Share News

ప్రక్షాళనకు వేళాయె!

ABN , Publish Date - May 01 , 2026 | 05:37 AM

రాష్ట్రంలో మంత్రివర్గ ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతోంది. ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లు పూర్తవుతుండటం, పలువురు మంత్రుల పనితీరుపై అసంతృప్తి, హామీ పొందినవారికి అవకాశం కల్పించడం లక్ష్యంగా మంత్రివర్గ ....

ప్రక్షాళనకు వేళాయె!

  • రెండు వారాల్లో రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ

  • సర్కారు ఏర్పడి రెండున్నరేళ్లు అవుతుండడంతో నిర్ణయం.. కొందరి తీరుపై అధిష్ఠానం అసంతృప్తి

  • ఇద్దరు మంత్రులను తప్పించి కొత్తవారికి చాన్స్‌?

  • అవకాశమున్న మేరకు మరొకరికీ పదవి

  • జూన్‌ 2 నాటికల్లా ముగ్గురు కొత్త మంత్రులు!

  • కీలక శాఖల్లో మార్పులు ఖాయం

  • వివిధ కోటాల కింద క్యాబినెట్‌ బెర్త్‌ కోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రయత్నాలు

  • కోమటిరెడ్డి సోదరుల్లో ఎవరో ఒకరికే చాన్స్‌!

  • కేరళ, తమిళనాడుల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాక తెలంగాణపై కాంగ్రెస్‌ అధిష్ఠానం దృష్టి

  • టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులపైనా నిర్ణయం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మంత్రివర్గ ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతోంది. ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లు పూర్తవుతుండటం, పలువురు మంత్రుల పనితీరుపై అసంతృప్తి, హామీ పొందినవారికి అవకాశం కల్పించడం లక్ష్యంగా మంత్రివర్గ పునర్య్యవస్థీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలిసింది. ముఖ్యంగా ఇద్దరు మంత్రులకు ఉద్వాసన పలికి, కొత్తవారికి అవకాశం ఇస్తారని.. నిబంధనల మేరకు అవకాశం ఉన్న మరో మంత్రి పదవినీ భర్తీ చేస్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రెండు వారాల్లో ఈ వ్యవహారం ఓ కొలిక్కి రావొచ్చని, జూన్‌ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి ముగ్గురు కొత్త మంత్రులు కొలువుదీరే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో వచ్చే ఫలితాలు, ప్రభుత్వాల ఏర్పాటు అంశాలపై కాంగ్రెస్‌ అధిష్ఠానం తీరిక లేకుండా ఉన్న నేపథ్యంలో.. ఆ పని పూర్తవగానే తెలంగాణ పై దృష్టిసారించనున్నట్టు పేర్కొంటున్నాయి. చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఇతర కమిటీల నియామకాలపైనా అధిష్ఠానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నాయి.


ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కొలువుదీరాక..!

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ, తమిళనాడులపై కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకుంది. కేరళలో యూడీఎఫ్‌, తమిళనాడులో డీఎంకే కూటములు విజయం సాధించవచ్చని ఎగ్జిట్‌పోల్స్‌ పేర్కొన్నాయి. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఆ రాష్ట్రాల వ్యవహారం మే 10 కల్లా పూర్తవుతుందని, ఆ తర్వాత ఎప్పుడైనా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేరళలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, మరో ఇద్దరు సీనియర్లు సీఎం రేసులో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల్లో కేసీ వేణుగోపాల్‌ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయనను సీఎంగా ఎంపిక చేస్తే.. నూతన సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిని నియమించాల్సి ఉంటుంది. అదే జరిగితే తెలంగాణలో మంత్రివర్గ ప్రక్షాళన కాస్త ఆలస్యం కావొచ్చని అంటున్నారు.

కీలక శాఖల్లో మార్పులు ఖాయం!

మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా కీలక మంత్రుల శాఖల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచీ కాంగ్రెస్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అంశాలకు సంబంధించిన రెండు, మూడు శాఖల మంత్రుల పనితీరు పట్ల అధిష్ఠానం అసంతృప్తిగా ఉందని అంటున్నారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉండే ఆ శాఖల మంత్రుల పనితీరుపై ఇప్పటికే నివేదికలు తెప్పించుకుని, పరిశీలించిందని వివరిస్తున్నారు. ఈ క్రమంలో సదరు శాఖలను ఇతరులకు కేటాయించే అవకాశం ఉందని.. దీనితో ఇతర మంత్రుల శాఖల్లోనూ మార్పులు తప్పవని చెబుతున్నారు. పనితీరుతోపాటు సామాజిక, ఇతర సమీకరణాల ఆధారంగా.. ఇద్దరు మంత్రులను తప్పించవచ్చని అంటున్నారు. నిబంధనల ప్రకారం మంత్రివర్గంలో మరొకరికి చోటు కల్పించే చాన్స్‌ ఉండటంతో.. మొత్తంగా ముగ్గురు కొత్త మంత్రులు కొలువుదీరుతారని చెబుతున్నారు. ఇక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి మంత్రివర్గంలో చోటుపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. కేబినెట్‌ బెర్త్‌పై అధిష్ఠానం తనకు హామీ ఉందని రాజగోపాల్‌రెడ్డి పలుమార్లు బహిరంగంగా ప్రకటించారు కూడా.


అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇద్దరు మంత్రులుగా ఉండటం.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి స్వయానా సోదరుడు కావడం రాజగోపాల్‌రెడ్డికి ప్రతిబంధకంగా మారింది. కోమటిరెడ్డి సోదరుల్లో ఒకరికే అవకాశమని, అది ఎవరన్నదీ రాష్ట్ర నాయకత్వం తేల్చుకోవాలని అధిష్ఠానం స్పష్టం చేసినట్టు కాంగ్రెస్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు పెండింగ్‌లో ఉన్న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌, చీఫ్‌ విప్‌ పదవులపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మహబూబాబాద్‌ ఎమ్మెల్యే రామచంద్రనాయక్‌కు డిప్యూటీ స్పీకర్‌ అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించినా.. ఎస్టీ బంజారా కోటాలో మంత్రి పదవి కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి సీనియర్‌ ఎమ్మెల్యే బాలూ నాయక్‌ కూడా ఎస్టీ బంజారా కోటాలోనే మంత్రి పదవి ఆశిస్తున్నారు. చీఫ్‌ విప్‌ పోస్టును ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి గతంలోనే ఆఫర్‌ చేయగా.. ఆయన మంత్రిపదవి కోరుకుంటూ, ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. ఇక పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, మున్నూరు కాపు కోటాలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం కూడా జరుగుతోంది. స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ సైతం మంత్రి వర్గంలో చోటుకోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. వీటన్నింటి నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఆసక్తి నెలకొంది.

పార్టీ పదవుల భర్తీ కూడా..

టీపీసీసీలో పెండింగ్‌లో ఉన్న కార్యనిర్వాహక అధ్యక్షుల నియామకంపైనా అధిష్ఠానం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. రెడ్డి, ఎస్సీ మాదిగ, ఎస్టీ లంబాడా, మైనార్టీ వర్గాల నుంచి కార్యనిర్వాహక అధ్యక్షుల నియామకం జరగనున్నట్లు చెబుతున్నారు. ఎస్సీ మాదిగ నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌ పేరును పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఎస్టీ లంబాడాల్లో ఎంపీ బలరాం నాయక్‌, ట్రైకార్‌ చైర్మన్‌ బెల్లయ్యనాయక్‌.. రెడ్డి సామాజిక వర్గంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి.. మైనార్టీల నుంచి పార్టీ నేత అజ్మతుల్లా, టిమ్రిస్‌ వైస్‌ చైర్మన్‌ ఫహీమ్‌ ఖురేషీల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఇక ప్రచార కమిటీ చైర్మన్‌గా మధుయాష్కీగౌడ్‌ను కొనసాగించాలా, కొత్త వారికి అవకాశమివ్వాలా అన్నదానిపైన నిర్ణయం తీసుకోనున్నట్టు చెబుతున్నారు. కోశాధికారిగా ఖైరతాబాద్‌ డీసీసీ మాజీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డిని నియమించే అవకాశం ఉందని అంటున్నారు.

Updated Date - May 01 , 2026 | 06:50 AM