Share News

దసరా కానుక!

ABN , Publish Date - Oct 02 , 2026 | 03:48 AM

రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరా కానుకగా రెండు కరువు భత్యాల(డీఏ)ను ప్రకటించింది.

దసరా కానుక!
Telangana Cabinet decisions

  • ఉద్యోగులకు 2 డీఏలు చెల్లింపునకు రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం

  • డీఏ బకాయిలు మాత్రం వాయిదాల్లో చెల్లింపు..

  • ప్రభుత్వంపై ఏటా 2,500 కోట్ల రూపాయల భారం

  • రాష్ట్రంలో 235 మండలాల్లో కరువు పరిస్థితులు..

  • ఎల్‌నినోపై త్వరలో క్యాబినెట్‌ కమిటీ సమావేశం, నివేదిక

  • అఖిలపక్షం సలహాలూ స్వీకరించాలని నిర్ణయం..

  • పెరిగిన విద్యుత్తు డిమాండ్‌.. 7,800 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటు

  • కోహెడ పండ్ల మార్కెట్‌కు రూ.650 కోట్లు..

  • జలయజ్ఞం నాటి 10 సాగునీటి ప్రాజెక్టుల రద్దు

  • రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు..

  • మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి వెల్లడి

హైదరాబాద్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరా కానుకగా రెండు కరువు భత్యాల(డీఏ)ను ప్రకటించింది. 2024 నుంచి పెండింగ్‌లో ఉన్న డీఏల్లో రెండింటిని విడుదల చేయడానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రెండింటి బకాయిలను వాయిదాల్లో చెల్లిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా సాగింది. సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఆర్థికంగా భారమైనప్పటికీ ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా ఇచ్చిన హామీకి కట్టుబడి సీఎం ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్‌ మంజూరు చేయడానికి అంగీకరించారని తెలిపారు. దీంతో ఏటా రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2500 కోట్ల భారం పడుతుందని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్న ఉద్యోగులు, వారి కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ డీఏలను ఆమోదించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎన్‌నినో పరిస్థితులపై క్యాబినెట్‌లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ వానాకాలంలో 17 శాతం వర్షపాతం లోటు ఉందని నిర్ధారించారు.


బుధవారంతో నైరుతి రుతుపవనాల కాలం కూడా ముగిసిన నేపథ్యంలో రాష్ట్రంలో 235 మండలాల్లో తీవ్ర వర్షభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయని తేల్చారు. పంటలకే కాకుండా తాగునీటికి కూడా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అంచనాకు వచ్చారు. కరువు ప్రాంతాల్లో తక్షణం చేపట్టాల్సిన చర్యలపై క్యాబినెట్‌ సబ్‌ కమిటీ చర్చించాలని మంత్రివర్గం నిర్దేశించింది. సబ్‌ కమిటీ త్వరగా సమావేశమై ఎల్‌నినో నష్ట నివారణపై చర్చించి, నివేదికను కేబినెట్‌కు అందించాలని చెప్పారు. ఈ నివేదికపై చర్చించేందుకు మంత్రివర్గం అత్యవసరంగా సమావేశం అవుతుంది. దీంతో పాటు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతు సంఘాలతో పాటు వివిధ రంగాల నిపుణులు, అన్ని రాజకీయ పార్టీల నేతలతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తారు. వారి సూచనలు, సలహాలు తీసుకుని, చర్యలు చేపట్టాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. కరువు మండలాల ప్రకటనతో పాటు రాష్ట్రానికి తగిన సాయాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రివర్గం విజ్ఞప్తి చేసింది. త్వరలోనే మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర పరిస్థితిని నివేదిస్తుంది.


భారీగా పెరిగిన విద్యుత్తు డిమాండ్‌

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. సగటున రోజుకు 15 వేల మెగావాట్ల వినియోగం ఉంటోంది. బుధవారం వాడకం ఏకంగా 19,892 మెగావాట్లు నమోదైంది. వర్షాలు లేక రైతులు బోర్లతో సాగు చేయడం, వాతావరణ మార్పులు, గృహ వినియోగం పెరగడం వల్ల విద్యుత్తు డిమాండ్‌ భారీగా నమోదవుతోంది. డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి, సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రివర్గం నిర్ణయించింది. కోత లేకుండా సరఫరా చేయడానికి అవసరమైనంత విద్యుత్తును సమకూర్చుకోవాలని, డిమాండ్‌ మేరకు కొనుగోళ్లు చేపట్టాలని అధికారులకు నిర్దేశించింది. కొత్తగా పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి, విద్యుత్తు సమీకరణపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది. 7800 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యంగా యూనిట్లను నెలకొల్పేందుకు ఆమోదం తెలిపింది. ఇందులో 3,000 మెగావాట్ల సోలార్‌ విద్యుత్తు, 4000 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌, 800 మెగావాట్ల పవన విద్యుత్తు యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదనలపైమంత్రివర్గం చర్చించింది. కేంద్ర నిబంధనల మేరకు టెండర్లను పిలిచి, ఈ ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించింది.


  • రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కోహెడలో సమగ్ర పళ్ల మార్కెట్‌ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే ఈ మార్కెట్‌ ఏర్పాటు చేస్తారు. మొదటి దశ కింద రూ.650 కోట్లను మంజూరు చేయాలని క్యాబినెట్‌ నిర్ణయించింది.

  • దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పునఃసమీక్షించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాజశేఖర్‌రెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా ఈపీసీ విధానంలో చేపట్టిన కొన్ని ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉండిపోయాయి. ఈపీసీ విధానంలో చేపట్టిన ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉంటే రద్దు చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. 10 ఈపీసీ సాగునీటి ప్రాజెక్టుల నిలిపివేతకు గురువారం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కింద 14, 15 వేల ఎకరాల ఆయకట్టుకు సంబంధించి కెనాల్‌ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని పూర్తి చేయడానికి క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

  • ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు మంత్రివర్గం ఓకే చెప్పింది. త్వరలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తారు. ఈ సీజన్‌లో దాదాపు 65 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనాల్సి ఉంటుందని అంచనా. సాఫీగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని మంత్రివర్గం అధికారులకు సూచించింది.


  • డిజిటల్‌ మీడియా అడ్వర్టయిజింగ్‌కు ప్రత్యేక పాలసీని అమలు చేసే ప్రతిపాదనను మంత్రివర్గం పరిశీలించింది. కేంద్ర ప్రభుత్వ సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ రూపొందించిన డిజిటల్‌ అడ్వర్టయిజింగ్‌ పాలసీకి అనుగుణంగా రాష్ట్రంలో ఈ పాలసీకి ఆమోదం తెలిపింది.

  • న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్‌ పోస్టు మంజూరుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. మరో నలుగురు గ్రూప్‌-1 అధికారులను కూడా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పని చేసేందుకు నియమించాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి వీరు లైజనింగ్‌ చేస్తుంటారు.

  • 22-ఏ అంశంపై కొన్ని జీఓలు, మెమోలు జారీ ఇప్పటికే ప్రభుత్వం జారీ చేసింది. యూఎల్‌సీ కింద పెండింగ్‌ ఉన్న అప్లికేషన్లు, లే-అవుట్లు, భవనాలకు అనుమతులు ఇచ్చి, నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలను తర్వాతి క్యాబినెట్‌ సమావేశం దృష్టికి తీసుకొస్తారు. 118, 76 జీఓల జారీ అనంతరం వచ్చిన దరఖాస్తులను కూడా తర్వాతి క్యాబినెట్‌ సమావేశంలో పెడతారు.


డీఏల ఆమోదంపై ఉద్యోగుల జేఏసీ కృతజ్ఞతలు

హైదరాబాద్‌, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర కేబినెట్‌ రెండు డీఏలకు ఆమోదం తెలపడంపై తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలను కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జేఏసీ ఛైర్మన్‌ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్‌ వొడ్నాల రాజశేఖర్‌ కోరారు. పీఆర్‌సీ విషయంలో ప్రభుత్వం తక్షణమే నివేదిక తెప్పించుకుని అమలు చేయాలని, సీపీఎస్‌ అంశంపై కూడా సానుకూలంగా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.


ఇవి కూడా చదవండి...

నిమ్స్ డాక్టర్ కేసులో ఏసీబీ సోదాలు.. రూ.7 లక్షలు స్వాధీనం

ఎర్రవల్లిలో అధికారుల సర్వే పూర్తి.. కలెక్టర్‌కు నివేదిక

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 03:48 AM