బార్‌లు వర్సెస్ వైన్స్
ABN , Publish Date - Oct 19 , 2026 | 05:29 AM
రాష్ట్రంలో బార్‌లపై ప్రివిలేజ్ ట్యాక్సులు పెంచి ప్రభు త్వ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఓవైపు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తుంటే.. మరోవైపు వైన్ షాప్‌లు, బార్‌ల మధ్య కొత్త పంచాయితీ మొదలైంది.
వైన్ షాపులను బార్‌లుగా మార్చేస్తున్న నిర్వాహకులు!
బెల్టు షాపులకు మద్యం విక్రయిస్తున్నారు
అక్రమ సిట్టింగ్‌లతో మా ఆదాయానికి గండి
వైన్ షాపుల నిర్వాహకులపై బార్‌ల యజమానుల ఫైర్
నిబంధనల్ని ఉల్లంఘిస్తోంది బార్‌లే: వైన్స్ యజమానులు
చూసీ చూడనట్లు ఉంటున్న ఎక్సైజ్ శాఖ
హైదరాబాద్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బార్‌లపై ప్రివిలేజ్ ట్యాక్సులు పెంచి ప్రభు త్వ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఓవైపు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తుంటే.. మరోవైపు వైన్ షాప్‌లు, బార్‌ల మధ్య కొత్త పంచాయితీ మొదలైంది. వైన్‌షాపుల నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, షాపుల వద్ద పరిమితికి మించి అక్రమంగా సిట్టింగ్‌లు నిర్వహిస్తున్నారని, పర్మిట్ రూమ్‌లను బార్‌లుగా మార్చేస్తున్నారని బార్‌ల యజమానులు ఆరోపిస్తున్నారు. దీంతోపాటు బెల్టుషాపులకు, ధాబాలకు పెద్ద ఎత్తున మద్యాన్ని నేరుగా విక్రయిస్తుండడంతో తమ ఆదాయానికి గండి పడుతోందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రివిలేజ్ ట్యాక్స్ పెంపు చేపడితే తమపై మరింత భారం పడుతుందని అంటున్నారు. అయితే తమపై ఆరోపణల్ని వైన్‌షాపుల యజమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
బార్‌ల యజమానులే మద్యాన్ని అక్రమంగా లూజ్ సేల్స్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కాగా, బార్‌లపై పన్నులు పెంచే అంశంపై ఇటీవల క్యాబినెట్ భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది. ప్రస్తుతం చెల్లిస్తున్న పన్నులతో పోలిస్తే.. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో 6 శాతం, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏకంగా 18 శాతం వరకు పన్నులు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఈ పరిణామాలపై బార్‌ల యజమానులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వ్యాపారాలు మందగించి, నిర్వహణ భారం కావడంతో అనేక ప్రాంతాల్లో బార్‌లు మూతపడే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో బార్‌లపై పన్నుల పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరుతూ ఇటీవల ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును, ఆ శాఖ ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రాలు అందజేశారు.
వైన్‌షాపుల అక్రమాల వల్లే..
నిబంధనల ప్రకారం.. వైన్‌షాపుల వద్ద మద్యం బాటిళ్ల విక్రయం మాత్రమే జరగాలని బార్‌ల యజమానులు గుర్తు చేస్తున్నారు. కానీ, పరిమితికి మించి అక్రమంగా సిట్టింగ్‌లు ఏర్పాటు చేసుకుని ఫుడ్ విక్రయాలు జరుపుతూ బార్‌లకు రావాల్సిన కస్టమర్లను వైన్‌షాపుల యజమానులు లాగేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అధికారుల నిఘా లోపం వల్ల పర్మిట్ రూమ్‌ల ముసుగులో వైన్ షాపులు మినీ బార్లను తలపిస్తున్నాయని, అంతేకాకుండా గ్రామాల్లోని బెల్ట్ షాపులకు, దాబాలకు వైన్స్ నుంచే నేరుగా సరుకు సరఫరా చేస్తూ భారీగా ఆదాయం గడిస్తున్నారని మండిపడుతున్నారు. ఆ అక్రమాల వల్లే బార్లలో అమ్మకాలు పడిపోయి నష్టాలు చవిచూడాల్సి వస్తోందని వాపోతున్నారు.
వీటిని అరికట్టాల్సిన ఎక్సైజ్ శాఖ పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏడాదికి రూ.44 లక్షలు, కార్పొరేషన్లలో రూ.42 లక్షలు, మున్సిపాలిటీ పరిధిలో రూ.30 లక్షల చొప్పున ట్యాక్స్ చెల్లిస్తున్నామని.. ఇంకా పెంచితే బార్లు మూతపడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అయితే.. బార్ల యజమానుల వాదనపై వైన్ షాప్‌ల నిర్వాహకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. తమపై చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని అంటున్నారు. తమకు ఎలాంటి ధరల నియంత్రణ వెసులుబాటు లేదని, ఎమ్మార్పీ కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ధరకు విక్రయించే వీల్లేకుండా నిబంధనలు కఠినంగా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. బార్లకు ఆ నిబంధనల బెడద తక్కువగా ఉంటుందని, వారు లూజ్ సేల్స్ చేసుకునే వెసులుబాటు ఉందని గుర్తు చేస్తున్నారు.
బార్‌లకు తక్కువ లైసెన్స్ ఫీజు..!
తాము ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజు కింద ఏడాదికి రూ.1.50 కోట్ల వరకు చెల్లిస్తుంటే.. బార్ల యజమానులు మాత్రం కేవలం44 లక్షల లోపే చెల్లిస్తున్నారని వైన్‌షాపుల వర్గాలు ఆరోపిస్తున్నాయి. పైగా, మార్కెట్‌లో లూజ్ సేల్స్ చేసుకుంటూ కస్టమర్ల నుంచి ఇష్టారీతిన ఎమ్మార్పీ కంటే అధిక ధర వసూలు చేస్తున్నారని మండిపడుతున్నాయి. వ్యాపారంలో లాభాలు లేకపోతే ఒక్కో బార్ అమ్మకానికి రూ.3 కోట్లకు పైగా రేటు ఎందుకు పలుకుతోందని, కొత్త బార్ల కోసం దరఖాస్తులు ఎందుకు వెల్లువెత్తుతున్నాయని ప్రశ్నిస్తున్నాయి. కాగా, బార్‌లు, వైన్‌షాపుల యజమానుల మధ్య పోరును నివారించాల్సిన ఎక్సైజ్‌శాఖ.. చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
గోదావరి-కావేరీ లింకు పేరుతో కుట్ర:హరీశ్
క్యూనెట్ కేసు కీలక నిందితుడు డిగ్ విజయ్‌సింగ్ అరెస్టు
Read Latest AP News And Telangana News And International