విజయారెడ్డి ఆత్మహత్య కేసు.. పోలీసులను ఆశ్రయించిన సురేందర్ రెడ్డి
ABN , Publish Date - Apr 13 , 2026 | 10:04 AM
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయారెడ్డి ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. తనకు ప్రాణహాని ఉందని మేడిపల్లి పోలీసులను విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి ఆశ్రయించారు.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయారెడ్డి ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. తనకు ప్రాణహాని ఉందని మేడిపల్లి పోలీసులను విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి ఆశ్రయించారు. భార్య తరఫు కుటుంబంతో తన ప్రాణాలకు ముప్పు ఉందని ఫిర్యాదు చేశారు. వారి నుంచి తనను కాపాడాలని, రక్షణ కల్పించాలని సురేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో సురేందర్ రెడ్డి మాట్లాడారు.
తన భార్య విజయారెడ్డి ఆత్మహత్యకు ఆమె అన్న చిరంజీవి, వదిన లక్ష్మి, తల్లి పుష్పలతనే కారణమంటూ సంచలన విషయాలు వెల్లడించారు సురేందర్ రెడ్డి. భార్య, పిల్లలు చనిపోయిన 25 రోజులకే ఆస్తుల కోసం తనను బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య, పిల్లలు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాళ్లు కాదన్నారు. వారి మరణాలపై అనేక అనుమానాలు ఉన్నాయని సురేందర్ రెడ్డి తెలిపారు. తన తదనంతరం ఆస్తులను ట్రస్టుకి రాస్తానని చెప్పుకొచ్చారు.
మూడు నెలల కిందట ఇద్దరు పిల్లలతో కలిసి చర్లపల్లి రైల్వేస్టేషన్ వద్ద విజయారెడ్డి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మానసిక ఒత్తిడి కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా, ఆమె భర్త పోలీసులను ఆశ్రయించడంతో కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చినట్లయ్యింది.
ఈ వార్తలు కూడా చదవండి
రేషన్ మాఫియాకు చెక్.. భారీగా బియ్యం పట్టివేత
కోతుల కోసం పెట్టిన విషాహారం తిని నాలుగేళ్ల బాలుడి మృతి