రాహుల్‌పై విమర్శలకే బీజేపీ పరిమితం: పొన్నం
ABN , Publish Date - Nov 25 , 2026 | 05:07 AM
ఓటర్ల తొలగింపు, ఎన్నికల డేటా మార్పులు, ఈసీ స్వతంత్రతపై రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు బీజేపీ సమాధానం చెప్పకుండా ప్రజల దృష్టిని మళ్లిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
కౌశిక్.. ఒక్క కొత్త పెన్షనూ ఇవ్వలేదంటవా?
నువ్వే మంజూరు పత్రాలిచ్చావు కదా: కొనగాల మహేశ్
హైదరాబాద్, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ‘‘ఓటర్ల తొలగింపు, ఎన్నికల డేటాలో మార్పులు, ఎన్నికల కమిషన్ స్వతంత్రతపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధారాలతో సహా లేవనెత్తుతున్న ప్రశ్నలకు బీజేపీ ఎందుకు సమాధానం చెప్పటంలేదు. పైగా ప్రజల దృష్టిని మళ్లించేందుకు చొరబాటుదారుల అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. కరీంనగర్‌లో జరిగిన బీజేపీ సభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్.. స్థానిక సమస్యలు, తెలంగాణ అభివృద్ధి, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడకుండా రాహుల్ గాంధీపై విమర్శలు చేయడానికే పరిమితమయ్యారు. సభలో శబ్ద కాలుష్యం తప్ప విషయం లేదు’’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
ఎస్‌ఐఆర్ పేరుతో పేదలు, మైనారిటీలు, బలహీనవర్గాల ఓటు హక్కులను హరించే కుట్ర జరుగుతోందని మంగళవారం ఒక ప్రకటనలో ఆయన ఆరోపించారు. ‘‘హూజూరాబాద్ నియోజకవర్గంలో ఒక్కటైనా కొత్త పెన్షన్ ఇచ్చినట్లు రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్ విసురుతుండు. కానీ.. ఆ నియోజకవర్గానికి కొత్తగా 5562 పెన్షన్లు మంజూరయ్యాయి. ఆయన సొంత గ్రామం వీణవంకలోనూ కొత్తగా 28 పెనన్లు మంజూరయ్యాయి. వాటికి మంజూరు పత్రాలు ఇచ్చిందీ కౌషిక్‌రెడ్డే. ఆయన రాజీనామా చేస్తాడా.. లేక హుజూరాబాద్‌లో ముక్కు నేలకు రాసి సీఎం రేవంత్‌రెడ్డికి క్షమాపణలు చెబుతాడా?’’ అంటూ టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి కొనగాల మహేశ్ నిలదీశారు. లబ్ధిదారులకు కొత్త పెన్షన్ల మంజూరు పత్రాలను కౌషిక్‌రెడ్డి స్వయంగా ఇస్తున్న ఆధారాలను మంగళవారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో ఆయన విడుదల చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కరీంనగర్ వైద్య కాలేజీ నిర్మాణంలో జాప్యమేంటి?
Read Latest AP News And Telangana News And International News And Telugu News