Share News

పిల్లల ఆన్‌లైన్‌ భద్రతకు ప్రత్యేక సేఫ్టీ ఫ్రేమ్‌వర్క్‌.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

ABN , Publish Date - Oct 04 , 2026 | 04:34 AM

న్యాయం అంటే కేవలం నేరస్థుడికి శిక్ష పడటం కాదని, న్యాయం అంటే బాధితుడి జీవితాన్ని తిరిగి నిలబెట్టడం, గౌరవాన్ని తిరిగి ఇవ్వడమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

పిల్లల ఆన్‌లైన్‌ భద్రతకు ప్రత్యేక సేఫ్టీ ఫ్రేమ్‌వర్క్‌.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
Revanth Reddy

  • హైకోర్టు సాయం తీసుకోవాలని సూచన

  • ఆన్‌లైన్‌ గ్రూమింగ్‌ సమస్యపై చిన్నారులకు అవగాహన కల్పించాలి

  • కేంద్ర న్యాయమంత్రి మేఘ్వాల్‌ పిలుపు

  • భవిష్యత్తు ఆస్తులు పిల్లలే: జస్టిస్‌ నరసింహ

  • ఆస్పత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

  • వైద్య సిబ్బంది కొరత లేకుండా చూడాలి

  • ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం

హైదరాబాద్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): న్యాయం అంటే కేవలం నేరస్థుడికి శిక్ష పడటం కాదని, న్యాయం అంటే బాధితుడి జీవితాన్ని తిరిగి నిలబెట్టడం, గౌరవాన్ని తిరిగి ఇవ్వడమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఒక నేరం వల్ల బాధితుడు కోల్పోయిన బాల్యాన్ని తిరిగి అందించడమే నిజమైన చైల్డ్‌ ఫ్రెండ్లీ జస్టిస్‌ అని చెప్పారు. నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ(నాల్సా), తెలంగాణ రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ (టీజీఎ్‌స-ఎల్‌ఎ్‌సఏ) ఆధ్వర్యంలో శనివారం ‘పిల్లల సైబర్‌ భద్రత’ అనే అంశంపై నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల న్యాయమూర్తుల సదస్సులో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్‌, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌(నాల్సా ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌), జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనర్సింహ, జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ మహాదేవన్‌, తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌సింగ్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ హైకోర్టు, టీజీఎ్‌స-ఎల్‌ఎ్‌సఏతో సంప్రదింపులు జరిపి పిల్లల ఆన్‌లైన్‌ భద్రత కోసం సమగ్ర చైల్డ్‌ ఆన్‌లైన్‌ సేఫ్టీ ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేయాలని ఈ వేదిక నుంచే అధికారులను ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. న్యాయ సేవా సంస్థలు చేస్తున్న మంచి కార్యక్రమాలు రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు, ప్రతి గ్రామానికి చేరేలా తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. ప్రతి పిల్లవాడు, ప్రతి తల్లిదండ్రులు సైబర్‌ నేరాల కోసం ఉద్దేశించిన 1930, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ కోసం ఉద్దేశించిన 1098 నంబర్లు తప్పక గుర్తుంచుకోవాలని సూచించారు. డబ్బు లేకపోవడం వల్ల ఎవరికీ న్యాయం దూరం కాకూడదని చెప్పారు.


‘‘ఇంటర్నెట్లో తెలియక పిల్లలు చేసే చిన్న పొరపాట్లు కూడా పెద్ద సమస్యలకు దారి తీయవచ్చు. వాటి ప్రభావం కుటుంబాలపై, మొత్తం సమాజంపై కూడా పడుతుంది. భయంతో పిల్లలు తమ సమస్యలను ఎవరికీ చెప్పలేక పోవచ్చు. పిల్లలపై సైబర్‌ నేరాలను ఎలా అరికట్టాలి? మన పిల్లలను ఎలా సురక్షితంగా ఉంచాలి? బాధిత పిల్లలకు న్యాయం ఎలా అందించాలి? అనేవి మన ముందున్న సవాళ్లు’’ అన్నారు. తెలంగాణలో మహిళలు, పిల్లల రక్షణ తమ ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యతగా ఉందని చెప్పారు.


పోలీసు భరోసా కేంద్రాలు, చైల్డ్‌ ప్రొటెక్షన్‌ యూనిట్లు, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీలు, ప్రత్యేక కోర్టులు, న్యాయ సేవా సంస్థలు సమన్వయంతో కలిసి పని చేసినపుడే ఒక బిడ్డకు పూర్తి రక్షణ కల్పించగలుగుతామని అన్నారు. భరోసా కేంద్రాల్లో మహిళలు, పిల్లలకు ఒకే చోట పోలీసు సహాయం, వైద్య సేవలు, న్యాయ సహాయం, కౌన్సెలింగ్‌ అందిస్తున్నామని తెలిపారు. దేశంలోనే తొలి చైల్డ్‌ ఫ్రెండ్లీ కోర్టు హైదరాబాద్‌లో ఏర్పాటు చేశామన్నారు. పిల్లల రక్షణ కోసం షీ-భరోసా సైబర్‌ ల్యాబ్‌లు పని చేస్తున్నాయని చెప్పారు. విద్యార్థులు, టీచర్లకు ఆన్‌లైన్‌ భద్రతపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలతో తరచుగా మాట్లాడాలని, ఇంటర్నెట్‌లో ఏం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఏం చూస్తున్నారు? తెలుసుకోవాలని, తప్పుపట్టేలా కాకుండా ఆసక్తితో మాట్లాడాలని సూచించారు.


న్యాయం అర్థమయ్యే భాషలో ఉండాలి: అర్జున్‌రాం మేఘ్వాల్‌

న్యాయం లభించడం మాత్రమే కాదు, అది సులభతరంగా అర్థమయ్యే రీతిలో ఉండాలని కేంద్ర న్యాయ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్‌ అన్నారు. న్యాయ వ్యవస్థ సమర్థంగా ఉండటమే కాదు, సున్నితంగా కూడా ఉండాలని సూచించారు. ప్రతి చిన్నారికి చట్టపరమెన రక్షణ, సహాయంపై నమ్మకం, ఎదిగేందుకు అవకాశం దక్కాలని చెప్పారు. ఆన్‌లైన్‌ గ్రూమింగ్‌ సమస్యపై అవగాహన కల్పించాలన్నారు. చిన్నారులపై నేరాల్లో తీర్పు తర్వాత కూడా కౌన్సెలింగ్‌, వైద్య సేవలు, చదువు కొనసాగింపు, బాధితులకు పరిహారం, సురక్షితమైన పునరావాసం కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది’ అని పేర్కొన్నారు.


భవిష్యత్తు ఆస్తులు పిల్లలే: జస్టిస్‌ పీఎస్‌ నర్సింహ

దేశంలో సంతానోత్పత్తి రేటు భారీగా పడిపోతుండటంపై జస్టిస్‌ పీఎస్‌ నర్సింహ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘దేశంలో జనాభా రీప్లే్‌సమెంట్‌ రేట్‌ 2.1 నుంచి 1.97కు పడిపోయింది. రెండు తరాల తర్వాత జపాన్‌ లాంటి పరిస్థితి వస్తుంది. అందుకే పిల్లలే భవిష్యత్తు ఆస్తులు అంటున్నా. హైదరాబాద్‌ వీధుల్లో నేను పతంగులు ఎగరేశా. నేను పిల్లాడిగా ఉన్నప్పుడు అంత సురక్షితమైన వాతావరణం లేదు. అలా అని నిర్లక్ష్యానికి గురి కాలేదు. ప్రస్తుత పరిస్థితులు వేరేగా ఉన్నాయి’’ అన్నారు.


చైల్డ్‌ ఫ్రెండ్లీ జస్టిస్‌ ఉండాలి: జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌

సామాజిక మాధ్యమాలు పిల్లల గోప్యతను రక్షించేందుకు రక్షణ చర్యలు తీసుకోవాలని నాల్సా ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ పేర్కొన్నారు. పిల్లలు ప్రమాదం గురించి చెప్తుంటే సహనంతో వినాలన్నారు. బాధిత చిన్నారుల గోప్యత కాపాడటంతో పాటు వారికి అర్థమయ్యే భాషలో ప్రొసీజర్‌ను వివరించాలన్నారు.


మొబైల్‌ లోక్‌అదాలత్‌లు

సంచార లోక్‌ అదాలత్‌, ఉచిత న్యాయసేవల వాహనాలను సీఎం, కేంద్ర మంత్రి, న్యాయమూర్తులు కలిసి ప్రారంభించారు. తెలంగాణ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆధ్వర్యంలో వీటిని రూపొందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ తెలంగాణ రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆధ్వర్యంలో రూపొందించిన ‘వెట్టిచాకిరీ నుంచి విముక్తి’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. పిల్లల భద్రత, న్యాయానికి కట్టుబడి ఉంటామని కమిట్‌మెంట్‌ వాల్‌పై సీఎం, కేంద్ర మంత్రి, న్యాయమూర్తులు సంతకాలు చేశారు.


ఇవి కూడా చదవండి...
వృద్ధులకూ ఉచిత బస్సు ప్రయాణం? సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న రేవంత్‌ ప్రభుత్వం

అనంతగిరి ఘాట్‌రోడ్డులో ఘోర ప్రమాదం.. ప్రైవేటు బస్సు బోల్తా, నలుగురు మహిళల మృతి

రామ జన్మభూమి ఉద్యమం నుంచి సామాజిక సమరసత వరకు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 04 , 2026 | 04:34 AM