Share News

ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు

ABN , Publish Date - Aug 20 , 2026 | 07:54 PM

అక్రమాస్తుల కేసులో ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌ శ్రీనివాస్ రెడ్డిని రంగారెడ్డి ఏసీబీ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు.

ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు

హైదరాబాద్, ఆగస్టు20: అక్రమాస్తుల కేసులో ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌ శ్రీనివాస్ రెడ్డిని రంగారెడ్డి ఏసీబీ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మరికాసేపట్లో శ్రీనివాస్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తామని అన్నారు. ఈ సందర్భంగా అతడి ఆస్తులకు సంబంధించిన ప్రెస్ నోట్‌ను ఏసీబీ అధికారులు విడుదల చేశారు. శ్రీనివాస్‌రెడ్డి నివాసం, కార్యాలయంతో పాటు మరో ఐదు ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు జరిపిందని వివరించారు.


ఈ సోదాల్లో భారీగా ఆస్తులు, నగదు, బంగారం, బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తించినట్లు తెలిపింది. కర్మన్‌ఘాట్‌లో రెండు రెసిడెన్షియల్ ఫ్లాట్లు.. వీటి విలువ రూ.2.63 కోట్లు ఉంటుందని పేర్కొంది. అలాగే కర్మన్‌ఘాట్‌లో G+3 పెంట్‌హౌస్.. దీని విలువ రూ.1.61 కోట్లు ఉంటుందని చెప్పింది. యాచారం మండలం నల్లవెల్లి గ్రామంలో 10 ఎకరాల వ్యవసాయ భూమితోపాటు వివిధ ప్రాంతాల్లో 8 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించామని వివరించింది. నరేంద్ర బార్ అండ్ రెస్టారెంట్‌లో రూ.86 లక్షల పెట్టుబడి పెట్టినట్లు ఈ సోదాల్లో గుర్తించామని పేర్కొంది. ఈ సోదాల్లో రూ.4 లక్షల నగదు, బ్యాంక్‌లో రూ.8.60 లక్షల బ్యాలెన్స్ ఉందని స్పష్టం చేసింది.


ఇక 680 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. నాలుగు ఫోర్‌ వీలర్లు, మూడు టూ వీలర్లు.. మొత్తం 7 వాహనాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ వాహనాల విలువ సుమారు రూ.59 లక్షలు ఉంటుందని పేర్కొంది. ఇంట్లో రూ.11 లక్షల విలువైన వస్తువులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు ఉన్నాయని.. వాటిని సీజ్ చేశామంది. బ్యాంకులో 46 తులాల బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకున్నట్లు గుర్తించారు.


శ్రీనివాస్‌రెడ్డి ఆస్తుల మొత్తం విలువ సుమారు రూ.6.87 కోట్లు ఉందని.. బహిరంగ మార్కెట్లో వీటి విలువ వందల కోట్ల రూపాయిలు ఉంటుందని అంచనాకు వచ్చినట్లు తెలిపింది. ఈ మేరకు విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో ఏసీబీ వివరించింది. గతంలోనూ.. 2009లో శ్రీనివాస్‌రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తులు కేసు నమోదు చేసినట్లు గుర్తు చేసింది. అప్పట్లో మహేశ్వరం మండలంలో మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారని ఏసీబీ అధికారులు వివరించారు.


ఇవి కూడా చదవండి..

అసెంబ్లీకి రాకుండా పారిపోతున్న జగన్: మంత్రి లోకేశ్

కుమార్తె వ్యాఖ్యలు.. క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన మంత్రి కొండా సురేఖ

Read Latest TG News And Telugu News

Updated Date - Aug 20 , 2026 | 07:59 PM