మా అమ్మ అరెస్ట్ వెనుక ఉంది ఆ ఎమ్మెల్యేనే.. రూపారెడ్డి కుమార్తె సంచలన ఆరోపణలు
ABN , Publish Date - Aug 07 , 2026 | 03:22 PM
బీఆర్‌ఎస్ మహిళా నాయకురాలు రూపారెడ్డి అరెస్ట్ వ్యవహారం వెనుక ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఉన్నారని ఆమె కుటుంబసభ్యులు ఆరోపించారు. రూపారెడ్డి కుమార్తె, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కుమారుడు సంతోశ్ కీలక ఆరోపణలు చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 7: బీఆర్‌ఎస్ మహిళా నాయకురాలు రూపారెడ్డి అరెస్ట్ వ్యవహారం వెనుక ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఉన్నారని ఆమె కుటుంబసభ్యులు ఆరోపించారు. రూపారెడ్డి కుమార్తె, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కుమారుడు సంతోశ్ కీలక ఆరోపణలు చేశారు. ఈరోజు(శుక్రవారం) ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. తన అమ్మ రూపారెడ్డి ఎవరినీ మోసం చేయలేదుని.. అప్పులు ఇచ్చిన వారికి ఇప్పటికే కొంత అమౌంట్ సెటిల్ చేశామని చెప్పారు. కావాలని కొంతమందిని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఉసిగొల్పి తమ ఇంటి మీదకు పంపారని ఆరోపించారు.
‘మా అమ్మ రూపారెడ్డి పేరు ప్రతిష్ఠలను దెబ్బతీసేందుకే ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఇదంతా చేయిస్తున్నారు. అప్పు ఇచ్చిన వారిని మేము బెదిరించినట్టు ఆధారాలు ఉంటే వారు డైరెక్టుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లేవారు. అలా కాకుండా నేరుగా మీడియా వద్దకు వెళ్లారు. కొంతమంది మాస్కులు పెట్టుకుని ఇంట్లో వస్తువులను పగులగొట్టి మాపై దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇదే అంశంపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో మూడు సార్లు ఫిర్యాదు ఇచ్చాం. మాపై దాడి జరిగింది.. మేమే బాధితులం కానీ నార్సింగి పోలీసులు మా పిటిషన్‌ను తీసుకోలేదు. మా ఇంటి పైకి కొంతమంది దాడికి వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్‌కు కాల్ చేసింది మేమే. మా అమ్మ స్వయంగా వెళ్లి మాపై దాడి జరిగిందని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. మేము ఇచ్చిన ఫిర్యాదులు తీసుకోకుండా మాపై దాడి చేయడానికి వచ్చిన వారి ఫిర్యాదులను నార్సింగ్ పోలీసులు తీసుకున్నారు. పోలీసుల మీదకి ప్రకాశ్ గౌడ్ ఒత్తిడి తీసుకొచ్చారు.. అందుకే మా అమ్మపై కేసు పెట్టి అరెస్టు చేశారు. రూపారెడ్డిని పనికి రాకుండా చేయాలని ఆయన కొంతమందితో మాట్లాడిన ఆడియో ఆధారాలు ఉన్నాయి’ అంటూ రూపారెడ్డి కుమార్తె తెలిపారు.
మా ఎంగేజ్మెంట్ మా నాన్నకు ఇష్టం లేదు: ఎమ్మెల్యే కుమారుడు సంతోశ్ గౌడ్
గత నెలలో తనకు, రూపారెడ్డి కూతురితో నిశ్చితార్థం జరిగిందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కుమారుడు సంతోశ్ గౌడ్ తెలిపారు. ‘మా నాన్నకు ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఇష్టం లేదు. నాకు కాబోయే అత్త రూపారెడ్డి ఇంటిపై దాడి చేయించాలన్న ఆలోచన మా నాన్నకు ఎందుకు వచ్చిందో తెలియదు. ఏదైనా చెప్పుడు మాటలు విన్నారా తెలియట్లేదు. అంతమంది వచ్చి దాడి చేసినప్పుడు మాకు ప్రాణహానీ ఉన్నట్టే కదా. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు’ అని సంతోశ్ గౌడ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
జోగిపేట ఏరియా ఆస్పత్రిలో నకిలీ డాక్టర్.. మంత్రి దామోదర సీరియస్
చేనేత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Read Latest Telangana News And Telugu News