Share News

రక్త బంధం కన్నా ఎక్కువ భూ బంధం

ABN , Publish Date - Sep 20 , 2026 | 06:24 AM

రూపాయి.. రూపాయి కూడబెట్టుకుని ఒక సామాన్యుడు భూమిని కొనుగోలు చేస్తాడని, రక్త బంధం కన్నా ఎక్కువ భూ బంధం ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

రక్త బంధం కన్నా ఎక్కువ భూ బంధం
Ponguleti Srinivas Reddy

  • భూ సమస్యల పరిష్కారమే సర్కారు లక్ష్యం..

  • 118 జీవో బాధితులందరికీ సేల్‌డీడ్‌ పత్రాలు

  • సింగరేణిలో స్థలాల సమస్యపై త్రిసభ్య కమిటీలు

  • 45 రోజుల్లోగా సమస్యను పరిష్కరించేలా చర్యలు

  • 22-ఏ సమస్యకు వారంలోనే ముగింపు : పొంగులేటి

హైదరాబాద్‌/మన్సూరాబాద్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): రూపాయి.. రూపాయి కూడబెట్టుకుని ఒక సామాన్యుడు భూమిని కొనుగోలు చేస్తాడని, రక్త బంధం కన్నా ఎక్కువ భూ బంధం ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కష్టపడి సంపాదించిన స్థలం వివాదాల్లోకి వెళ్తే... ఆ యజమాని బాధ ఊహకు అందందని, రాష్ట్రంలో ఏ ఒక్కరూ అలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలన్నదే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన మేరకు భూ సమస్యలపై త్వరలో ప్రజలకు తీపి కబురు అందుతుందని తెలిపారు. 22ఏ సమస్యకు త్వరలోనే ముగింపు పలుకుతామని స్పష్టం చేశారు.


అసెంబ్లీలో సీఎం 12 అంశాలను ప్రస్తావించగా, వాటిలో రెండు అంశాలపై ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోని 64 కాలనీల్లో 118 జీవో బాధితులు ఉండగా, 36కాలనీల్లో ఉంటున్న వారికి సేల్‌ డీడ్‌ పత్రాలను శనివారం సాయంత్రం ఆయన అందజేశారు. సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో పొంగులేటి మాట్లాడారు. అంతకుముందు సింగరేణి పరిధిలో ఇళ్ల స్థలాల సమస్యపై ఆయన సమీక్ష నిర్వహించారు. మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్న సమయంలో ఎల్బీనగర్‌ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని రేవంత్‌రెడ్డి నిలబెట్టుకున్నారన్నారు. గత ప్రభుత్వ హయాం నుంచే ఎల్బీనగర్‌లోని భూములపై నిషేధిత ఉత్తర్వులు ఉన్నాయని, నెల రోజుల్లోగా మొత్తం సమస్యను పరిష్కరించి 118జీవో బాధితులందరికీ సేల్‌డీడ్‌లు అందజేస్తామన్నారు. మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఇదే జీవో కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికీ ఊరట కల్పిస్తామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు ఇళ్ల స్థలాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల సేవలు వెలకట్టలేనివని, దశాబ్దాలుగా ఇళ్ల స్థలాల హక్కు పత్రాల కోసం వారు నిరీక్షిస్తున్నారని తెలిపారు.


రాజశేఖరరెడ్డి హయాంలో జారీ చేసిన జీవో 76ను పరిగణనలోకి తీసుకుని భూముల స్వభావం, ప్రభుత్వ/సింగరేణి హక్కులు, ప్రస్తుత నివాస పరిస్థితులు, చట్టపరమైన ఇబ్బందులు పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. కోల్‌బెల్ట్‌లోని ఖమ్మం, కొత్తగూడెం, భూపాలపల్లి, ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో పెండింగ్‌ దరఖాస్తులను 45 రోజుల్లో పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారం కోసం ఆయా జిల్లాల్లో త్రిసభ్య కమిటీల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీచేసినట్లు తెలిపారు. కమిటీ చైర్మన్‌గా ఆ జిల్లా కలెక్టర్‌, సభ్యులుగా సింగరేణి ప్రతినిధి, ఆ జిల్లా రిజిస్ర్టార్‌ వ్యవహరిస్తారని వివరించారు. కాగా, 22ఏ జాబితాను తాము కొత్తగా తేలదని, ఉమ్మడి రాష్ట్రంలోనూ అమల్లో ఉందని గుర్తు చేశారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. వారం రోజుల్లో సమస్య పరిష్కారానికి ఉత్తర్వులు వస్తాయన్నారు.


క్యూర్‌లో 21 వేల డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు పూర్తి

గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను సీఎం సూచనల మేరకు పూర్తి చేస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. భేషజాలకు పోకుండా క్యూర్‌ పరిధిలోని 26 ప్రాంతాల్లో 21 వేల డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను పూర్తి చేశామని ప్రకటించారు. సచివాలయంలో రంగారెడ్డి, సంగారెడ్డి, మల్కాజిగిరి, హైదరాబాద్‌ కలెక్టర్లు, హౌసింగ్‌, వాటర్‌ వర్క్స్‌, విద్యుత్తు అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పూర్తి చేసిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ఈనెల 30వ తేదీలోగా లబ్ధిదారులకు కేటాయించాలని, ఆన్‌లైన్‌ పోర్టల్‌లో వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. క్యూర్‌ పరిధిలో ఇంటి స్థలాలు ఉండి అర్హులైన 9 వేల మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఇన్‌చార్జి మంత్రులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆరే..
నలుగురి ప్రాణాలు తీసిన నిద్రమత్తు!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 20 , 2026 | 06:24 AM