మెట్రో ప్రాజెక్ట్‌ను అడ్డుకుంటోంది కిషన్ రెడ్డే: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Jun 15 , 2026 | 02:02 PM
హైదరాబాద్‌ను విశ్వనగరం అని చెప్పుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు.
హైదారాబాద్, జూన్ 15: హైదరాబాద్‌ను విశ్వనగరం అని చెప్పుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ ప్రమాణాలతో రవాణా సౌకర్యం ఉండాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే మెట్రో పనులు ప్రారంభమయ్యాయని.. రూ.15వేల కోట్లతో పనులను ప్రారంభించినట్లు చెప్పారు. కేసీఆర్ వచ్చాక మెట్రో నిర్మాణంలో నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. 2014 - 17 మధ్య మెట్రో పనులు పూర్తిగా ఆగిపోయాయని, కేసీఆర్ సాకులు చెప్పి మెట్రో పనులను మూడేళ్లు ఆలస్యం చేశారని మండిపడ్డారు. రూ.7వేల కోట్ల అంచనాలు పెరిగేలా చేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మెట్రో విస్తరణపై దృష్టి పెట్టామని వెల్లడించారు.
ప్రజల అవసరాలకు తగ్గట్టు మెట్రో నిర్మాణం జరగలేదని సీఎం అన్నారు. మెట్రో సెకండ్ ఫేజ్ కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని.. 122కి.మీ. మెట్రో విస్తరణకు L&T తిరస్కరించిందన్నారు. ఒకప్పుడు ఢిల్లీ, హైదరాబాద్ మెట్రోలు అగ్రస్థానంలో ఉండేవన్నారు. సొంత ఆస్తులు పెంచుకోవాలనే గత పాలకులు ఆలోచించారని.. కేసీఆర్ తీరు వల్లే మెట్రో విస్తరణ ఆలస్యమైందని ఆరోపించారు. తొలిదశ మెట్రోతోనే నష్టాలు వస్తున్నాయని L&T చెప్పిందన్నారు. ఏటా రూ.400కోట్లకు పైగా నష్టం వస్తోందని L&T చెప్పినట్లు తెలిపారు. మెట్రో రెండో దశలో భాగస్వామ్యానికి L&T నిరాకరించిందని.. L&T నుంచి మెట్రో కొంటేనే సమస్య తీరుతుందని కేంద్రం చెప్పిందన్నారు. రూ.30వేల కోట్ల మెట్రోను రూ.15వేల కోట్లకు కొనుగోలు చేశామన్నారు. ప్రస్తుతం మెట్రో నిర్మాణానికి కి.మీ.కు రూ.350కోట్లు ఖర్చవుతుందని సీఎం పేర్కొన్నారు.
IRFC రుణం బదిలీ ప్రక్రియకు అంతా సిద్ధం చేసినట్లు సీఎం తెలిపారు. రూ.84కోట్ల డాక్యుమెంట్ ఫీజు కూడా చెల్లించామన్నారు. ఈక్విటీ కింద రూ.1,400 కోట్లు జమచేశామన్నారు. రూ.13,400 కోట్లకు 4శాతం వడ్డీకి 20ఏళ్లకు ఒప్పించామని వివరించారు. మే 21న కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కిషన్‌రెడ్డి కలిసి అడ్డుపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ ఉండాలా? వద్దా? అని ఒత్తిడి చేశారని.. కిషన్‌రెడ్డి వల్లే రుణం బదిలీ ఆగిపోయిందంటూ మండిపడ్డారు. మెట్రో ప్రాజెక్ట్‌ను కిషన్‌రెడ్డే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కిషన్‌రెడ్డి నిధులు విడుదల చేయిస్తారా? లేదా? అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి...
ప్రభుత్వ ఆస్పత్రులు, స్కూళ్లు వద్దనే భావనను తొలగించేలా కసరత్తు: మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణ వచ్చినా సింగరేణిలో పరిస్థితి మారలేదు: కవిత
Read Latest Telangana News And Telugu News