ఏరోస్పేస్ హబ్‌గా తెలంగాణ
ABN , Publish Date - Apr 26 , 2026 | 04:32 AM
తెలంగాణ త్వరలోనే ఏరోస్పేస్ హబ్‌గా అవతరించనుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ దిశగా ప్రజా ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తోందని తెలిపారు.
2047 నాటికి ఏరోస్పేస్ రంగంలో ప్రపంచంలో అగ్రగామిగా తెలంగాణ: రేవంత్
దేశంలోనే తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1ను ఆవిష్కరించిన సీఎం
ఇంజనీరింగ్ ఎగుమతుల్లో 117.9శాతం వృద్ధితో దేశంలో అగ్రస్థానంలో తెలంగాణ
యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీతో భాగస్వామ్యానికి స్కైరూట్ సంసిద్ధత
వచ్చే ఏడాది నుంచి నెలకో రాకెట్: స్కైరూట్
హైదరాబాద్, ఏప్రిల్ 25 (ఆంధ్ర జ్యోతి): తెలంగాణ త్వరలోనే ఏరోస్పేస్ హబ్‌గా అవతరించనుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ దిశగా ప్రజా ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తోందని తెలిపారు. దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ ఫ్లైట్ హార్డ్‌వేర్‌ను శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ప్రయోగ స్థలానికి పంపే కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి శనివారం మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ రాకెట్‌ను శంషాబాద్‌లోని జీఎంఆర్ ఏరోస్పేస్ పార్క్‌లో స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. ఇది శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో ఉన్న ప్రయోగ స్థలానికి లాంఛనంగా బయలుదేరింది. దీంతో రాబోయే నెలల్లో భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ ప్రయోగానికి స్కైరూట్ సిద్ధం కానుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు భారతదేశపు మొట్టమొదటి ప్రైవేటు ఆర్బిటల్ ప్రయోగం చేయడానికి స్కైరూట్ సిద్ధంగా ఉండటం హర్షణీయమన్నారు. దీనిని హైదరాబాద్‌లో అభివృద్ధి చేయడం ఏరోస్పేస్ రంగంలో రాష్ట్ర అభివృద్ధికి ఒక మైలురాయి అని పేర్కొన్నారు. ఈ సంస్థ 2022లో తన తొలి రాకెట్‌ను ప్రయోగించిందని, ఇంత తక్కువ సమయంలోనే ఆర్బిట్ ప్రయోగ దశకు చేరుకోవడం సంతోషకరమని అన్నారు. ‘‘ఏరోస్సేస్ రంగంలో తెలంగాణ ఇప్పటికే దేశంలో ప్రథమ స్థానంలో ఉంది. బోయింగ్, ఎయిర్‌బస్, సాఫ్రాన్ వంటి ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలకు నిలయంగా మారింది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2023-24 నుంచి 2024-25 మధ్య కాలంలో దేశంలో ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతుల్లో తెలంగాణ 117.9 శాతం అత్యధిక వృద్దిని నమోదు చేసింది. ఈ వృద్ధిలో విమాన విడిభాగాలు, రక్షణ పరికరాలే ప్రధానంగా దోహదపడ్డాయి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. 2047 నాటికి ఏరోస్పేస్ రంగంలో ప్రపంచ అగ్రగామిగా ఎదగడమే తెలంగాణ లక్ష్యమన్నారు.

నైపుణ్య శిక్షణే లక్ష్యంగా స్కిల్స్ వర్సిటీ...
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని సీఎం రేవంత్ తెలిపారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ), పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తెస్తామని ప్రకటించారు. టాటా టెక్నాలజీస్ సహకారంతో ఇప్పటికే ఏటీసీ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లోని మల్లేపల్లిలో ఉన్న ఏటీసీని సందర్శించి తమకు కావాల్సిన నైపుణ్యాలను సూచించాల్సిందిగా స్కైరూట్ సంస్థను సీఎం ఆహ్వానించారు. తక్కువ సమయంలోనే ఆర్బిటల్ ప్రయోగ దశకు చేరుకున్న స్కైరూట్ బృందాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.1.08 లక్షలు ఖర్చు చేస్తున్నా ఆశించిన ఫలితాలు రావడంలేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలోని లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించిందని రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. స్కైరూట్ ఏరోస్పేస్ సీఈవో పవన్‌కుమార్ చందన మాట్లాడుతూ.. యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీతో భాగస్వామ్యానికి సంసిద్ధత వ్యక్తం చేశారు.
జూన్‌లో నింగిలోకి విక్రమ్-1
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ విక్రమ్-1 రాకెట్‌ను వచ్చే జూన్‌లో నింగిలోకి పంపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రాకెట్‌ను శ్రీహరికోటలోని ఇస్రో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నట్లు స్కైరూట్ సహ వ్యవస్థాపకులు పవన్ కుమార్ చందన, నాగ భరత్ డాకా వెల్లడించారు. 23 మీటర్ల పొడవైన ఈ రాకెట్‌ను అభివృద్ధి చేయటానికి నాలుగేళ్లు పట్టిందని, ప్రస్తుతం తుది దశ పరీక్షలను నిర్వహిస్తున్నామని చెప్పారు. విక్రమ్-1 పేలోడ్ సామర్థ్యం 350 కేజీలకు వరకు ఉందని, అయితే త్వరలో ప్రయోగించబోయే రాకెట్‌లో మాత్రం 100 కేజీల లోపు పేలోడ్‌ను ఉపయోగించనున్నట్లు వారు పేర్కొన్నారు. ఫ్లైట్ డేటాను సేకరించే చిన్న శాటిలైట్స్‌ను నింగిలోకి పంపించనున్నట్లు చెప్పారు. విక్రమ్-1 ప్రయోగం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాటిలైట్ ఆపరేటర్ల కోసం వాణిజ్యపరమైన కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా వచ్చే ఏడాది నుంచి నెలకో రాకెట్‌ను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు.