శక్తిని ఎదగనీయకుండా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ప్రతిపక్షాలు కుటిల రాజకీయాలతో దేశ మహిళల కలలను...
కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఎస్పీ స్వార్థ రాజకీయాలతో దేశ మహిళలకు నష్టం
మహిళా బిల్లుపై మేం నిజాయతీగా చేసిన
ప్రయత్నాన్ని ఆ పార్టీలు భ్రూణ హత్య చేశాయి
మహిళా బిల్లు వీగిపోయాక ప్రతిపక్ష సభ్యులు
ఆనందంతో బల్లలు చరిచారు.. బాధ కలిగింది
అది మహిళల ఆత్మగౌరవంపై జరిగిన దాడి
ఈ తీరును మహిళాలోకం మరవదు.. శిక్షిస్తుంది
అన్ని రాష్ట్రాలకు 50% సీట్లు పెంచుతామన్నాం
అయినా విభజన రాజకీయాలను
రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షాల ప్రయత్నం
కాంగ్రెస్ ఉనికి కోల్పోతోంది.. పరాన్న జీవిలా
ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి బతుకుతోంది
బిల్లు వీగినంత మాత్రాన ఓడినట్టు కాదు: మోదీ
కోటాకు అడ్డంకులన్నీ తొలగిస్తామని హామీ
జాతిని ఉద్దేశించి 30 నిమిషాల ప్రసంగం
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు పాస్ కాకపోవడంపై భారత మహిళలందరినీ క్షమాపణ కోరుతున్నాను. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, సమాజ్‌వాదీ వంటి పార్టీల స్వార్థ రాజకీయాల కారణంగా దేశ మహిళలకు తీవ్ర నష్టం కలిగింది. పార్లమెంటులో మహిళా బిల్లు వీగిపోగానే ఆ పార్టీల వాళ్లు ఆనందంతో బల్లలు చరిచారు. అది బల్లలు చరవడం కాదు మహిళల ఆత్మగౌరవంపై జరిగిన దాడి. అది చూసి చాలా బాధ కలిగింది. మహిళలు అన్నీ గమనిస్తున్నారు. వారిని కచ్చితంగా శిక్షిస్తారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: భారత నారీ శక్తిని ఎదగనీయకుండా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ప్రతిపక్షాలు కుటిల రాజకీయాలతో దేశ మహిళల కలలను కల్లలు చేశాయని మండిపడ్డారు. వారి తీరుపట్ల భారత మహిళలకు తాను క్షమాపణ చెబుతున్నట్టు పేర్కొన్నారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులు వీగిపోయిన నేపథ్యంలో మోదీ శనివారం జాతినుద్దేశించి 30 నిమిషాల పాటు ఉద్వేగంగా ప్రసంగించారు. ఈ క్రమంలో కాంగ్రె్‌సతోపాటు టీఎంసీ, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీల పేర్లను ప్రస్తావిస్తూ ఘాటుగా విమర్శలు చేశారు. ‘‘కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మహిళల శక్తిని తక్కువగా అంచనా వేశాయి. మహిళలు దేనినైనా మర్చిపోవచ్చు. కానీ తమకు జరిగిన అవమానాన్ని ఎన్నటికీ మర్చిపోరు. వారు అన్నీ గమనిస్తున్నారు. కచ్చితంగా శిక్షిస్తారు. ఎప్పుడైనా ఈ నేతలు వారికి కనిపించినప్పుడు మహిళల రిజర్వేషన్ ఆశలను నాశనం చేసినవారు వీరేనని.. పార్లమెంటులో ఆనందంతో బల్లలు చరిచారని గుర్తు చేసుకుంటారు’’ అని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్, ఎస్పీ, డీఎంకే, టీఎంసీ ఎప్పుడూ ఏదో ఒక సాంకేతిక కారణాన్ని అడ్డుపెట్టుకుని మహిళల హక్కులను దోచుకుంటూ వస్తున్నాయని మండిపడ్డారు. మహిళా శక్తి బలోపేతమైతే ఎక్కడ వారి వారసత్వ రాజకీయాలకు, నాయకత్వానికి ముప్పు వస్తుందోననేదే వారి భయమని పేర్కొన్నారు. చిన్న రాష్ట్రమైనా, పెద్ద రాష్ట్రమైనా సరే.. ప్రతి రాష్ట్రానికి 50శాతం పార్లమెంటు సీట్లను ఇవ్వడానికి సిద్ధమయ్యామని మోదీ చెప్పారు. ‘‘మహిళా బిల్లు, డీలిమిటేషన్‌కు సంబంధించి గొప్పతనాన్ని కూడా ప్రతిపక్షానికి ఇవ్వడానికి సిద్ధమని చెప్పాం. అయినా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మొత్తం దేశం చూస్తుండగానే.. మా నిజాయతీ ప్రయత్నాన్ని భ్రూణ హత్య చేశాయి.
డీలిమిటేషన్‌పై ప్రతిపక్షాలు అవాస్తవాలు చెబుతున్నాయి. ఈ అంశాన్ని ఉపయోగించుకుని విభజన రాజకీయాలను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ ఈ ‘విభజించు-పాలించు’ విధానాన్ని బ్రిటీషర్ల నుంచి వారసత్వంగా తీసుకుంది. కాంగ్రెస్ తన దశాబ్దాల తప్పును దిద్దుకుంటుందని, పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటుందని భావించాను. కానీ మహిళలకు మద్దతుగా నిలిచే సదవకాశాన్ని పోగొట్టుకుంది. కాంగ్రెస్ దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉనికి కోల్పోయింది. పరాన్నజీవిలా ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి బతుకుతోంది. ఆ ప్రాంతీయ పార్టీలు బలపడాలని కోరుకోవడం లేదు. అందుకే వాటిని ఈ బిల్లులకు వ్యతిరేకంగా ముందు నిలబెట్టింది’’ అని మోదీ అన్నారు.
అన్ని సమస్యలకు మూలం కాంగ్రెసే..
ఏ సంస్కరణలు వచ్చినా అబద్ధాలు చెప్పడం, అపోహలు వ్యాప్తి చేయడం కాంగ్రె్‌సకు అలవాటని మోదీ మండిపడ్డారు. మనతోపాటే చాలా దేశాలకు స్వాతంత్య్రం వచ్చిందని.. చాలా దేశాలు మనను దాటి ఎంతో ముందుకు వెళ్లిపోయాయ చెప్పారు. సంస్కరణలను కాంగ్రెస్ వ్యతిరేకించడమే దానికి కారణమన్నారు. ‘‘కాంగ్రెస్ సంస్కరణల వ్యతిరేక పార్టీ. ఆలస్యం చేయడం, తప్పుదారి పట్టించడం, అడ్డుకోవడం కాంగ్రెస్ మూల సూత్రం. దేశ సరిహద్దు వివాదాలను పెండింగ్‌లో పెట్టింది. పాకిస్థాన్‌తో నీటి పంపకం అంశాలను ఆలస్యం చేసింది. ఓబీసీ రిజర్వేషన్లపై నిర్ణయాన్ని 40 ఏళ్లు పెండింగ్‌లో పెట్టింది. జమిలి ఎన్నికలకు వ్యతిరేకం, అక్రమ వలసదారులను పంపేయడానికి వ్యతిరేకం, సీఏఏకు, సర్ ప్రక్రియకు వ్యతిరేకం. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలన్నీ కాంగ్రెస్ తీరుతో ఏర్పడినవే. అందువల్ల ఈ పోరాటం కేవలం చట్టం గురించే కాదు. కాంగ్రెస్ సంస్కరణల వ్యతిరేక మనస్తత్వంపై పోరాటం. కాంగ్రె్‌సకు దేశ మహిళలు గట్టిగా బుద్ధి చెబుతారన్నది నా నమ్మకం’’ అన్నారు.
మేం ఓడినట్టు కాదు.
లోక్‌భలో మహిళా బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండింతుల మెజారిటీ లేనంత మాత్రాన బీజేపీ ఓడిపోయినట్టు కాదని మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా మహిళల మద్దతు తమకు ఉందని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఉన్న ప్రతి అడ్డంకిని తొలగిస్తామని దేశంలోని మహిళలందరికీ హామీ ఇస్తున్నట్టు తెలిపారు.
ప్రధాని ప్రసంగంలో నిస్పృహ: కాంగ్రెస్
లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లును విపక్షాలు వీగిపోయేలా చేశాయంటూ ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. నిరాశ, నిస్పృహలతో ప్రధాని ప్రసంగం సాగిందని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఎద్దేవా చేశారు. ప్రధాని ప్రసంగంలో కాంగ్రె్‌సను 59 సార్లు ప్రస్తావించారని, మహిళల గురించి పెద్దగా ప్రస్తావించలేదన్నారు. ప్రధాని ప్రసంగం జాతిని ఉద్దేశించి చేసింది కాదని, కాంగ్రెస్‌ను తిట్టడానికి చేసినట్లుగా ఉందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ చెప్పారు.
ప్రతిపక్షాలు మూల్యం చెల్లించుకోవాల్సిందే
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే 131వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో వీగిపోయేలా చేయడం ద్వారా విపక్షాలు తప్పు చేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. పార్లమెంట్ హౌస్‌లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ప్రతిపక్షాలు మహిళలకు వ్యతిరేకమనే విషయాన్ని గ్రామగ్రామానికి తీసుకెళ్లాలని ప్రధాని మంత్రివర్గ సహచరులకు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
చెవిరెడ్డి కుటుంబ అవినీతి మెుత్తాన్నీ త్వరలో బయటపెడతాం.. పులివర్తి నాని వార్నింగ్
ఎల్‌ఓసీ రద్దు పిటిషన్‌పై సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టు షాక్