Share News

ఓట్ల తొలగింపు సూత్రధారులు మోదీ, షా

ABN , Publish Date - Oct 04 , 2026 | 05:02 AM

దేశంలో ఎస్‌ఐఆర్‌ పేరిట ఓట్ల తొలగించడానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలే సూత్రధారులని సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ ఆరోపించారు.

ఓట్ల తొలగింపు సూత్రధారులు మోదీ, షా
Prakash Raj

  • గణేశ్‌ విసర్జనం అయింది..

  • మిగిలింది జ్ఞానేశ్‌ విసర్జనే

  • ప్రజా సంఘాల నిరసనలో ప్రకాశ్‌ రాజ్‌

హైదరాబాద్‌ సిటీ/కవాడిగూడ, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఎస్‌ఐఆర్‌ పేరిట ఓట్ల తొలగించడానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలే సూత్రధారులని సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ ఆరోపించారు. ఎస్‌ఐఆర్‌ తప్పులను కప్పిపుచ్చునే క్రమంలో సాక్ష్యాలను మాయం చేస్తూ రంగా బిల్లా దొరికిపోయారని మోదీ, అమిత్‌షాను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. గణేశుడి విసర్జనం అయిపోయిందని, ఇక సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ విసర్జన్‌ కావాల్సి ఉందని వ్యాఖ్యానించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా దరఖాస్తులు నింపమనడం, అనవసరమైన పత్రాలు చూపించమనడం వంటి చర్యలతో దేశ ప్రజలను పరీక్షలకు కూర్చోబెట్టిన ఘనత ఈసీకే దక్కిందన్నారు. ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలని, సీఈసీ జ్ఞానేశ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం ధర్నా చౌక్‌లో చేపట్టిన నిరసనలో ఆయన పాల్గొన్నారు.


అనంతరం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘‘నేను ఒక బృందంతో కలిసి కర్ణాటకలోని 23 జిల్లాల్లో పది రోజులపాటు పర్యటిస్తూ వంద బూత్‌లను క్షేత్రస్థాయిలో పరిశీలించాం. ఇల్లు మారారని, ఇంట్లో లేరని.. ఇలా రకరకాల కారణాలతో పేదల ఓట్లు తొలగించారు. చనిపోయారంటూ బతికున్నవాళ్ల ఓట్లు తొలగించారు’’ అని ధ్వజమెత్తారు. తెలంగాణలోనూ తొలగించిన ఓట్లపై బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ సోషల్‌ ఆడిట్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ కార్యాలయాల నుంచి అందిన దొంగ ఫిర్యాదులతో పెద్ద సంఖ్యలో ముస్లింలు, క్రిస్టియన్ల ఓట్లు తొలగించడమే ఎస్‌ఐఆర్‌ లక్ష్యమని ఆరోపించారు.


ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ మనుధర్మ శాస్ర్తాన్ని మాత్రమే బీజేపీ నమ్ముతుందని దుయ్యబట్టారు. ఈ సమయంలో జెన్‌జీ ఉద్యమం రావడం శుభ పరిణామమన్నారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆకునూరి మురళి మాట్లాడుతూ ఓటును ప్రజలకు దూరం చేసేలా బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ మాట్లాడుతూ మూడు సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసిన తనకే ఎస్‌ఐఆర్‌లో నోటీసులు వచ్చాయని వాపోయారు. న్యాయమూర్తిగా పనిచేసిన తన ఓటు కూడా తొలగించారని, తానేమైనా రోహింగ్యానా అని జస్టిస్‌ చంద్రకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...
22ఏ నుంచి తొలగింపు.. నాలా కింద ప్లాట్లు, ఇళ్ల రిజిస్ట్రేషన్లకు ఊరట
కొత్త ఆస్పత్రుల పనులు వేగవంతం చేయాలి.. నిర్మాణం పూర్తయ్యేలోపు సిబ్బంది నియామకాలు పూర్తి చేయాలి
పిల్లల ఆన్‌లైన్‌ భద్రతకు ప్రత్యేక సేఫ్టీ ఫ్రేమ్‌వర్క్‌.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 04 , 2026 | 06:53 AM