Share News

ఆర్టీసీ సమస్యల పరిష్కారమే లక్ష్యం: సీఎం రేవంత్

ABN , Publish Date - May 01 , 2026 | 09:16 PM

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ‌ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే..

ఆర్టీసీ సమస్యల పరిష్కారమే లక్ష్యం: సీఎం రేవంత్
Telangana RTC News

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ‌ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు హామీలిచ్చారు. సంస్థ భవిష్యత్తుపై కార్మిక సంఘాల నాయకులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఆర్టీసీలో పనిచేస్తున్న ఏ ఒక్క డ్రైవర్‌నూ ఉద్యోగం నుంచి తొలగించబోమని సీఎం హామీ ఇచ్చారు. విశ్రాంత ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లించేందుకు సత్వర చర్యలు తీసుకుంటామన్నారు.


ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిన కాలానికి సంబంధించి 3 రోజుల వేతనాన్ని తక్షణమే చెల్లించాలని అధికారులను సీఎం ఆదేశించారు. సమ్మె సమయంలో కార్మికులపై నమోదైన కేసులను ఎత్తేస్తామన్నారు. నవీకరణ, మౌలిక సదుపాయాల కల్పన, ఆర్టీసీని ఆధునీకరించే క్రమంలో రెండు భారీ బస్ టెర్మినల్స్ ఏర్పాటుకు చేస్తామని సీఎం ప్రకటించారు. గాజులరామారంలో 100 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి బస్ టెర్మినల్ నిర్మాణం చేపడతామన్నారు. అలాగే బహదూర్‌గూడలో 150 ఎకరాల్లో మరో నూతన బస్ టెర్మినల్ ఏర్పాటు చేస్తామన్నారు. డీజిల్ ఖర్చును తగ్గించి, సంస్థను లాభాల బాట పట్టించేందుకు 1000 కొత్త ఎలక్ట్రిక్ (EV) బస్సులను కొనుగోలు చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఈ బస్సులను మెట్రో ట్రైన్, ఎంఎంటీఎస్ (MMTS) సర్వీసులతో అనుసంధానించడం ద్వారా ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు.


ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల నిర్వహణ, ప్రభుత్వంలో సంస్థ విలీనం ప్రక్రియపై సమగ్ర కార్యాచరణతో రావాలని కార్మిక సంఘం నాయకులకు సీఎం సూచించారు. ఉద్యోగుల వేతన సవరణ (PRC) అంశాన్ని ప్రభుత్వం పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చారు. ఆర్టీసీ యాజమాన్యానికి, కార్మికులకు మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని, సమస్యల పరిష్కారం కోసం ప్రతి మూడు నెలలకొకసారి కార్మిక సంఘాలతో సమావేశాలు నిర్వహించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీకి ఆదరణతో పాటు ఆదాయం కూడా పెరిగిందని సీఎం హర్షం వ్యక్తం చేశారు. సంస్థకున్న అప్పుల పునర్వ్యవస్థీకరణ కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని, ఆర్టీసీ సమస్యలను 100 శాతం పరిష్కరిస్తామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.


ఇవి కూాడా చదవండి..

మద్యం మత్తులో అసెంబ్లీకి సీఎం? పరీక్ష చేయాలంటూ విపక్షాల డిమాండ్

మమతా బెనర్జీపై నిఘా ఉంచాం.. ఫోటో షేర్ చేసిన సువేందు

Updated Date - May 01 , 2026 | 09:28 PM