Share News

సన్నధాన్యం @ రూ.3,400

ABN , Publish Date - Oct 02 , 2026 | 04:57 AM

అన్నదాతకు సన్నధాన్యం కాసులు కురిపిస్తోంది. సన్నాల ధర పెరుగుతోంది. పొరుగు రాష్ట్రాల నుంచి వ్యాపారులొచ్చి కొనేందుకు పోటీపడుతున్నారు.

సన్నధాన్యం @ రూ.3,400
Nizamabad paddy price

  • వారంలోనే క్వింటాకు 500 పెరుగుదల

  • ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో జోరుగా కొనుగోళ్లు

  • ఇతర రాష్ట్రాల నుంచి పోటెత్తుతున్న వ్యాపారులు

హైదరాబాద్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): అన్నదాతకు సన్నధాన్యం కాసులు కురిపిస్తోంది. సన్నాల ధర పెరుగుతోంది. పొరుగు రాష్ట్రాల నుంచి వ్యాపారులొచ్చి కొనేందుకు పోటీపడుతున్నారు. మూడు, నాలుగు రోజుల క్రితం క్వింటాకు రూ. 3 వేల లోపు ఉన్న సన్నధాన్యం ధర... ఇప్పుడు మూడున్నర వేలకు చేరువవుతోంది. బీపీటీ ధాన్యం ధర ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ప్రస్తుతం క్వింటాకు రూ. 3,400 పలుకుతుండటం గమనార్హం. వ్యాపారులు కల్లాల వద్దకే వచ్చి వడ్లు కొని.. సంచుల మీద డబ్బులు (అక్కడికక్కడే) చెల్లిస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని బాన్సువాడ, బోధన్‌ నియోజకవర్గాల్లో ముందస్తు వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడి రైతులు ప్రతి సీజన్‌లో కూడా వరి నార్లు ముందే పోసి.. ముందే నాట్లు వేస్తారు. ఫలితంగా పంట కోతలూ ముందుగానే జరుగుతాయి. ఈ కారణంగా ఇక్కడ పండే ధాన్యానికి మార్కెట్లో డిమాండ్‌ కూడా ఎక్కువగా ఉంటుంది.


ధాన్యం పచ్చిగా ఉన్నా, తేమశాతం 25-30శాతం వరకు ఉన్నా కూడా.. రైతులు పంట కోతలు పూర్తి చేయగానే, వ్యాపారులు ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆ ధాన్యం కొంటుంటారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడతోపాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ట్రేడర్లు, మిల్లర్లు.. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు ‘క్యూ’ కడతారు. ప్రస్తుతం వర్ని, రుద్రూరు. బోధన్‌, ఎడపల్లి, కోటగిరి, చందూర్‌, కోటగిరి, మోస్రా, రెంజల్‌, నవీపేట్‌, నస్రుల్లాబాద్‌ మండలాల్లో వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడి రైతులు మొత్తానికి మొత్తం ‘బీపీటీ’ వెరైటీనే సాగుచేశారు. బహిరంగ మార్కెట్లో బీపీటీకి డిమాండ్‌ బాగా ఉంది. కాగా నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లోని బోధన్‌, బాన్సువాడ, వర్ని, రుద్రూరు. ఎడపల్లి, కోటగిరి, చందూర్‌, కోటగిరి, మోస్రా, రెంజల్‌, నవీపేట్‌, నస్రుల్లాబాద్‌ తదితర ప్రాంతాలో వారం క్రితం వరి కోతలు మొదలయ్యాయి. ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. మరో 15 రోజుల్లో దాదాపుగా వరి కోతలు పూర్తికానున్నాయి. దసరా పండుగ వచ్చేనాటికే వరి కోతలు పూర్తవుతాయని, కనీసం కొయ్యకాళ్లు (పంట అవశేషాలు) కూడా కనిపించవని రైతులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి...
ఆరేళ్ల సంపాదనతోనే మూడు స్టార్‌ హోటళ్లు కొన్నారా?

ఒక దగ్గర కూర్చుని.. ఓటర్లే రావాలంటే కుదరదు!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 04:57 AM