పోలవరం.. పాలమూరు వేర్వేరు ప్రాజెక్టులు కాదు!
ABN , Publish Date - Oct 18 , 2026 | 05:49 AM
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి.
సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ జలవనరుల శాఖ స్పెషల్ సీఎస్ వ్యాఖ్య
ట్రైబ్యునల్ బయటే జల వివాదాలు తేల్చుకోండి
ఏపీ, తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సలహా
సమావేశం మినిట్స్‌ను రాష్ట్రాలకు పంపిన హోంశాఖ
త్వరలో దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో అమిత్‌షా భేటీ
హైదరాబాద్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి. తెలంగాణ చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏపీ అనుమతినిస్తే.. ఏపీ ప్రతిపాదించిన పోలవరం-బనకచర్లను తెలంగాణ ఆమోదించాలని సూత్రప్రాయంగా నిర్ణయించిన విష యం విదిత మే. అయితే ఈప్రక్రియలో మరిన్ని అడుగులు పడినట్లు సదరన్ జోనల్ కౌన్సిల్ మినిట్స్‌లో తేలింది.
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నేతృత్వంలో ఆగస్టు 20న తమిళనాడులోని మహాబలిపురంలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ప్రతిపాదించిన గోదావరి-కృష్ణా-పెన్నా-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టుపై చర్చ లో ఏపీ తరఫున ఆయన మాట్లాడారు. తాము ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు.. కేంద్రం ప్రతిపాదించిన గోదావరి-కావేరి ప్రాజెక్టుకు అన్ని విధాలుగా సరితూగుతుందని చెప్పారు.
తెలంగాణ చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, నక్కలగండి ప్రాజెక్టులు కూడా బనకచర్ల ప్రణాళికలో భాగమేనని, ఇవి వేర్వేరు కాదన్నారు. ఈసమావేశం మినిట్స్‌ను కేంద్ర హోం శాఖ ఇటీవల రాష్ట్రాలకు పంపడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పోలవరం-బనకచర్ల దక్షిణ భారతదేశపు అనుసంధానమన్నారు. వరదల సమయంలో రిజర్వాయర్లన్నీ నింపుకోవచ్చునని, కరువు సందర్భాల్లో ఇది ఓ గొలుసుకట్టు వ్యవస్థలా పనిచేస్తుందని అన్నారు.
ట్రైబ్యునల్ బయట పరిష్కరించుకోవాలి..
కృష్ణా ట్రైబ్యునల్-2 వెలుపల సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సిద్ధంగా ఉన్నాయా?అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి, నక్కలగండి ఎత్తిపోతల పథకాలపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే ప్రాజెక్టులన్నీ ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉన్నాయని, వాటిని విడిగా పరిగణించలేమని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. దీంతో రాష్ట్రాలు ఈ విషయాలపై పరస్పరం చర్చించుకుని, ఆ తర్వాత కేంద్ర జలశక్తి శాఖ వద్దకు తిరిగి రావాలని అమిత్‌షా సూచించారు.
సదరన్ జోనల్ కౌన్సిల్ ముందున్న నీటి సంబంధిత అంశాలన్నింటినీ కలిపి పరిశీలించాలని, ఇచ్చిపుచ్చుకునే విధానంలో సమస్యల పరిష్కారానికి సమగ్ర చర్చల కోసం రోడ్‌మ్యా్‌పను రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రాలు వీలైనంత వరకు కృష్ణా ట్రైబ్యునల్-2 తీర్పు కోసం ఎదురుచూడకుండా, సానుకూల దృక్పథంతో పరస్పర చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి కృషి చేయాలని అన్నారు. ఉమ్మడి ఏపీ, కర్ణాటక, తమిళనాడు మధ్య కృష్ణా జలాలను పంపిణీ చేస్తూ 2012లో కృష్ణా ట్రైబ్యునల్-2 ఇచ్చిన తీర్పును అమల్లోకి తెస్తూ సత్వరంగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు కేంద్ర జలశక్తి శాఖ కృషి చేయాలని సూచించారు. జలవివాదా ల పరిష్కారానికి అవసరమైతే కేంద్ర హోంశాఖ, జలశకి శాఖ మంత్రులు.. దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో సమావేశమై చర్చిస్తారని తెలిపారు. దాంతో సీఎంలతో అమిత్‌షా సమావేశం కోసం కేంద్ర హోంశాఖ కసరత్తు ప్రారంభించింది.
ఈ వార్తలు కూడా చదవండి
రోడ్డు భద్రత సెస్ లెక్క పక్కా
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: రాంచందర్‌రావు
కనిపించని శత్రువులతో యుద్ధం చేయాలి
Read Latest AP News And Telangana News And International