సద్దుల బతుకమ్మ ఆడుతూ.. వేర్వేరు ఘటనల్లో ఇద్దరి మృతి
ABN , Publish Date - Oct 20 , 2026 | 05:21 AM
సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా ఆదివారం రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు మృతిచెందారు.
ఖమ్మంలో 55 ఏళ్ల మహిళ... డీజే హోరే కారణం?
ఆసిఫాబాద్ రూరల్‌లో తీవ్ర అస్వస్థతతో యువతి
నేలకొండపల్లి, ఆసిఫాబాద్ రూరల్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా ఆదివారం రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అప్పలనర్సింహాపురం గ్రామానికి చెందిన యలగాల భారతి (55)కి భర్త, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పండుగకు తమ పుట్టిల్లయిన చెర్వుమాధారం గ్రామానికి భారతి వచ్చింది. ఆదివారం రాత్రి ఊర్లో నాలుగు వర్గాల వారు డీజేలతో పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఓ వర్గానికి చెందిన సద్దుల బతుకమ్మ ఉత్సవాలకు తమ బంధువులతో కలిసి భారతి హాజరైంది. తోటి మహిళలతో కలిసి భారతి డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కింద పడిపోయింది. వెంటనే ఆమెను నేలకొండపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు.
నాలుగు వర్గాల వారు ఒకేసారి పెద్ద శబ్ధంతో డీజేలు పెట్టడంతోనే భారతి మృతిచెందిందన్న చర్చ జరుగుతోంది. ఆసిఫాబాద్ రూరల్ బూర్గుడ గ్రామంలో బతుకమ్మ ఆడుతూ ఓ యువతి అస్వస్థతకు గురై ప్రాణాలు విడిచింది. మృతురాలు చింతలమానేపల్లి మండలం బాబాసాగర్ గ్రామానికి చెందిన ఎల్క వెంకటేశ్-సువర్ణ దంపతుల పెద్ద కుమార్తె శ్రీవాణి(25). ఆమె చైన్నైలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. దసరా సెలవులు కావడంతో ఆసిఫాబాద్‌లో ఉండే అమ్మమ్మ ఇంటికొచ్చింది. ఆదివారం బూర్గుడలోని బంధువుల ఇంటికొచ్చి బతుకమ్మ వేడుకల్లో పాల్గొంది. ఆ రోజు రాత్రి బతుకమ్మ ఆడుతుండగా శ్రీవాణి ఒక్కసారి సొమ్మసిల్లి కిందపడిపోయింది. కుటుంబసభ్యులు, స్థానికులు ఆమెను ఆసిఫాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ వార్తలు కూడా చదవండి
గ్రామాల్లో తాగునీటి సమస్య రావొద్దు: సీతక్క
ఆర్టీసీ చైర్మన్‌గా బొంతు రామ్మోహన్!
Read Latest AP News And Telangana News And International