Share News

పదవులన్నీ మీరే తీసుకుంటే జాతిపిత ఎలా అవుతారు: సీఎం రేవంత్

ABN , Publish Date - Feb 02 , 2026 | 07:02 PM

సర్వం త్యాగం చేసిన వారు జాతిపితలు, ఉద్యమ నేతలు అవుతారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పదవులన్నీకేసీఆర్‌ కుటుంబానికే వచ్చాయని విమర్శించారు.

పదవులన్నీ మీరే తీసుకుంటే జాతిపిత ఎలా అవుతారు: సీఎం రేవంత్

హైదరాబాద్, ఫిబ్రవరి 02: స్వాతంత్ర సమరయోధుడు, మాజీ ఎంపీ రావి నారాయణరెడ్డి స్ఫూర్తితో తాము పని చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి రావి నారాయణరెడ్డి జాతీయ పురస్కారాన్ని సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డికి రావి నారాయణరెడ్డి పురస్కారం ఇవ్వడం సముచితమన్నారు. నిజాం పాలకులకు వ్యతిరేకంగా రావి నారాయణరెడ్డి పోరాడారని గుర్తు చేశారు. పేదలకు 500 ఎకరాలు పంచి అందరికీ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు.


స్వేచ్ఛ హరించి.. హక్కులకు భంగం కలిగిస్తే ప్రజలు తిరుగుబాటు చేయడం.. తద్వారా అది సాయుధ పోరాటంగా మారుతోందని రావి నారాయణరెడ్డి చాటి చెప్పారని తెలిపారు. నాడు ప్రజల కష్టాలు, రాచరిక పోకడలు, అరాచక చర్యలపై రావి నారాయణరెడ్డి అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు. స్వేచ్ఛ కోసం పోరాడి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారన్నారు. చరిత్రలో చాలా మంది స్వేచ్ఛ కోసం పోరాటాలు చేశారని.. కానీ గొప్ప నాయకులను ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటారని పేర్కొన్నారు. ఈ తరంలో జైపాల్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి తమకు స్ఫూర్తి అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.


జైపాల్‌రెడ్డితో తనకు ఎక్కువ రాజకీయ సంబంధాలు లేవని.. కానీ 2014లో 2 వేల ఓట్ల తేడాతో ఆయన ఎన్నికల్లో ఓడిపోవడానికి తానే కారణమని సీఎం రేవంత్‌ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. అయినా తనను జైపాల్‌రెడ్డి ఎప్పుడూ ద్వేషించలేదన్నారు. కానీ ప్రస్తుతం ప్రజలు ఓడించినా కొందరు పదవులు వదులుకోవట్లేదంటూ రాజకీయ నాయకుల తీరును ఈ సందర్భంగా సీఎం రేవంత్ ఎండగట్టారు. దేశంలో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో రావి నారాయణరెడ్డి గెలిచారన్నారు. అలాగే ఎన్నికల్లో పోటీ నుంచి రావి నారాయణరెడ్డి స్వచ్ఛందంగా తప్పుకున్నారని సీఎం రేవంత్‌ రెడ్డి వివరించారు.


స్వాతంత్య్రం కోసం పోరాడిన జాతిపిత మహాత్మా గాంధీ ఏనాడైనా పదవులు తీసుకున్నారా? సొంత కుటుంబం కోసం ఆనాడు ఆయన పోరాడారా? అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అయితే రాష్ట్రంలో వింత వాతావరణం నెలకొందన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను తెలంగాణ జాతిపిత అని వాళ్లే చెప్పుకుంటారని వ్యంగ్యంగా అన్నారు. ఉద్యమకారుడు అంటూ వాళ్ల వాళ్లే రాసుకుంటారని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు ఇస్తే మొత్తం తెలంగాణ సమాజానికే ఇచ్చినట్లా? అంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు.


సర్వం త్యాగం చేసిన వారు జాతిపితలు, ఉద్యమ నేతలు అవుతారని స్పష్టం చేశారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పదవులన్నీకేసీఆర్‌ కుటుంబానికే వచ్చాయన్నారు. పదవులన్నీ మీరే తీసుకుంటే.. మీరు జాతిపిత ఎలా అవుతారంటూ కేసీఆర్ కుటుంబాన్ని సీఎం రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ప్రొ. కోదండరామ్‌ ఉద్యమకారుడు కాదా? ఉద్యమ సమయంలో పార్టీలన్నీ సఫలం కాలేదని.. ఆ క్రమంలో అన్ని రాజకీయ పక్షాలను.. జేఏసీగా ఏర్పాటు చేసి కోదండరామ్‌ పోరాడ లేదా? అంటూ ప్రశ్నించారు. అలాంటి కోదండరామ్‌ ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఆయన్ని సైతం పోలీసులు ఈడ్చుకెళ్లారని గుర్తు చేశారు. కోదండరామ్‌కి జరిగింది అవమానం కాదా? అని రేవంత్ రెడ్డి నిలదీశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై దాడి.. ఖండించిన ప్రెస్ క్లబ్

బుల్లెట్ ట్రైన్‌కు హబ్‌గా హైదరాబాద్: అశ్వినీ వైష్ణవ్

For More TG News And Telugu News

Updated Date - Feb 02 , 2026 | 08:45 PM