Arrive Alive: ఆటోమేటిక్ ట్రాఫిక్ చలాన్లు ఇవ్వండి.. డిస్కౌంట్లు వద్దు: సీఎం
ABN , Publish Date - Jan 12 , 2026 | 07:31 PM
రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు పోలీస్ శాఖ చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ రాష్ట్రవ్యాప్త రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలు.. యుద్ధం కంటే ఎక్కువ ప్రాణాలు తీసుకుంటున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్, జనవరి12: తెలంగాణ ప్రభుత్వం రోడ్డు భద్రతను అత్యంత తీవ్రమైన సమస్యగా గుర్తించి ‘అరైవ్ అలైవ్’ అనే రాష్ట్రవ్యాప్త అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పోలీస్ శాఖ చేపట్టిన రోడ్డు ప్రమాదాల నివారణ ప్రణాళికలను చూసి అభినందించారు.
హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ, రోడ్డుప్రమాదాలు ఒక యుద్ధం కంటే ఎక్కువగా ప్రాణాలు తీసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలు ఒక జాతీయ సమస్యగా మారిందన్నారు. దేశంలో ప్రతి నిమిషానికి ఓ రోడ్డు ప్రమాదం జరుగుతోందని, ప్రతి మూడు నిమిషాలకు ఒక ప్రాణం పోతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్డు ప్రమాదాల్లో ప్రముఖులు కూడా తమ బిడ్డలను కోల్పోయి దుఃఖంలో మునిగిపోతున్నారని, ఇది సమాజానికి తీవ్రమైన నష్టమని సీఎం చెప్పుకొచ్చారు. విద్యార్థి దశలోనే రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలీస్ శాఖ బలోపేతం, ఆధునిక విధానాలు పోలీస్ శాఖను సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా బలోపేతం చేస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు.
సైబర్ క్రైమ్ పెరిగిపోవడంతో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశామని, డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడానికి ఈగల్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పోలీసులకు గుర్తింపు తెచ్చుకున్నామని చెప్పారు. అలాగే, చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణకు హైడ్రా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి, చెరువుల పునరుద్ధరణతో పతంగుల పండుగను జరుపుకుంటున్నామని పేర్కొన్నారు.
ట్రాఫిక్ వ్యవస్థలో మార్పులు – కీలక ఆదేశాలు
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు సైబర్ క్రైమ్, డ్రగ్స్, హత్యల కంటే పెద్ద సమస్యగా మారాయని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ట్రాఫిక్ వ్యవస్థను ఆరో వేలుగా మార్చాలని, సాంకేతిక నైపుణ్యం ఉపయోగించి బలోపేతం చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలాన్లు ఆటోమేటిక్‌గా వాహనదారుడి బ్యాంక్ ఖాతా నుంచి కట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చలాన్లపై డిస్కౌంట్లు వద్దన్నారు. ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేసి సిగ్నల్, ట్రాఫిక్ వ్యవస్థపై అవగాహన పెంచాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
టాప్ ప్రయారిటీ – రోడ్డు భద్రత
రోడ్డు ప్రమాదాల నివారణను టాప్ ప్రయారిటీగా తీసుకుని ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా 10 రోజులపాటు (జనవరి 13 నుంచి 24 వరకు) నిర్వహించబడుతుంది. స్కూల్స్, కళాశాలలు, ఆఫీసులు, గ్రామాలు, హైవేలు, మాల్స్, మార్కెట్లు వంటి ప్రాంతాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నల్లమల సాగర్‌పై సుప్రీంలో ఊహించని పరిణామం..
భూములు అమ్మి ఖజానా నింపే ఆలోచన మా ప్రభుత్వానికి లేదు: మంత్రి పొంగులేటి
Read Latest Telangana News And Telugu News