ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువ: సీఎం రేవంత్
ABN , Publish Date - Jun 15 , 2026 | 07:42 PM
ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువయ్యామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం సచివాలయంలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ పై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్, జూన్ 15: ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువయ్యామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం సచివాలయంలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ పై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మార్చి 16 నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో చురుగ్గా పాల్గొన్న విభాగాలను ఈ సందర్భంగా సీఎం రేవంత్ అభినందించారు. అలాగే ఈ సమయంలో క్షేత్రస్థాయికి వెళ్లని అధికారులు, జిల్లా కలెక్టర్లపై నివేదిక అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. ఫీల్డ్‌కు వెళ్లని అధికారులపై క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకోవద్దో వివరణ కోరాలని సీఎస్‌కు సూచించారు.
ప్రభుత్వ ఆదేశాలు పాటించని అధికారులను ఉపేక్షించవద్దన్నారు. చేసిన పనులను చెప్పుకోలేక పోయారు.. వెంటనే ప్రచారం చేయ్యండని అన్ని శాఖలను ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. మీడియా, డిజిటల్ మీడియాలో మంచి పనులు ప్రజలకు చెప్పుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రజల ఫీడ్ బ్యాక్ నమోదు చేయాలని.. వారి సమస్యలు పరిష్కరించాలని స్పష్టం చేశారు. 3 నెలల్లో చేసిన శంకుస్థాపనలు, అభివృద్ధి పనులు, ఆస్తుల వివరాలు నమోదు చేయాలన్నారు.
గ్రామ పంచాయతీ భవనాలు లేని గ్రామాల జాబితా వెంటనే సిద్ధం చేయాలని తెలిపారు. కొత్తగా గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. అన్ని పాఠశాలలపై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్య, వైద్య శాఖల్లో ఫేషియల్ రికగ్నిషన్ అటెండన్స్ తప్పనిసరి చేయాలని చెప్పారు. స్కూల్ నుంచి కాలేజీ వరకు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) నుంచి ఉస్మానియా ఆసుపత్రి వరకు ఇదే అటెండన్స్ అమలు చేయాలని ఆదేశించారు.
జిల్లాల వారీగా ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికపై వెంటనే సమీక్ష జరపాలని ఉన్నతాధికారులు, వివిధ శాఖల మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి జిల్లాకు సీనియర్ ఐఏఎస్‌ను స్పెషల్ ఆఫీసర్‌గా పంపాలన్నారు. జిల్లాల వారీగా ప్రగతి నివేదికలు విడుదల చేయాలని సూచించారు. నియోజకవర్గం, మండలం, గ్రామాల వారీగా లబ్ధిదారుల వివరాలు డ్యాష్ బోర్డులో పెట్టాలని స్పష్టం చేశారు. సీఎం హామీల పురోగతిపై నియోజకవర్గాల వారీగా నివేదిక ఇవ్వాలని ఈ సమీక్షా సమావేశంలో అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణలో భారీ వర్షాలు.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
గోల్కొండలో సంచలనం సృష్టించిన హత్య కేసును ఛేదించిన పోలీసులు
Read Latest TG News And Telugu News