రంజాన్ పండగ వేళ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రార్థనలు..
ABN , Publish Date - Mar 21 , 2026 | 08:56 AM
హైదరాబాద్ నగరం రంజాన్ వేడుకలకు సిద్ధమైంది. ఈద్గా, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు ముస్లిం సోదరులు. చరిత్రాత్మక మక్కా మసీదులో రంజాన్ వేడుకలు ఇవాళ(శనివారం) ఉదయం 10గంటలకు ప్రారంభంకానున్నాయి.
హైదరాబాద్: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అల్లాహ్‌ను స్మరించుకుంటూ ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ రంజాన్ శోభ కనిపిస్తోంది. పవిత్ర దినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్, విజయవాడ, వరంగల్, విశాఖ సహా గ్రామగ్రామాన ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి.
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో వందలాది ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు చేశారు. అలాగే పాతబస్తీ, యనమలకుదురు ప్రాంతాల్లోనూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రార్థనల్లో ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీ, టీడీపీ నేత నాగుల్ మీరా, బీజేపీ నేత సయ్యద్ బాషా, వైసీపీ నేత దేవినేని అవినాశ్ పాల్గొన్నారు.
ఇక, హైదరాబాద్ నగరం సైతం రంజాన్ వేడుకలకు సిద్ధమైంది. ఈద్గా, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు ముస్లిం సోదరులు. చరిత్రాత్మక మక్కా మసీదులో రంజాన్ వేడుకలు ఇవాళ(శనివారం) ఉదయం 10గంటలకు ప్రారంభంకానున్నాయి. మక్కా మసీదులో భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు ఈద్-ఉల్-ఫితర్ ప్రార్థనలు చేయనున్నారు. పాతబస్తీలో రద్దీని దృష్టిలో ఉంచుకుని మక్కా మసీదు పరిసరాల్లో వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. మక్కా మసీదులో ప్రత్యేక ఈద్ ప్రార్థనలు, భారీ ఇఫ్తార్ విందుల కోసం పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
అలాగే మీరాలం ట్యాంక్ వద్ద ఉన్న ఈద్గాకు పెద్ద సంఖ్యలో ముస్లింలు చేరుకుంటున్నారు. మరికొద్దిసేపట్లో సామూహిక ప్రార్థనలు ప్రారంభం కానున్నాయి. మీరాలం ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. లా అండ్ ఆర్డర్, క్విక్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌లతో భద్రతను ఏర్పాటు చేశారు. రద్దీ నేపథ్యంలో మీరాలం పరిసర ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఈనెల 19న నెలవంక కనిపించకపోవడంతో భారతదేశంలో రంజాన్ పండుగ నేడు జరుపుకుంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
నేడు 13ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు