Share News

శతావరి సాగుతో రైతులకు సిరుల పంట!

ABN , Publish Date - Nov 18 , 2026 | 05:20 AM

ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యం ఉన్న ఔషధ గుణాల శతావరి మొక్కల సాగును ప్రోత్సహించేందుకు ఉస్మానియా యూనివర్సిటీ వృక్షశాస్త్ర విభాగం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

శతావరి సాగుతో రైతులకు సిరుల పంట!
Shatavari Cultivation

  • ఆయుర్వేద ఔషధ పరిశ్రమల్లో ప్రాధాన్యం

  • లక్ష మొక్కల నర్సరీ ఏర్పాటు చేసిన ఓయూ

  • సాగుపై అవగాహన, రైతులకు పంపిణీకి చర్యలు

ఉస్మానియా యూనివర్సిటీ, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యం ఉన్న ఔషధ గుణాల శతావరి మొక్కల సాగును ప్రోత్సహించేందుకు ఉస్మానియా యూనివర్సిటీ వృక్షశాస్త్ర విభాగం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్‌ మెడిసినల్‌ ప్లాంట్స్‌ బోర్డు (ఎన్‌ఎంపీబీ) ఆర్థిక సహకారంతో ‘శతావరి సాగు ద్వారా మెరుగైన ఆరోగ్యం’ పేరుతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా లక్ష శతావరి మొక్కలతో నర్సరీని ఏర్పాటు చేసి రైతులకు పంపిణీ చేయనున్నారు.


ఈ ప్రాజెక్టును వృక్షశాస్త్ర విభాగం ప్రొఫెసర్‌ ఇ.సుజాత సమన్వయం చేస్తున్నారు. రైతులకు అవగాహన కల్పించడంతో పాటు ఔషధ మొక్కల ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించేందుకు పలు కార్యక్రమాలు రూపొందించారు. ఈ కార్యక్రమ బ్రోచర్లను ఓయూ వీసీ ప్రొఫెసర్‌ కుమార్‌ విడుదల చేశారు. ఈ నెల 23న నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి, శతావరి మొక్కలు పంపిణీ చేయనున్నారు. డిసెంబరు 14, 15 తేదీల్లో జాతీయ సదస్సును నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.


ఔషధ మొక్కల రాణి శతావరి

శతావరిని ఆయుర్వేదంలో ‘ఔషధ మొక్కల రాణి’గా పిలుస్తారు. తీగల మాదిరిగా పెరిగే ఈ మొక్క భూమిలో పొడవైన, కండగల వేర్లను ఏర్పరుస్తుంది. ఔషధ తయారీలో ప్రధానంగా ఈ వేర్లనే వినియోగిస్తారు. ఎకరాకు సుమారు 11,200 మొక్కలను నాటుకోవచ్చు. సాధారణంగా 18 నుంచి 24 నెలల తర్వాత వేర్లను సేకరించవచ్చు. వాటినినాణ్యత ఆధారంగా వేరు చేసి విక్రయానికి సిద్ధం చేయాలి. ఎకరాకు 3 నుంచి 5 టన్నుల వరకు పచ్చి వేర్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఎండిన వేర్ల ధర కిలోకు సుమారు రూ.300 నుంచి రూ.750 వరకు ఉండవచ్చని అంచనా.


ఇవి కూడా చదవండి...

కోనసీమ జిల్లాలో భారీ శబ్దాలతో గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు

కోనసీమ గ్యాస్ లీకేజీపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 05:20 AM