Share News

రూ.300 కోట్లతో 5 వేల ఇళ్లు.. సత్తుపల్లి, అశ్వారావుపేటలో ఏడాదిలో నిర్మాణం

ABN , Publish Date - Oct 04 , 2026 | 03:46 AM

ప్రభుత్వ భూమిని చూపిస్తే నిరుపేదల కోసం రూ.300కోట్ల సొంత ఖర్చుతో 5వేల ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు తాన్ల ఫౌండేషన్‌ అధినేత దాసరి ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఆయన సోదరుడు మహీదర్‌రెడ్డి ముందుకొచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

రూ.300 కోట్లతో 5 వేల ఇళ్లు.. సత్తుపల్లి, అశ్వారావుపేటలో ఏడాదిలో నిర్మాణం
Ponguleti Srinivas Reddy

  • రూ.300 కోట్లతో 5 వేల ఇళ్లు

  • సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో నిర్మించేందుకు తాన్ల ఫౌండేషన్‌ ముందుకొచ్చింది

  • విజయదశమి నాడు గంగారంలో భూమి పూజ: మంత్రి పొంగులేటి

సత్తుపల్లి, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూమిని చూపిస్తే నిరుపేదల కోసం రూ.300కోట్ల సొంత ఖర్చుతో 5వేల ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు తాన్ల ఫౌండేషన్‌ అధినేత దాసరి ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఆయన సోదరుడు మహీదర్‌రెడ్డి ముందుకొచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారంలో 20 ఎకరాల విస్తీర్ణంలో తాన్ల ఫౌండేషన్‌ నిర్మించిన ఆస్పత్రిలోని రక్త పరీక్ష కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు.


ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ప్రభుత్వ పరంగా స్థలం కేటాయిస్తే.. ఏడాదిలోపు ఇళ్ల నిర్మాణానికి తాన్ల ఫౌండేషన్‌ అధినేతలు సిద్ధంగా ఉన్నారని, ఈ మేరకు వారు హామీ ఇచ్చారంటూ అభినందించారు. ప్రభుత్వ స్థలం గుర్తించాలని ఖమ్మం, కొత్తగూడెం కలెక్టర్లను ఆదేశించామని, ఈ కేటాయింపును పూర్తి చేసి రానున్న విజయదశమి రోజున గంగారంలో ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేస్తామని ప్రకటించారు. స్థానికంగా గతంలో ఉదయ్‌కుమార్‌రెడ్డి అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, ప్రస్తుతం గంగారంలో 20 ఎకరాల విస్తీర్ణంలో అన్ని వసతులతో ఆస్పత్రి నిర్మాణం చేపట్టారని వివరించారు. కార్యక్రమంలో ఖమ్మం కలెక్టర్‌ దివాకర, ఐటీడీఏ పీవో రాహుల్‌, సీపీ సునీల్‌దత్‌, సబ్‌ కలెక్టర్‌ అజయ్‌యాదవ్‌, సత్తుపల్లి, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, జారె ఆది నారాయణ, మువ్వా విజయబాబు పాల్గొన్నారు.


‘ఎల్‌నినో’ ఉన్నా కరెంటు కష్టాలు రానివ్వం

నేలకొండపల్లి: ఎల్‌నినో కష్టాలున్నా ఎలాంటి కరెంటు కష్టాలు రాకుండా చూస్తున్నామని, అవసరమైతే యూనిట్‌కు రూ.12లు వెచ్చించైనా విద్యుత్‌ను కొనుగోలు చేసి వ్యవసాయానికి అందిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కట్టుకాసారం గ్రామంలో పర్యటించి.. రూ.6.60కోట్లతో నిర్మించిన చెక్‌డ్యాంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో కారణంగా వర్షాలు పడక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అందుకు ప్రత్యామ్నాయంగా అవకాశం ఉన్న ప్రతి చోటా చెక్‌డ్యాంలను నిర్మిస్తున్నామన్నారు. ఎల్‌నినో ప్రభావం ఉన్నా కరెంటు కష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఎవ్వరూ అధైర్యపడవద్దన్నారు, కరెంటు కష్టాలు తీర్చేదానిలో భాగంగా సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టులపై దృష్టి పెట్టామని చెప్పారు. ఎట్టి పరిస్ధితుల్లో సాగు, తాగు నీటికి కొరత రానివ్వమని హామీ ఇచ్చారు. గత పాలకులు దొరల ప్రభుత్వాన్ని నడిపారని, తమది పేదోడి పక్షాన నిలబడే ప్రజా ప్రభుత్వమని ఆయన అన్నారు.


ఇవి కూడా చదవండి...

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తీరు సభ్య సమాజానికి అవమానకరం: భట్టి విక్రమార్క

సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యేలతో ఇలా ప్రవర్తిస్తారా: బీఆర్ఎస్‌పై సీతక్క ఫైర్
రామ జన్మభూమి ఉద్యమం నుంచి సామాజిక సమరసత వరకు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 04 , 2026 | 03:46 AM