రైతు ముసుగులో కేసీఆర్ రాజకీయం: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - May 30 , 2026 | 07:10 PM
రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ నిలిపివేసినా, మోటార్లకు మీటర్లు పెట్టినా తాము ఎన్నికల్లో పోటీ చేయబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సవాల్‌కు బీఆర్ఎస్ సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు.
హైదరాబాద్, మే 30: తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ నిలిపివేసినా, మోటార్లకు మీటర్లు పెట్టినా తాము ఎన్నికల్లో పోటీ చేయబోమని, ఈ సవాల్‌కు బీఆర్ఎస్ సిద్ధమా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో చిట్ చాట్ చేస్తూ.. రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్ రైతుల ముసుగులో లైఫ్ లైన్ కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దేశంలోనే తొలిసారిగా రైతుల కోసం ప్రత్యేకంగా ‘రైతు డిస్కం’ ఏర్పాటు చేశామని, దీనివల్ల ప్రభుత్వానికి తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేసే వెసులుబాటుతో పాటు జవాబుదారీతనం పెరుగుతుందని స్పష్టం చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మద్దతు ధర (MSP) ప్రకటించి వదిలేసిందే తప్ప ఒక్క గింజ కూడా కొనడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో వరి, జొన్న, మొక్కజొన్న పంటలను తమ ప్రభుత్వమే పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తోందని, ఇప్పటివరకు 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తడిచిన ధాన్యానికి సైతం మద్దతు ధర కల్పిస్తున్నామని, సన్న వడ్లకు బోనస్ ఇస్తామని భరోసా ఇచ్చారు. బీజేపీ నేతలు ఢిల్లీకి బస్సులు వేసుకుని వెళ్తే, తాము వారి ఇళ్ల ముందుకే ట్రాక్టర్లతో వడ్లు తెచ్చి పోస్తామని ఆయన హెచ్చరించారు.
అంతర్రాష్ట్ర జల వివాదాలపై ప్రధాని మోదీ మాటలు చెబుతున్నా, తుమ్మిడిహట్టి కోసం మహారాష్ట్ర సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని ఆక్షేపించారు. గ్లోబరీనా సంస్థ కేటీఆర్ బినామీదేనని ఆరోపించిన సీఎం, హరీష్ రావు ఇదులకుంట చెరువు అక్రమాలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ ప్రాంతీయ, కుల వివాదాలు చేయడం బుద్ధిలేనితనమని, తన దృష్టి అంతా అభివృద్ధి పైనే ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ఊరట.. స్వదేశానికి వెళ్లాల్సిందేననే నిబంధనపై అమెరికా యూటర్న్..
వైభవ్ శరీరమే లక్ష్యంగా బౌలింగ్.. గుజరాత్ బౌలర్లపై ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం..