సింగరేణిని దోచుకుంటున్న ప్రభుత్వం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే
ABN , Publish Date - Jun 09 , 2026 | 04:09 PM
సింగరేణి సంస్థ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. సింగరేణి సంస్థను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్, జూన్ 09: సింగరేణి సంస్థ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. సింగరేణి సంస్థను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని ఆయన స్పష్టం చేశారు. కానీ ఆ సంస్థను ప్రభుత్వమే దోచుకుంటుందని విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. జూన్ 5వ తేదీన 26 లక్షల 28 వేల మెట్రిక్ టన్నులు బొగ్గు ఉందని సింగరేణి అధికారులు వెల్లడించారని ఆయన వివరించారు. సింగరేణిలో బొగ్గు నిల్వలు ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు చెబుతున్నారని పేర్కొన్నారు.
బుధవారం ఉదయం 11.00 గంటలకు ఆ బొగ్గు నిల్వలను చూపించాలని మంత్రి శ్రీధర్ బాబును.. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. 3 లక్షలకు పైగా బొగ్గు నిల్వ ఉందన్నారని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తాను, మంత్రి శ్రీధర్ బాబు.. ఇద్దరమే అక్కడికి వెళ్తామన్నారు. బొగ్గు నిల్వ లేకపోతే తప్పు చేశామని ప్రభుత్వం ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా సింగరేణి విషయంలో జోక్యం చేసుకోలేదని గుర్తు చేశారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత సింగరేణిలో ఆయన వేలు పెట్టారని స్పష్టం చేశారు. రెండు, మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వలేని పరిస్థితి సింగరేణిలో నెలకొందన్నారు. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎందుకు మాట్లాడలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు.
సింగరేణిలో 26 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గుపై సీబీసీఐడీతో విచారణ జరిపేలా ఆదేశించాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. రూ.4 వేల కోట్ల ఓడీ (ఓవర్ డ్రాఫ్ట్) ఎందుకు తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. దీనిపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డితోపాటు బండి సంజయ్ కూడా బాధ్యత వహించాల్సి ఉందన్నారు.
గతంలో సింగరేణిలో 20 వేల ఉద్యోగాలు ఉండే.. కేసీఆర్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కారుణ్య నియామకాలు కింద 16 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారని వివరించారు. దీంతో ఆ సంస్థలోని 36 వేల మంది ఉద్యోగులు నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. బొగ్గు లేకుండా ఎందుకు ఆదాయపు పన్ను కట్టారో చెప్పాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆగి ఉన్న సిమెంట్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన లారీ.. ఒకరి సజీవదహనం
స్టీల్ ప్లాంట్ ఘటనపై వైసీపీ అనవసర రాజకీయాలు చేస్తోంది: మంత్రి నారాయణ
Read Latest TG News And Telugu News