Share News

లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం

ABN , Publish Date - Nov 24 , 2026 | 04:04 AM

ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ నక్సల్స్‌కు పునరావాసం కల్పించడం, ఆర్థిక సాయం, ఆరోగ్య భద్రత, వసతి, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారు సాధారణ జీవితం గడిపేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని డీజీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు.

లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం

  • 214 మందికి రూ.5.59 కోట్ల ఆర్థిక సాయం పంపిణీ

  • ఆరోగ్య కార్డులు, ఇళ్లు, ఉపాధి శిక్షణతో అండగా ప్రభుత్వం

  • కర్రెగుట్టల్లోకి సందర్శకుల్ని అనుమతించం: డీజీపీ సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ నక్సల్స్‌కు పునరావాసం కల్పించడం, ఆర్థిక సాయం, ఆరోగ్య భద్రత, వసతి, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారు సాధారణ జీవితం గడిపేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని డీజీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. గతంలో లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కింద 214 మందికి రూ.5 కోట్ల 59 లక్షల 50 వేల రివార్డులు, పునరావాస ఆర్థిక సాయాన్ని సోమవారం తన కార్యాలయంలో డీజీపీ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 824 మంది మావోయిస్టులు లొంగిపోయారని వివరించారు. లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ అవసరాల నిమిత్తం ఒక్కొక్కరికి రూ.25వేల చొప్పున తాత్కాలిక ఆర్థిక సాయం అప్పట్లోనే అందించామన్నారు. వారికి ప్రభుత్వ రివార్డులకు అనుగుణంగా మిగిలిన ఆర్థిక సాయాన్ని దశల వారీగా అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 755 మందికి రూ.22.31 కోట్ల రివార్డులు మంజూరు కాగా.. వివిధ దశల్లో అందించిన సాయంతో కలిపి ఇప్పటివరకు వారికి రూ.17.68 కోట్ల నగదు పంపిణీ చేసినట్లు వివరించారు.


లొంగిపోయిన మావోయిస్టుల్లో చాలామందికి ఆధార్‌, ఇతర గుర్తింపు కార్డులు లేకపోవడంతో పలువురికి బ్యాంకు ఖాతాలు తెరవడం ఇబ్బందిగా మారిందని ఆనంద్‌ చెప్పారు. దీంతో తెలంగాణ ఎస్‌ఐబీ అధికారులు ఛత్తీస్‌గఢ్‌ పోలీసులతో సమన్వయం చేసుకుని బ్యాంకు ఖాతాలు అందించారని తెలిపారు. ఆరోగ్య భద్రత కల్పించేందుకు రాష్ట్రానికి చెందిన మాజీ నక్సల్స్‌కు 59 ఆరోగ్య రక్షణ కార్డులు అందించామన్నారు. నివాస వసతి కింద 10 మందికి ఇళ్లు మంజూరయ్యాయని, మరో 49 మందికి కూడా నివాస వసతి కల్పించనున్నట్లు చెప్పారు. అలాగే కార్పెంటర్‌, ప్లంబర్‌, ఎలక్ట్రీషియన్‌ వంటి వృత్తుల్లో వారి నైపుణ్య శిక్షణ అందిస్తామని తెలిపారు. జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లు లొంగిపోయిన నక్సల్స్‌తో సంప్రదింపులు జరుపుతూ, వారు తిరిగి తప్పుడు మార్గంలో వెళ్లకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని వివరించారు.లొంగిపోయిన వారు రాజ్యాంగం కల్పించిన హక్కులు, పరిమితులకు లోబడి రాజకీయ, ప్రజా కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని తెలిపారు. ఏదేమైనా మావోయిస్టు సిద్ధాంతాల ప్రచారాన్ని ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు. కర్రెగుట్ట ప్రాంతంలోని 9 డంపుల్లో 252 తుపాకులు, 359 బీజీఎల్‌ షెల్స్‌, 48 ఏకే-47 తుపాకులు లభించాయని తెలిపారు. కర్రెగుట్టలో మందుపాతరలను నిర్వీర్యం చేసే చర్యలు కొనసాగుతున్నాయన్నారు. పూర్తి స్థాయిలో ఆ ప్రాంతం సురక్షితమని నిర్ధారించే వరకు పర్యాటకులను అనుమతించబోమని స్పష్టం చేశారు.


ఆ ముగ్గురి జాడేది..?

ఇక తెలంగాణ ప్రాంతానికి చెందిన ముగ్గురు మావోయిస్టు కీలక నేతలైన కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతితోపాటు జోడే రత్నభాయ్‌, వార్త శేఖర్‌ ఆచూకీపై ఎలాంటి స్పష్టత లేదు. వీరు ఎక్కడున్నారనేది స్పష్టత లేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అజ్ఞాతంలో ఉన్న ఆ ముగ్గురు ఇప్పటికైనా ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలోకి తిరిగి రావాలని, పునరావాస విధానం కింద లభించే ప్రయోజనాలను పొందాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు అడవుల్లో వారు ఉపయోగించిన ఆయుధాల్లో 252 తుపాకులు మాత్రమే స్వాధీనం చేసుకున్నామని.. మరో 500 తుపాకులకు సంబంధించి లెక్క తేలాల్సి ఉందన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్‌ వెనుక చైనా వ్యాపారవేత్త స్కెచ్

భారత్‌లోని వైవిధ్యం ఇతర దేశాలకు కూడా ఆదర్శం: పుతిన్

Updated Date - Nov 24 , 2026 | 04:07 AM