జీడీపీకి సగం సీట్లు
ABN , Publish Date - Apr 14 , 2026 | 05:03 AM
డీలిమిటేషన్‌లో భాగంగా మోదీ సర్కారు పెంచాలనుకుంటున్న ఎంపీ సీట్ల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి సరికొత్త ప్రతిపాదన చేశారు. రాష్ట్రాల వారీగా 50 శాతం చొప్పున పెరిగే మొత్తం 272 ఎంపీ సీట్లలో సగం సీట్లను జీఎ్‌సడీపీలో ....
మిగిలిన సగం సీట్లను ప్రోరేటాలో అన్ని రాష్ట్రాలకు కేటాయించాలి
సీఎం రేవంత్‌రెడ్డి హైబ్రిడ్ ప్రతిపాదన
50 శాతం సీట్ల పెంపు ప్రతిపాదనతో ఉత్తరాది, దక్షిణాది మధ్య భారీ అంతరం
పంజాబ్ వంటి రాష్ట్రాలకూ అన్యాయం
దక్షిణాదిని ద్వితీయ శ్రేణిగా మార్చే యత్నం
రాజకీయ అవసరాలకే 50శాతం ప్రతిపాదన
బిల్లును ఎలా ఆమోదిస్తారో చూస్తాం
మహిళా బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు
డీలిమిటేషన్‌ను కలపడం రాజకీయ కుట్ర
2026 జనాభా నిబంధనను తొలగించాలి
అఖిలపక్షంతో చర్చించాలి: సీఎం రేవంత్
హైదరాబాద్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): డీలిమిటేషన్‌లో భాగంగా మోదీ సర్కారు పెంచాలనుకుంటున్న ఎంపీ సీట్ల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి సరికొత్త ప్రతిపాదన చేశారు. రాష్ట్రాల వారీగా 50 శాతం చొప్పున పెరిగే మొత్తం 272 ఎంపీ సీట్లలో సగం సీట్లను జీఎ్‌సడీపీలో మెరిట్ సాధించిన రాష్ట్రాలకు కేటాయించాలన్నారు. మిగిలిన సగం సీట్ల మేరకు ప్రోరేటా ప్రకారం అన్ని రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను పెంచాలని సూచించారు. ఈ మేరకు తాను హైబ్రిడ్ ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచుతున్నట్లు చెప్పారు. ఇలా చేస్తే దేశానికి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న రాష్ట్రాలను గౌరవించినట్లు అవుతుందన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదన్నారు. అయితే ఈ నెల 16 నుంచి జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెడుతున్న మహిళా బిల్లులో నియోజకవర్గాల పునర్విభజననూ కలపడం రాజకీయ కుట్ర అని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ చట్టంలో ‘2026 జనాభా లెక్కల ప్రకారం’ అనే నిబంధనను తొలగిస్తే.. ఉన్న సీట్ల ప్రకారం తక్షణమే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమల్లోకి వస్తుందన్నారు. 2029లో లోక్‌సభ ఎన్నికలతోపాటు వివిధ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లను అమలు చేయవచ్చునన్నారు. ప్రస్తుతం ఉన్న లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల ప్రాతిపదికన మహిళా రిజర్వేన్ సవరణ బిల్లును తీసుకువస్తే కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుందని స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, పలువురు మంత్రులు, ఎంపీలతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం వ్యూహాత్మకంగానే మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లును, డీలిమిటేషన్‌ను ఒకటిగా చూపిస్తోందని, మహిళా బిల్లుకు ప్రతిపక్షాలు సహకరించడంలేదంటూ ప్రచారం చేస్తోందని తెలిపారు.
మహిళలకు ఓటుహక్కు కల్పించింది కాంగ్రెస్సే
దేశంలో పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని సీఎం రేవంత్ అన్నారు. అప్పటికి ప్రపంచంలోని చాలాదేశాల్లో మహిళలకు ఓటు హక్కు లేదని చెప్పారు. దేశ ప్రధానిగా, రాష్ట్రపతిగా, లోక్‌సభ స్పీకర్‌గా, ముఖ్యమంత్రులుగా, గవర్నర్లుగా ఎన్నో రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో మహిళలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించిందన్నారు. మహిళలైన ఇందిర, సోనియాల నాయకత్వంలో పనిచేసిన పార్టీ అన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించిందీ.. కాంగ్రెస్సేనన్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా సోనియాగాంధీ నాయకత్వంలో పార్లమెంటులో 2013లో ప్రవేశపెట్టిందీ కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. అయితే ఆ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందినా.. బీజేపీ సహకరించకపోవడంతో లోక్‌సభలో ఆమోదం పొందలేదని తెలిపారు. దానిని పదేళ్లపాటు పట్టించుకోని మోదీ.. 2023లో తెరపైకి తెచ్చారని, అయినా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతిచ్చిందని గుర్తు చేశారు. అయితే 2026 జనాభా లెక్కల తర్వాత గెజిట్ ఆధారంగా మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామని ఆ చట్టంలో పేర్కొన్నారని తెలిపారు. జనాభా లెక్కలతో సంబంధం లేకుండా అప్పుడే చట్టాన్ని చేసి ఉంటే.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 181 మంది మహిళలు ఎన్నికై ఉండేవారని పేర్కొన్నారు. 2023లో లోక్‌సభలో ఆమోదించినప్పుడే అమల్లోకి రాకుండా ఆపడంతో ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా మహిళలు రిజర్వేషన్‌కు దూరమయ్యారని అన్నారు. బీజేపీ ఏర్పాటైన ఈ 46 ఏళ్లలో ఏ ఒక్క మహిళనైనా ఆ పార్టీకి అధ్యక్షురాలిగా నియమించిందా? అని ప్రశ్నించారు. మహిళలను చిన్నచూపు చూడడం, ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడడం బీజేపీ లక్షణమన్నారు.
50 శాతంతో పెరగనున్న అంతరం
డీలిమిటేషన్ అంశాన్ని ప్రధాని మోదీ.. రాజకీయ ప్రయోజనాల కోసం పావుగా వాడుకుంటున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. 50 శాతం చొప్పున లోక్‌సభ సీట్ల పెంపు ప్రతిపాదన అమలైతే ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య భారీ అంతరం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ప్రస్తుతం కేరళలో 20 లోక్‌సభ సీట్లు ఉంటే.. యూపీలో 80 ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న అంతరం 60 సీట్లు మాత్రమే. 50 శాతం సీట్ల పెంపు ప్రతిపాదన అమలైతే కేరళ సీట్లు 30కి, యూపీ సీట్లు 120కి పెరుగుతాయి. రెండు రాష్ట్రాల మధ్య సీట్ల అంతరం ఏకంగా 90 సీట్లకు పెరుగుతుంది. పుదుచ్చేరితో కలుపుకొని మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం 130 సీట్లు ఉండగా.. ఉత్తరాది రాష్ట్రాల్లో 413 సీట్లు ఉన్నాయి. ప్రస్తుత అంతరం 283 ఉంది. 50 శాతం పెంపు ప్రతిపాదన అమలుతో దక్షిణాది సీట్ల సంఖ్య 195కు ఉత్తరాది సీట్ల సంఖ్య 621కి చేరుకుంటుంది. అప్పుడు అంతరం 426కు పెరుగుతుంది’’ అని రేవంత్ వివరించారు. బలహీనులు, బలవంతులు మధ్య చర్చలు జరగవని, సమాన స్థాయి ఉన్నవారి మధ్య చర్చలు ఉంటాయని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలను ద్వితీయ శ్రేణి రాష్ర్టాలుగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ సమస్య ఢిల్లీ, పంజాబ్‌కు, పలు చిన్న రాష్ట్రాలకూ ఎదురు కాబోతోందని, ఆయా రాష్ట్రాలు రాజకీయంగా మనుగడ కోల్పోతాయని తెలిపారు. ఇది వివక్షకు దారి తీస్తుందని, తెలంగాణ ఉద్యమం, నక్సలిజం వంటివి వివక్ష వల్లనే వచ్చాయని అన్నారు. వివక్షను ఇంకా పెంచడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. డీలిమిటేషన్‌లో పర్సంటేజీలు కాదని, నంబర్ ముఖ్యమని ఓ ప్రశ్నకు సమాధానంగా సీఎం చెప్పారు. వాజపేయి ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో పడిపోయిందని గుర్తు చేశారు. రాజకీయ అవసరాల కోసమే మోదీ ప్రభుత్వం 50 శాతం సీట్లు అంటోందని, దేశం మనుగడ, మంచి కోసం కాదని ఆరోపించారు.
దక్షిణాది రాష్ట్రాలు ఆర్థిక రాజధానులు..
దక్షణాది రాష్ర్టాలు ఆర్థిక రాజధానులు, ఉత్తరాది రాష్ర్టాలు రాజకీయ రాజధానులని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పన్నులు కట్టి సలామ్‌లు కొట్టడానికి తాము వ్యతిరేకమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దంటూ రూలింగ్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. మిగిలిన 50 శాతానికి మెరిట్‌ను ప్రాంతిపదికగా తీసుకోవాలని చెప్పిందని గుర్తు చేశారు. అదే సూత్రాన్ని డీలిమిటేషన్‌కూ అమలు చేయాలన్నారు. దేశ జీడీపీలో నాలుగు దక్షిణాది రాష్ట్రాల వాటా 53 శాతంగా ఉందని, దేశానికి ఆదాయాన్ని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న రాష్ట్రాలను ఎలా శిక్షిస్తారని ప్రశ్నించారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించి సంప్రదింపులు చేపట్టాలని, జనగణన పూర్తయ్యే 2027 జనవరిలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. ఆ అభిప్రాయాలను 2027 బడ్జెట్ సమావేశాల్లో చర్చకు పెట్టి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ ప్రక్రియను 2028 మార్చి కల్లా పూర్తి చేయవచ్చునని, అంతే తప్ప హడావుడిగా, మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుపెట్టుకుని ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరం పెంచవద్దని హితవు పలికారు. తమ ఎంపీలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, ఇప్పుడు పునర్విభజనపై కూడా పోరాడతారని తెలిపారు. దక్షణాది రాష్ర్టాలతో పాటు చిన్న రాష్ర్టాలను కూడా ఐక్యం చేస్తామని, పార్లమెంట్‌లో ఈ బిల్లును ఎలా ఆమోదిస్తారో చూస్తామని అన్నారు. 50 శాతం సీట్ల పెంపు జరిగితే కిషన్‌రెడ్డి, బండి సంజయ్.. మోదీ ఇంటి ముందు బంట్రోతులుగా నిలబడాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ వ్యాఖ్యలు దక్షిణాది రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకూ వ్యతిరేకమన్నారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎంపీలు చామల కిరణ్‌కుమార్ రెడ్డి, మల్లు రవి, రఘురరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.