Share News

ఓబీసీ కాలమ్‌ చేర్చేవరకు జన గణన బహిష్కరణ

ABN , Publish Date - Nov 29 , 2026 | 04:36 AM

ఓబీసీ కాలమ్‌ను ప్రశ్నావళిలో చేర్చేంతవరకు జన గణనను బహిష్కరిస్తున్నామని ఓబీసీ నేతలు, మేధావులు ప్రకటించారు.

ఓబీసీ కాలమ్‌ చేర్చేవరకు జన గణన బహిష్కరణ

  • డిసెంబరు 1 నుంచి దేశ వ్యాప్త సహాయ నిరాకరణ

  • రాంలీలా మైదానంలో ఓబీసీ మహాసభలో వక్తలు

న్యూఢిల్లీ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఓబీసీ కాలమ్‌ను ప్రశ్నావళిలో చేర్చేంతవరకు జన గణనను బహిష్కరిస్తున్నామని ఓబీసీ నేతలు, మేధావులు ప్రకటించారు. ‘‘మమ్మల్ని సరిగ్గా లెక్కించని జన గణనను బహిష్కరిస్తున్నాం... మా జనాభా లెక్కలు తేలే వరకు పోరాటం ఆగదు.’’ అని ఓబీసీ నేతలు కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. జన గణనలో ఎస్సీ, ఎస్టీ, జనరల్‌ కేటగిరీలతో పాటు ఓబీసీలకు ప్రత్యేక కాలమ్‌ ఏర్పాటు చేసి, రాష్ట్ర, కేంద్ర జాబితాల్లోని ప్రతి కులానికి ప్రత్యేక కోడ్‌, డ్రాప్‌డౌన్‌ మెనూ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.


ఆలిండియా ఓబీసీ కులగణన సమన్వయ కమిటీ నేతలు జి.కిరణ్‌కుమార్‌, ప్రొఫెసర్‌ సూరజ్‌ మండల్‌ అధ్వర్యంలో శనివారం రాంలీలా మైదానంలో నిర్వహించిన భారీ ఓబీసీ మహాసభలో ఎంపీలు విల్సన్‌, పప్పుయాదవ్‌, మద్దెల గురుమూర్తి, ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య యాదవ్‌, యోగేంద్ర యాదవ్‌, తెలంగాణకు చెందిన మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్‌, బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌, వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు హాజరయ్యారు.


తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓబీసీ విద్యార్థులు ఈ మహాసభకు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా... నేతలు చట్టసభల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని... రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా... ‘కౌంట్‌ మీ రైట్‌’ పేరుతో కీలక డిక్లరేషన్‌ను ఆమోదించారు. జి.కిరణ్‌ కుమార్‌ మాట్లాడుతూ... డిసెంబరు 1 నుంచి పలు రాష్ట్రాల్లో ప్రారంభం కానున్న జన గణన ప్రక్రియను తక్షణమే నిలిపివేసి, ఓబీసీ కాలమ్‌ చేర్చాలని, లేనిపక్షంలో దేశ వ్యాప్తంగా జన గణనను బహిష్కరిస్తామని ప్రకటించారు.


ఇవి కూడా చదవండి...

ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం

21 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై హరీశ్ రావు, జగ్గారెడ్డి.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 29 , 2026 | 04:38 AM