సిద్దిపేటకు యంగ్ ఇండియా స్కూల్
ABN , Publish Date - Nov 18 , 2026 | 04:02 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్దిపేట వెళ్లడానికి రెండురోజుల ముందు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
200 కోట్లతో నిర్మాణం..
15 కోట్లతో మరో 2 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల మంజూరు
సీఎం సభకు రెండు రోజుల ముందు నిర్ణయం
దుబ్బాక నియోజకవర్గానికీ యంగ్ ఇండియా స్కూల్
మల్లన్నసాగర్ నిర్వాసితులకు రూ.385 కోట్లు
సభలో మరిన్ని వరాలు ప్రకటించనున్న సీఎం రేవంత్
మరికొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన
హైదరాబాద్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్దిపేట వెళ్లడానికి రెండురోజుల ముందు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిద్దిపేట నియోజకవర్గానికి రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌తోపాటు రూ.15 కోట్లతో (ఒక్కొక్కటి రూ.ఏడున్నర కోట్లు) రెండు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను మంజూరు చేసింది. దీంతోపాటు సిద్దిపేట మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లను, మల్లన్నసాగర్ నిర్వాసితులను ఆదుకునేందుకు తీసుకునే చర్యలను ప్రకటించనున్నట్లు తెలిసింది. ఇందుకు రూ.385 కోట్ల మేర నిధులకు సంబంధించిన ప్రకటన చేయవచ్చని సమాచారం. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ బీమా పథకాన్ని అక్కడి నుంచే ప్రారంభించనున్నారు.
అలాగే దేవాదాయ శాఖకు సంబంధించి కూడా ఒక కార్యక్రమం ఉండనుందని తెలిసింది. ఇక సిద్దిపేటతోపాటు ఇప్పటికే దుబ్బాక నియోజకవర్గానికి మంజూరు చేసిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లతోపాటు మరికొన్నింటికి సీఎం రేవంత్‌రెడ్డి గురువారం శంకుస్థాపన చేయనున్నారు. దుబ్బాకకు మంజూరైన యంగ్ ఇండియా స్కూల్‌ను దుబ్బాక మండలంలోని చిలుకోడు గ్రామానికి సమీపంలో నిర్మించాలని ఖరారు చేశారు. సిద్దిపేటకు మంజూరు చేసిన స్కూల్‌ను అల్లీపూర్ లేదా చర్ల అంకిరెడ్డిపల్లి సమీపంలో నిర్మించేందుకు అవసరమైన దాదాపు 20 ఎకరాల స్థలాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. రెండు నియోజకవర్గాల్లో ఈ స్కూళ్లు, అభివృద్ధి పనులు, నిర్వాసితులకు అందించే మొత్తం కలిపి దాదాపు రూ.850 కోట్లు అవుతుండగా, ఇవి కాకకుండా సిద్దిపేటకు మరికొన్ని వరాలను సీఎం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
ఇవి కూడా చదవండి...
కోనసీమ జిల్లాలో భారీ శబ్దాలతో గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు
కోనసీమ గ్యాస్ లీకేజీపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు
Read Latest AP News And Telugu News