పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం.. పోలీసుల విచారణ
ABN , Publish Date - Aug 11 , 2026 | 09:39 AM
హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటికలో పసికందు మృతదేహం మాయం కలకలం రేపుతోంది. శ్మశానవాటికలో పూడ్చిపెట్టిన ఆరు నెలల పసికందు మృతదేహం అదృశ్యమైంది.
హైదరాబాద్, ఆగస్టు 11: నగరంలోని పంజాగుట్ట శ్మశానవాటికలో పసికందు మృతదేహం మాయం కలకలం రేపుతోంది. శ్మశానవాటికలో పూడ్చిపెట్టిన ఆరు నెలల పసికందు మృతదేహం అదృశ్యమైంది. చార్మినార్ ఘాన్సీబజార్‌కు చెందిన దంపతులకు ఆరు నెలల క్రితం కవలలు పుట్టారు. అనారోగ్యంతో బాధపడుతున్న కవలలకు బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ గత శనివారం ఓ పసికందు మృతి చెందింది. దీంతో కుటుంబసభ్యులు.. పంజాగుట్ట హిందూ శ్మశానవాటికలో మృతదేహాన్ని ఖననం చేశారు. మరో చిన్నారి కూడా ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ మృతిచెందింది.
నిన్న(సోమవారం) రెండో పసికందు అంత్యక్రియల కోసం కుటుంబసభ్యులు శ్మశానవాటికకు వచ్చారు. ఈ క్రమంలో మొదటి చిన్నారిని పూడ్చిన ప్రాంతంలో గుంత తీసి ఉండటాన్ని గుర్తించారు. గోతిలో మృతదేహం కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. రెండో పసికందు అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం.. ఈ వ్యవహారంపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్మశానవాటిక కాటికాపరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని బంజారాహిల్స్ పోలీసులు గోప్యంగా ఉంచడం చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి...
కస్టమర్‌కు ఊహించని షాక్.. సమోసాలో బొద్దింక..
Read Latest Telangana News And Telugu News