Share News

22ఏ నుంచి తొలగింపు.. నాలా కింద ప్లాట్లు, ఇళ్ల రిజిస్ట్రేషన్లకు ఊరట

ABN , Publish Date - Oct 04 , 2026 | 04:54 AM

22ఏ వివాదాల పరిష్కారంలో భాగంగా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ భూములకు నాలా ఫీజు చెల్లించి వ్యవసాయేతర భూమిగా మార్చకుండానే ..

22ఏ నుంచి తొలగింపు.. నాలా కింద ప్లాట్లు, ఇళ్ల రిజిస్ట్రేషన్లకు ఊరట
Ponguleti Srinivas Reddy

  • నాలా కట్టించుకొని వాటి రిజిస్ట్రేషన్లుచేయండి

  • కలెక్టర్లకు రెవెన్యూ శాఖ మెమో జారీ

  • గడువు పెట్టుకుని ముగించాలన్న మంత్రి

  • నాలా ఫీజుకు 50 శాతం అదనంగా ఫైన్‌?

  • చట్టంలోని ఫీజు చెల్లించాలన్న సీసీఎల్‌ఏ

హైదరాబాద్‌, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): 22ఏ వివాదాల పరిష్కారంలో భాగంగా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ భూములకు నాలా ఫీజు చెల్లించి వ్యవసాయేతర భూమిగా మార్చకుండానే లేఅవుట్లు వేసి, ఇళ్ల నిర్మాణం చేపడితే వాటిని ఇటీవల 22ఏలో పెట్టారు. అంటే నిషేధిత జాబితాలో పెట్టారు. ఇప్పుడు వాటికి ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. వాటికి నాలా నిబంధనల ప్రకారం చార్జీలు చెల్లిస్తే రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. 22ఏ అడ్డం రాదు. ఈ మేరకు రెవెన్యూ శాఖ శనివారం మెమో 48062/యూఎల్‌సీ/ఏ1/2026-2 జారీ చేసింది. ఈ ఆదేశాలను జిల్లా కలెక్టర్లు వెంటనే అమలు చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.


సచివాలయంలో శనివారం రెవెన్యూ, రిజిస్ర్టేషన్‌ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. నాలా ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్ల రెవెన్యూ రికార్డుల్లో వ్యవసాయ భూమిగానే ఉండి, 22ఏ జాబితాలో ఉన్న నివాస పట్టా భూముల విషయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. రెవెన్యూ రికార్డులు, భూహక్కు పత్రాలు, క్షేత్ర స్థాయి పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి నిబంధనల ప్రకారం నాలా చార్జీలు, ఇతర ప్రభుత్వ రుసుములు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకొనేందుకు అనుమతించాలని మంత్రి కలెక్టర్లను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా పారదర్శకంగా కాల పరిమితితో పూర్తి చేయాలని చెప్పారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, మున్సిపల్‌ అనుమతులు ఉన్న ఇళ్లు, ప్లాట్లు 22ఏ పరిధిలో ఉన్నా రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశించామని గుర్తు చేశారు. 22ఏ మీద అధికారులు నిరంతరం సమీక్ష చేస్తూ కొత్త సమస్యలేవైనా వస్తే వెంటనే తన దృష్టికి తేవాలని చెప్పారు.


ఇతర చార్జీలు ఏమిటి?

తాజా మెమోలో నాలా చార్జీలతో పాటు ఇతర చార్జీలు అని పేర్కొన్నారు. దీనిపై సీసీఎల్‌ఏ లోకేష్‌ కుమార్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. నాలా చట్టం ప్రకారం నిర్ధేశించిన ఫీజులన్నీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న తెలంగాణ అగ్రికల్చరల్‌ ల్యాండ్‌ చట్టం-2006(కన్వర్షన్‌ ఫర్‌ నాన్‌- అగ్రికల్చరల్‌ పర్పస్‌) ప్రకారం నాలా కన్వర్షన్‌ ఫీజు, కన్వర్షన్‌ లేకుండా ఇప్పటికే నాన్‌ అగ్రికల్చర్‌గా మార్చివేస్తే ఫీజుతో పాటు అపరాధ రుసుం(పెనాల్టీ) చెల్లించాల్సి ఉంటుంది. చట్టంలోని సెక్షన్‌ 3 ప్రకారం వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాల కోసం ఉపయోగిస్తే రెవెన్యూ శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. దరఖాస్తుతో పాటు సెక్షన్‌ 4 ప్రకారం కన్వర్షన్‌ చార్జీ చెల్లించాలి. ఈ ఫీజు జీహెచ్‌ఎంసీ పరిధిలో అయితే భూమి మార్కెట్‌ విలువలో 2 శాతం, జీహెచ్‌ఎంసీ బయట అయితే మార్కెట్‌ విలువలో 3 శాతం చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 2016కు ముందు ఈ చార్జీలు జీహెచ్‌ఎంసీలో 5 శాతం, బయట 9 శాతం వరకు ఉండేవి. అయితే ప్రభుత్వం 2016లో జీవో 4 ద్వారా చార్జీలు తగ్గించింది.


అనుమతి లేకుండా వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తే?

నాలా చట్టం ప్రకారం అనుమతి లేకుండా వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తే సెక్షన్‌ 6(2) ప్రకారం కన్వర్షన్‌ ఫీజుకు అదనంగా 50 శాతం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు భూమి మార్కెట్‌ విలువ రూ.కోటి ఉంటే.. జీహెచ్‌ఎంసీ పరిధిలో నాలా కన్వర్షన్‌ చార్జీ 2 శాతం చొప్పున రూ.2 లక్షలు, 50 శాతం పెనాల్టీ ప్రకారం మరో రూ.లక్ష కలిపి రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. జీహెచ్‌ఎంసీ బయట అయితే నాలా చార్జీ రూ.3 లక్షలు, 50 శాతం పెనాల్టీ కింద రూ.1.50 లక్షలు కలిపి రూ.4.50 లక్షలు చెల్లించాలని చట్టం చెబుతోంది. తాజా మెమోలో నాలా చార్జీలతో పాటు ఇతర చార్జీలు చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్‌ చేయాలని చెప్పారు. అంటే, 22ఏ నుంచి బయట పడాలంటే 50 శాతం పెనాల్టీ చెల్లించాల్సిందే. ఉదాహరణకు నాలా ఫీజు రూ.10 లక్షలు ఉంటే, పెనాల్టీ కింద మరో రూ.5 లక్షలు కలిపి రూ.15 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని కేసుల్లో పెనాల్టీ కట్టించుకోకుండానే నాలా కన్వర్షన్‌ చేశారని ఇప్పటికే కాగ్‌ రెవెన్యూ ఆడిట్‌లో హెచ్చరించినందున పెనాల్టీ తప్పదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...
వృద్ధులకూ ఉచిత బస్సు ప్రయాణం? సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న రేవంత్‌ ప్రభుత్వం

కొత్త ఆస్పత్రుల పనులు వేగవంతం చేయాలి.. నిర్మాణం పూర్తయ్యేలోపు సిబ్బంది నియామకాలు పూర్తి చేయాలి
పిల్లల ఆన్‌లైన్‌ భద్రతకు ప్రత్యేక సేఫ్టీ ఫ్రేమ్‌వర్క్‌.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 04 , 2026 | 04:54 AM