రాహుల్ గాంధీకి దమ్ముంటే తెలంగాణలో ‘ఛత్రోంకీ గూంజ్’ పెట్టాలి: రాంచందర్‌రావు
ABN , Publish Date - Aug 23 , 2026 | 02:51 PM
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి దమ్ముంటే తెలంగాణలో ఛత్రోంకీ గూంజ్ పెట్టాలని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ ఎన్. రామచందర్ రావు సవాల్ విసిరారు. తెలంగాణకు రావాలని రాహుల్ గాంధీని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు రాహుల్ గాంధీని ఒక్క విద్యార్థి కూడా రానివ్వడని అన్నారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 23: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి దమ్ముంటే తెలంగాణలో ఛత్రోంకీ గూంజ్ పెట్టాలని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ ఎన్. రామచందర్ రావు సవాల్ విసిరారు. తెలంగాణకు రావాలని రాహుల్ గాంధీని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు రాహుల్ గాంధీని ఒక్క విద్యార్థి కూడా రానివ్వడని అన్నారు. తెలంగాణలో అడుగుపెడితే రాహుల్ గాంధీని విద్యార్థులే అడ్డుకుంటారని తెలిపారు. గతంలో హైదరాబాద్‌కు వచ్చిన రాహుల్ గాంధీ.. విద్యార్థులకు ఇచ్చిన హామీలు మరిచిపోయారని ఆయన పేర్కొన్నారు. ఆదివారం న్యూఢిల్లీలో ఎన్ రాంచందర్ రావు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. తెలంగాణలో విద్యార్థుల సమస్యలపై బీజేపీ కార్యాలయం ముందు రెండు రోజులు నిరాహార దీక్ష చేస్తామని స్పష్టం చేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్, పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై ఈ దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.12 వేల కోట్లు ఉన్నాయని చెప్పారు. సిబ్బందికి విద్యాసంస్థలు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తమ నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదన్నారు. పోలీసుల అనుమతి లేకున్నా.. పార్టీ కార్యాలయంలోనే తమ దీక్ష చేపడతామని ప్రకటించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.8 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రూ.4 వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నాయని చెప్పారు. హైకోర్టు జోక్యం చేసుకుంటే తప్ప ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ఈ అంశంలో ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు.
తెలంగాణలో ప్రభుత్వాన్ని హైకోర్టు నడిపిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అవినీతికి మారుపేరని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబం.. రాష్ట్రాన్ని దోచుకుందనే అభియోగం ఉండేదని.. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సోదరుల మీద అలాంటి ఆరోపణలు వస్తున్నాయన్నారు. గతంలో మంత్రి కొండా సురేఖ ఓఎస్‌డీ ఓ కంపెనీ వ్యక్తిపై తుపాకీ గురి పెట్టి బెదిరించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 30 శాతం కమీషన్లు వసూలు చేస్తుందని తెలంగాణ బీజేపీ చీఫ్ విమర్శించారు.
ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు బీజేపీ చేయదు: టీ బీజేపీ చీఫ్
22-ఏ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో అంతర్గత అసమ్మతి పెరిగిందని అభిప్రాయపడ్డారు. ఏ ప్రభుత్వం అయినా ఐదేళ్లు పూర్తి చేయాలని కోరుకుంటున్నామని చెప్పారు. కాని ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు అధికారంలో ఉండే అవకాశం లేదని జోస్యం చెప్పారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు తమ పార్టీ చేయదని కుండ బద్దలు కొట్టారు.
మోదీ జన్మదినం సందర్భంగా..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని టీ బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు వెల్లడించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు మోదీ @25 సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్లడ్ డొనేషన్, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే కేంద్ర పథకాల లబ్ధిదారులను నేరుగా కలవాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించిందని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
'టాక్సిక్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్రమాదం.. మల్లారెడ్డి కాలేజీపై కేసు నమోదు
గుడ్ న్యూస్.. నామినేటెడ్ పదవుల భర్తీపై మహేశ్ గౌడ్ కీలక ప్రకటన
For More TG News And Telugu News