Share News

34 నెలల్లో 12.4లక్షల పాసు పుస్తకాలు ఇచ్చాం

ABN , Publish Date - Oct 20 , 2026 | 04:16 AM

భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంతో భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

34 నెలల్లో 12.4లక్షల పాసు పుస్తకాలు ఇచ్చాం
Ponguleti Srinivas Reddy

  • భూభారతితో ఏళ్లనాటి సమస్యలకు పరిష్కారం: పొంగులేటి

హైదరాబాద్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంతో భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన 2025 ఏప్రిల్‌ 14 నుంచి ఇప్పటి వరకు 5,68,858, ఈ చట్టానికి ముందు 6,71,508 పాసు పుస్తకాలు ఇచ్చామని తెలిపారు. మొత్తం ఈ 34 నెలల్లో 12,40,366 పాసు పుస్తకాలను రైతులకు అందించామని చెప్పారు. ప్రజలకు మెరుగైన, పారదర్శక రెవెన్యూ సేవలు, రైతులకు చట్టబద్ధమైన భూ హక్కులు, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా రెవెన్యూ వ్యవస్థను పునర్నిర్మిస్తున్నామని తెలిపారు. సోమవారం సచివాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు భూ భారతి చట్టంలో పేర్కొన్న విధంగా రీ-సర్వే ద్వారా పరిష్కారం చూపుతున్నామని అన్నారు. ఇప్పటికే మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం రెవెన్యూ గ్రామంలో రీ-సర్వే నిర్వహించి గిరిజనులు, గిరిజనేతరుల సమస్యను పరిష్కరించి 906 మంది రైతులకు 1,600 ఎకరాలకు పైగా హక్కులు కల్పించామన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్‌, మద్దిరాల మండలాల్లోని 15 గ్రామాల్లో రీ-సర్వే ద్వారా 2,400 మంది రైతులకు 3,450ఎకరాలకు పట్టాలు ఇచ్చామన్నారు. ములుగు జిల్లా ముల్కాపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, అశ్వరావుపేట, దమ్మపేట, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలాల్లో ఈ రీసర్వే పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ఆయా ప్రాంతాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్యలను పరిష్కరించి త్వరలోనే హక్కుదారులకు పాసు పుస్తకాలు అందిస్తామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

రేషన్‌ షాపుల్లో గోదుమ పిండి, నిత్యావసరాలు!

ఎల్‌నినోతో ప్రపంచానికే ముప్పు

దేవాదాయ శాఖలో అక్రమాలపై.. విజిలెన్స్‌ నివేదికలు బుట్టదాఖలు

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 20 , 2026 | 04:16 AM