కిందస్థాయి సిబ్బందితో ఫ్రెండ్లీగా ఉండండి.. ఆర్టీసీ అధికారులతో పొన్నం ప్రభాకర్
ABN , Publish Date - May 02 , 2026 | 03:02 PM
ఆర్టీసీ అధికారులు.. కిందిస్థాయి సిబ్బంది, ప్రయాణికుల విషయంలో సానుకూలంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిబ్బందిని వేధింపులకు గురిచేయకుండా ప్రేమతో, సానుకూల దృక్పథంతో పనులు చేయించాలని డివిజన్ స్థాయి అధికారులకు సూచించారు.
హైదరాబాద్, మే 2: ఆర్టీసీ ఉన్నతాధికారులతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జూమ్ సమావేశం నిర్వహించారు. నిన్న(శుక్రవారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలకు జరిగిన సమావేశంలో కార్మిక సంఘాలు లేవనెత్తిన అంశాలపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కిందిస్థాయి సిబ్బంది, ప్రయాణికుల విషయంలో ఆర్టీసీ అధికారులు సానుకూలంగా ఉండాలని సూచించారు.సిబ్బందిని వేధింపులకు గురిచేయకుండా ప్రేమతో, సానుకూల దృక్పథంతో పనులు చేయించాలని డివిజన్ స్థాయి అధికారులకు సూచించారు.
ఆర్టీసీ అధికారులు కింది స్థాయి డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది పట్ల దురుసుగా కాకుండా ఫ్రెండ్లీగా స్నేహపూర్వకంగా పనులు చేయించుకోవాలని మంత్రి అన్నారు. డిపో మేనేజర్లు, ఆర్టీసీ సిబ్బంది.. ప్రయాణికులతో సత్సంబంధాలు కలిగి ఉండాలన్నారు. మే 17 లోగా డిపోలు, బస్ స్టేషన్లలో కార్మికులకు మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని ఆదేశించారు. టాయిలెట్స్, మంచి నీటి సౌకర్యం, ప్లాంటేషన్, పరిశుభ్రత పాటించాలన్నారు. 2023 డిసెంబర్ 9 నుంచి ఆర్టీసీలో మహాలక్ష్మి పథకాన్ని అమలులోకి తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, నారాయణఖేడ్, బాన్సువాడ, ఇల్లందు లాంటి కొన్ని డిపోలు నష్టాల్లో ఎందుకు నడుస్తున్నాయో ఆర్ఎంలు, డిపో మేనేజర్‌లు సమీక్షించుకోవాలన్నారు. టికెట్‌కు సంబంధించి ఏదైనా ఇబ్బందులు జరిగితే చర్యలు తీసుకోవాలని.. సిబ్బంది గొడవలు పెట్టుకోవడం సరికాదన్నారు. సంస్థలో ఇంటర్నల్ ఎటాక్ అనేది ప్రమాదకరమైన విషయమని అన్నారు.
ప్రతి రెండో మంగళవారం ఆర్టీసీ సిబ్బంది సమస్యలు వినడానికి అన్ని డిపోల్లో గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలని.. డిపో మేనేజర్లు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉండాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీ డిపో మేనేజర్లు.. గ్రామ సర్పంచ్ నుంచి మొదలు ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంచి ప్రజా సంబంధాలు కొనసాగించాలని సూచించారు. ‘ఏదైనా సమస్య మీ స్థాయిలో పరిష్కారం కాకపోతే ఆర్టీసీ ఎండీ స్థాయిలో పరిష్కారం చేద్దాం. సిబ్బంది పట్ల సానుకూలంగా ఉండాలి. మంత్రి నుంచి సిబ్బంది వరకు అందరం కలిసి పని చేద్దాం. ఆర్టీసీ సమ్మెలో కార్మికులు డిమాండ్ చేసిన సమస్యలను పరిష్కారం చేస్తున్నామని.. భవిష్యత్తులో మంచి ఫలితాలను సాధించే దిశగా ముందుకు వెళ్దామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. జూమ్ సమావేశంలోఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఈడీలు, ఆర్‌ఎంలు, వివిధ విభాగాల హెచ్ఓడీలు, డీఎంలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్.. వందల్లో ఫేక్ ప్రొఫైల్స్ తొలగింపు
కొత్త రాజకీయ శక్తిగా వస్తామని చెప్పాం.. వచ్చాం: కవిత
Read Latest Telangana News And Telugu News