గ్రీన్‌చానల్లో నిధులిస్తున్నా పనులు వేగంగా జరగట్లేదేం!?
ABN , Publish Date - Sep 22 , 2026 | 06:41 AM
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి గ్రీన్ చానల్‌లో నిధులు మంజూరు చేస్తున్నా పనులు వేగంగా ఎందుకు జరగడం లేదని అధికారులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాబోయే నెల రోజులూ 24 గంటలూ పని చేయాల్సిందే
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై సీఎం రేవంత్ సమీక్ష
హైదరాబాద్, వరంగల్ మెడికల్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి గ్రీన్ చానల్‌లో నిధులు మంజూరు చేస్తున్నా పనులు వేగంగా ఎందుకు జరగడం లేదని అధికారులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే 30 రోజులూ 24 గంటలూ పనులు జరగాలని, ఆ మేరకు వర్క్ షెడ్యూల్ తయారు చేసుకుని ముందుకు వెళ్లాలని నిర్దేశించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణంపై సోమవారం రాత్రి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎంవో అధికారులు నిరంతరం క్షేత్రస్థాయికి వెళ్లి సమీక్ష చేయాలని, ప్రత్యేక అధికారులను నియమించి పనులను పర్యవేక్షించాలని చెప్పారు. ప్రతి పనికి ఒక ప్రత్యేక అధికారికి బాధ్యత అప్పగించాలని, ఇక నుంచి ప్రతి రోజు కలెక్టర్ ఆస్పత్రి పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు.
సనత్ నగర్ టిమ్స్ తరహాలో వరంగల్‌లోనూ త్వరలోనే ఓపీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని, ఆస్పత్రి చుట్టూ మంచి వాతావరణం ఉండేలా పరిసరాల్ని తీర్చిదిద్దాలని సూచించారు. అలాగే, సనత్ నగర్ టిమ్స్‌లో తక్షణమే స్టాఫ్ క్వార్టర్స్ పనులు ప్రారంభం కావాలన్నారు. ఆస్పత్రి నిర్వహణను ఏజెన్సీకి అప్పగించాలని నిర్దేశించారు. వరంగల్‌లో భూగర్భ డ్రైనేజీని భారీ నిధులతో నిర్మిస్తున్నందున పనులను పకడ్బందీగా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వరంగల్ అభివృద్ధి పనులపై సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రధానంగా దృష్టి పెట్టాలన్నారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్‌లను కలుపుతూ రోడ్ కనెక్టివిటీ ఏర్పాటు చేయాలని, విమానాశ్రయం వరకూ కనెక్టివిటీ ఉండాలని సూచించారు. హైదరాబాద్ తరహాలో వరంగల్‌ను అభివృద్ధి చేయాలని, టూరిజంపై దృష్టి సారించాలని నిర్దేశించారు. విమానాశ్రయం ప్రారంభమయ్యాక భద్రకాళి, రామప్ప ఆలయాలకు భక్తుల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని సౌకర్యాలతో పెద్ద బస్ టెర్మినల్ కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అంబులెన్స్ అన్‌ఫిట్!
కాంగ్రెస్ నేతల ఆస్తుల వద్దకు బీఆర్‌ఎస్!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News