మద్యం మత్తులో అసెంబ్లీకి సీఎం? పరీక్ష చేయాలంటూ విపక్షాల డిమాండ్
ABN , Publish Date - May 01 , 2026 | 05:07 PM
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలకు మద్యం పరీక్షలు నిర్వహించాలని ప్రతిపక్ష పార్టీల సభ్యులు డిమాండ్ చేశారు.
ఛండీగఢ్, మే 01: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలకు మద్యం పరీక్షలు నిర్వహించాలని ప్రతిపక్ష పార్టీల సభ్యులు డిమాండ్ చేశారు. అందుకు నిరసనగా విపక్ష సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. కార్మిక దినోత్సవం నేపథ్యంలో ఈ రోజు ఉదయం అసెంబ్లీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం భగవంత్ మాన్.. ప్రసంగిస్తున్నప్పుడు మద్యం మత్తులో ఉన్నారంటూ ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఆరోపించారు.
అసెంబ్లీ తలుపులు వేసి ఆప్ పార్టీ ఎమ్మెల్యేలందరికీ మద్యం పరీక్షలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో సీఎం మాన్ అసాధారణ పరిస్థితిలో ఉన్నారని సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్ సింగ్ బాజ్వా ఆరోపించారు. దీంతో పంజాబ్ అసెంబ్లీలో వివాదం చెలరేగింది.
వీడియో షేర్ చేసి మాలీవాల్..
ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లిన మాజీ ఎంపీ స్వాతి మాలీవాల్ కూడా ఈ అంశంపై స్పందించారు. గతంలో పార్లమెంట్‌లో మాన్ మాట్లాడుతున్న వీడియోను ఈ సందర్భంగా ఆమె షేర్ చేశారు. ప్రజాస్వామ్య దేవాలయానికి మాన్ మద్యం తాగి వచ్చారని ఆరోపించారు. ఈ రోజు కూడా ఆయన ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పంజాబ్ అసెంబ్లీకి తాగి వచ్చారంటూ సోషల్ మీడియాలో మాలీవాల్ కామెంట్ చేశారు.
ఈ వ్యక్తి మద్యం సేవించి గుడి, గురుద్వారా సాహెబ్, లోక్‌సభతోపాటు ప్రభుత్వ సమావేశాలకూ వెళ్తారన్నారు. విదేశాల్లో ఆయన విపరీతంగా తాగుతారని పేర్కొన్నారు. అందువల్ల విమానం నుంచి మాన్‌ను దింపివేసిన సంఘటనలు ఉన్నాయని ఈ సందర్భంగా మాలీవాల్ గుర్తు చేశారు.
పరీక్ష చేస్తే.. వాస్తవాలు తెలుస్తాయి: శిరోమణి అకాలీదళ్
మద్యం తాగి సీఎం మాన్ అసెంబ్లీకి హాజరు కావడాన్ని శిరోమణి అకాలీదళ్ ఖండించింది. ఇది సిగ్గుపడాల్సిన చర్యగా అభివర్ణించింది. సీఎంతోపాటు ఆప్ ఎమ్మెల్యేలంతా మద్యం పరీక్షలు చేయించుకోవాలని డిమాండ్ చేసింది. కార్మిక దినోత్సవం వేళ.. సీఎం ఇలా సభలో కనిపించడం సిగ్గు చేటంది. సీఎంకు మద్యం పరీక్ష నిర్వహిస్తే.. పంజాబ్ ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని శిరోమణి అకాలీదళ్ అభిప్రాయపడింది.
స్పందించిన ఆప్..
ఇంకో వైపు కాంగ్రెస్ ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. పంజాబ్ ఆప్ అధ్యక్షుడు, మంత్రి అమన్ అరోరా స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు నిరాధారమైనవని కొట్టి పారేశారు. మద్యం పరీక్ష నిర్వహించాలంటూ ఆ పార్టీ చేసిన డిమాండ్‌ను ఆయన తోసిపుచ్చారు. మే డే సందర్భంగా సీఎం భగవంత్ మాన్ నాయకత్వంలో పంజాబ్ ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసిందని వివరించారు.
కార్మికుల శ్రమను గుర్తించి.. గౌరవించడమే లక్ష్యంగా ఈ సభను నిర్వహించినట్లు అరోరా తెలిపారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తుందంటూ కాంగ్రెస్ పార్టీపై ఆయన నిప్పులు చెరిగారు. ఇది సభ గౌరవాన్ని దెబ్బ తీయడమేనని అరోరా వ్యాఖ్యానించారు.