Share News

విదేశీ కొలువుకు సర్కారు భరోసా!

ABN , Publish Date - Nov 28 , 2026 | 05:02 AM

విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని కలలు కనే పేద, మధ్యతరగతి నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.

విదేశీ కొలువుకు సర్కారు భరోసా!

  • కొత్తగా ముఖ్యమంత్రి విదేశీ ఉపాధి పథకం

  • భాషా శిక్షణ, ప్రయాణ చార్జీల్లో సగం ఖర్చు సర్కార్‌దే

  • భాషా శిక్షణ అవసరమైన వారికి రూ.1.75 లక్షలు,

  • అవసరం లేని వారికి రూ.50వేల చొప్పున సాయం

  • తొలి ఏడాది 7 వేల మందికి.. కుటుంబంలో ఒక్కరికే

  • ‘ఈడబ్ల్యూఎస్‌’ ఆదాయ పరిమితిలో ఉన్న వాళ్లే అర్హులు

హైదరాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని కలలు కనే పేద, మధ్యతరగతి నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అవగాహన లోపం, నైపుణ్యాల కొరత, ఆర్థిక భారంతో విదేశాల్లోని ఉద్యోగ అవకాశాలను అందుకోలేకపోతున్న యువతకు అండగా నిలిచేందుకు ‘ముఖ్యమంత్రి విదేశీ ఉపాధి పథకం (చీఫ్‌ మినిస్టర్స్‌ ఓవర్‌సీస్‌ ఎంప్లాయ్‌మెంట్‌ స్కీమ్‌-సీఎంవోఈఎస్‌)’ ను ప్రవేశపెట్టింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేస్తూ నైపుణ్యం, జ్ఞాన శిక్షణ కార్యక్రమాల శాఖ (శక్తి) కార్యదర్శి హరిచందన దాసరి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ లిమిటెడ్‌(టామ్‌కామ్‌) ఆధ్వర్యంలో అమలయ్యే ఈ పథకం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 7 వేల మంది యువతకు సురక్షితమైన, చట్టబద్ధమైన విదేశీ ఉపాధి అవకాశాలను కల్పించనున్నారు.


ఇందులో మహిళలకు 33.33 శాతం, దివ్యాంగులకు 5శాతం కోటాను రిజర్వ్‌ చేశారు. ఒక వేల అర్హులైన మహిళలు, దివ్యాంగులు తగినంత మంది లేకపోతే.. రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదంతో ఆ సీట్లను అర్హులకు కేటాయిస్తారు. విదేశీ ఉద్యోగాలకు వెళ్లే అభ్యర్థులను ప్రభుత్వం రెండు కేటగిరీలుగా విభజించి 50శాతం సబ్సిడీని అందిస్తోంది. విదేశీ భాషా శిక్షణ అవసరం లేకుండా నేరుగా ఉద్యోగాలకు వెళ్లే 5,880 మందిని మొదటి కేటగిరీలో చేర్చారు. వీరికి వీసా, విమాన ప్రయాణ ఖర్చుల కింద గరిష్ఠంగా రూ.లక్ష వరకు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని, అందులో 50శాతం అంటే.. రూ.50వేలు సబ్సిడీ కింద అందజేస్తారు.


అలాగే గమ్యస్థాన దేశ భాషలో ప్రావీణ్యం తప్పనిసరి అయిన ఉద్యోగాలకు వెళ్లే 1,120 మందిని రెండో కేటగిలో చేర్చారు. వీరికి గరిష్ఠ యూనిట్‌ వ్యయం రూ.3.50 లక్షలుగా నిర్ణయించగా, అందులో 50శాతం అంటే రూ.1.75లక్షల వరకు అందిస్తారు. రెండు కేటగిరీల్లోనూ మిగతా 50శాతం ఖర్చును అభ్యర్థులు భరించాల్సి ఉంటుంది. సొంతంగా డబ్బు సమకూర్చుకో లేని వారికి రుణం ఇప్పించేందుకు జాతీయ బ్యాంకులతో టామ్‌కామ్‌ సమన్వయం చేసుకుంటుంది. నిర్మాణం, మౌలిక సదుపాయాలు, తయారీ, ఆటోమొబైల్‌, మెకానికల్‌, ఎలక్ర్టికల్‌, ఎలక్ర్టానిక్స్‌, రవాణా-లాజిస్టిక్స్‌, వైద్య సహాయక సేవలు, హోటళ్లు-పర్యాటకం, గృహ-వ్యక్తిగత సేవల రంగాల్లో అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తారు.


అర్హతలు.. నిబంధనలు ఇవే...

సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా ఈడబ్ల్యూఎస్‌ ఆదాయ పరిమితిలో ఉన్న 18 నుంచి 40 ఏళ్ల వయస్సు గల నిరుద్యోగులు ఈ పథకానికి అర్హులు. అభ్యర్థులు స్థానికులై ఉండటంతోపాటు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు రాష్ట్రంలోనే చదివి ఉండాలి. ఐటీఐ అర్హతతో వెళ్లే వారు రాష్ట్రంలోని గుర్తింపు పొందిన సంస్థల్లో చదవాలి. దరఖాస్తు నాటికి సంబంధిత వృత్తిలో రెండేళ్ల పని అనుభవం తప్పనిసరి. రేషన్‌ కార్డు ప్రాతిపదికన ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే సబ్సిడీ వర్తిస్తుంది. ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు తావు లేకుండా పూర్తిగా టామ్‌కామ్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారానే దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆధార్‌, రేషన్‌/ఆహార భద్రత కార్డు, ఆదాయ, విద్యార్హత, అనుభవ ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. జిల్లా ఉపాధి కల్పన అధికారి ప్రాథమిక జాబితా రూపొందించాక.. ఆర్డీవో లేదా తహసీల్దార్‌ పత్రాలను పరిశీలిస్తారు.


కలెక్టర్‌ అధ్యక్షతన ఉండే జిల్లా స్థాయి కమిటీ అర్హులను గుర్తించి, టామ్‌కామ్‌ ఎండీ నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి కమిటీకి సిఫారసు చేస్తుంది. దరఖాస్తు గడువు ముగిసిన 30 రోజుల్లోగా ఎంపిక పూర్తవుతుంది. భాషా శిక్షణ అవసరం లేని వారికి ఇంటర్వ్యూలో ఎంపికై వీసా పొందాక 50శాతం సొమ్ము చెల్లిస్తారు. భాషా శిక్షణ అవసరం ఉన్న వారికి.. శిక్షణ ఖర్చులో 50శాతం ఇస్తారు. వీరికి ప్రయాణ సబ్సిడీ ఉండదు. భాషా పరీక్ష పాసైన వారికైతే వీసా, ప్రయాణ ఖర్చుల్లో 50శాతం అందజేస్తారు. ఈ రెండు ఆప్షన్లలో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాలి. మధ్యలో వైదొలిగినా, తప్పుడు పత్రాలు సమర్పించినా ఎంపికను రద్దు చేసి, చెల్లించిన సబ్సిడీని తిరిగి వసూలు చేస్తారు. విదేశాల్లో చేరిన వారి పురోగతి జిల్లా అధికారులు ప్రతి మూడు నెలలకు టామ్‌కామ్‌కు నివేదిక అందజేస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి...

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్

Updated Date - Nov 28 , 2026 | 05:02 AM