విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు: హోం మంత్రి అనిత
ABN , Publish Date - Jun 15 , 2026 | 01:43 PM
ఎన్డీఏ ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నామని హోం మంత్రి అనిత అన్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు వెనుకబడిన జిల్లాలు కాదని.. వెనక ఉండి నడిపించే జిల్లాలని తెలిపారు.
విజయనగరం, జూన్ 15: జిల్లాలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో ‘రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం’ జిల్లా స్థాయి విజయోత్సవ సభ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, హోం మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 'డ్రగ్స్ రహిత రాష్ట్రం' థీమ్‌తో జిల్లాలో విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. ఎన్డీఏ ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నామని అన్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా భావిస్తున్నట్లు తెలిపారు.
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు వెనుకబడిన జిల్లాలు కాదని.. వెనక ఉండి నడిపించే జిల్లాలని హోం మంత్రి వెల్లడించారు. అతి త్వరలోనే భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని తెలిపారు. ఉత్తరాంధ్రలో గూగుల్ డేటా సెంటర్, స్టీల్ ప్లాంట్ లాంటి ఎన్నో పరిశ్రమలు వచ్చాయన్నారు. నిరుద్యోగ యువతకు వేలాది సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు రానున్నాయని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. దేశంలోనే పింఛనులు అత్యధికంగా ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు.
ఒంటరి మహిళకు, దివ్యాంగులకు, అవ్వ, తాతలకు ఎన్డీఏ ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని అనిత అన్నారు. అన్నదాత సుఖీభవతో రైతులకు అండగా నిలుస్తున్నామన్నారు. కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే, అంత మంది పిల్లలకు కూడా తల్లికి వందనం ఇచ్చామన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. లోకేశ్ పాదయాత్ర చేసే సమయంలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ చాలా ఎక్కువగా కనిపించేవన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో గంజాయిపై ఉక్కు పాదం మోపినట్లు తెలిపారు. ఈగల్ అనే ఒక వ్యవస్థను తీసుకువచ్చామని చెప్పారు.
గంజాయి రవాణా చేసిన, సాగు చేసిన, గంజాయి సేవించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని హోం మంత్రి స్పష్టం చేశారు. వారి ఆస్తులను కూడా జప్తు చేస్తున్నామని తెలిపారు. చదువుకున్న వయసులో చిన్న చిన్న తప్పిదాల వలన వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. విద్యార్థులు ఉజ్వలమైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉద్యోగాలు మీ ఇంటికే వస్తున్నాయని తెలిపారు. విద్యార్థులకు బంగారు భవిష్యత్తు కోసం మంత్రి నారా లోకేశ్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. తల్లిదండ్రులు త్యాగాలు చేసి మరీ పిల్లలను చదివిస్తున్నారని హోం మంత్రి అనిత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
తెలంగాణ విభజనకు ఏనాడూ జనసేన అడ్డు చెప్పలేదు: పవన్ కల్యాణ్
యూఎన్ హాబిటాట్‌తో ఏపీ భాగస్వామ్యం.. సీఎం చంద్రబాబు కీలక భేటీ
Read Latest AP News And Telugu News