Share News

రోడ్డు భద్రతకు 5 సూత్రాలు

ABN , Publish Date - Nov 20 , 2026 | 05:30 AM

రోడ్డు ప్రమాదాలు నిత్యం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయని, అతి వేగం, హెల్మెట్‌ లేకుండా ప్రయాణించడం, రాంగ్‌ రూట్‌లో వెళ్లడం, మద్యం తాగి వాహనాలు నడపడం వంటి కారణాలతో ..

రోడ్డు భద్రతకు 5 సూత్రాలు

  • ప్రమాదాలు జరగక ముందే అడ్డుకోవాలి

  • అమెరికాలో ‘సేఫ్‌ సిస్టమ్స్‌ అప్రోచ్‌’ అమలు

  • ఏఐ కెమెరాలతో ముందే ప్రమాదాల గుర్తింపు

  • తెలంగాణకు ప్రత్యేక ప్రణాళికలు అవసరం

  • ‘ఆంధ్రజ్యోతి’తో అంతర్జాతీయ మౌలిక వసతుల సలహాదారు సామ్రాట్‌ వలాని

హైదరాబాద్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాలు నిత్యం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయని, అతి వేగం, హెల్మెట్‌ లేకుండా ప్రయాణించడం, రాంగ్‌ రూట్‌లో వెళ్లడం, మద్యం తాగి వాహనాలు నడపడం వంటి కారణాలతో విలువైన ప్రాణాలు పోతు న్నాయని అంతర్జాతీయ మౌలిక వసతులు-వ్యూహాత్మక సలహాదారు సామ్రాట్‌ వలాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కొత్త పద్ధతులు, ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ (ఐఆర్‌సీ) 85వ సదస్సులో రహదారుల భద్రత, నాణ్యత అంశంపై మాట్లాడేందుకు అమెరికా నుంచి వచ్చిన సామ్రాట్‌ వలాని ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.


రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ఏయే దేశాలు ముందున్నాయి?

ఐరోపా దేశాలు, ఆస్ట్రేలియా రోడ్డు భద్రతలో మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. అమెరికా కూడా నాలుగేళ్లగా రోడ్డు ప్రమాదాలను తగ్గించే దిశగా ముందుకు వెళ్తోంది. ఈ దేశాల్లో ప్రమాదాలను కేవలం డ్రైవర్ల తప్పుగా చూడరు. రోడ్ల నిర్మాణం ఎలా ఉంది? వాహనాల్లో భద్రతా ఏర్పాట్లు ఉన్నాయా? వేగాన్ని ఎలా నియంత్రిస్తున్నారు? బాధితులకు ఎంత త్వరగా వైద్యం అందుతోంది? అనే అంశాలను పరిశీలిస్తారు.


అమెరికాలో తీసుకుంటున్న చర్యలేంటి?

అమెరికా ప్రభుత్వం ‘సేఫ్‌ సిస్టమ్స్‌ అప్రోచ్‌’ అనే విధానాన్ని అమలు చేస్తోంది. అంటే రోడ్డు ప్రమాదాలు జరిగినా ప్రాణనష్టం జరగకుండా, గాయాల తీవ్రత తగ్గేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం. ఇందులో సురక్షితమైన రోడ్లు, సురక్షితమైన వాహనాలు, వేగ నియంత్రణ, ప్రజల్లో అవగాహన, అత్యవసర వైద్యం వంటి ఈ ఐదు అంశాలపై అమెరికా దృష్టి పెడుతోంది. ఈ ఐదు సూత్రాలను మనం కూడా పాటించాలి.


ఆధునిక టెక్నాలజీతో ప్రమాదాలను అడ్డుకోవచ్చా?

కచ్చితంగా అడ్డుకోవచ్చు. ఇందులో టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది. ఏఐ ఆధారంగా పనిచేసే స్మార్ట్‌ కెమెరాలు, సెన్సార్లు రోడ్లపై పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తుంటాయి. ఎక్కడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని గుర్తిస్తే వెంటనే కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందిస్తాయి. దీంతో అధికారులు ముందుగానే చర్యలు తీసుకోవచ్చు.


రోడ్ల నిర్మాణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

రోడ్డు నిర్మాణమే భద్రతకు మొదటి అడుగు. రోడ్లు నిర్మించేటప్పుడు వాహనదారులు చేసే తప్పులను దృష్టిలో పెట్టుకోవాలి. ప్రమాదకరమైన మలుపుల వద్ద సరైన లైటింగ్‌ ఉండాలి. హెచ్చరిక బోర్డులు, సూచికలు ఏర్పాటు చేయాలి. ప్రమాదం జరిగిన తర్వాత మొదటి గంటలో బాధితులకు వైద్యం అందితే ప్రాణాలు కాపాడే అవకాశం ఎక్కువ. ఇందుకోసం అంబులెన్సులు, ఆస్పత్రులు, అత్యవసర వైద్య బృందాలు సిద్ధంగా ఉండాలి. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయం.


ప్రమాదాలను తగ్గించాలంటే ఏం చేయాలి?

తెలంగాణలో అతివేగం, హెల్మెట్‌ లేకుండా వాహనాలు నడపడం, రాంగ్‌ రూట్‌లో వెళ్లడం, మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయడం వంటి సమస్యలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. అమెరికా, ఐరోపా దేశాల్లో మాదిరిగా ప్రజలకు అవగాహన కల్పించాలి.


ఇవి కూడా చదవండి...

హైదరాబాద్‌లో డ్రగ్స్ కింగ్‌పిన్ అరెస్ట్.. 51 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏ స్వాధీనం

‘క్రమశిక్షణ ముందు అందరూ సమానమే’.. రాజ్‌గోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలపై మహేశ్ రియాక్షన్

Read latest Telangana News And Telugu NEws

Updated Date - Nov 20 , 2026 | 05:30 AM