Share News

ఒక దగ్గర కూర్చుని.. ఓటర్లే రావాలంటే కుదరదు!

ABN , Publish Date - Oct 02 , 2026 | 04:51 AM

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణ కోసం ఈఆర్‌వో కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని.. బీఎల్‌వోలే ఓటర్ల ఇంటికి వచ్చి, తగిన పత్రాలు సేకరిస్తారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి తెలిపారు.

ఒక దగ్గర కూర్చుని.. ఓటర్లే రావాలంటే కుదరదు!
Sudarshan Reddy

  • బీఎల్‌వోలే ఓటర్ల ఇళ్లకు వెళ్లి పత్రాలు తీసుకోవాలి..

  • ఈసీఐనెట్‌లో అప్‌లోడ్‌ చేయాలి..

  • ఇప్పటికే ఆదేశాలిచ్చాం

  • ‘సర్‌’ నోటీసులపై వ్యక్తిగత విచారణ ఉండదు

  • అవసరమైతే ఆన్‌లైన్‌లో ఓటర్లతో సంప్రదింపులు

  • కుటుంబంలోని ఓటర్ల వివరాలను ఎవరో ఒకరు ఇచ్చినా సరిపోతుంది

  • రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి

హైదరాబాద్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణ కోసం ఈఆర్‌వో కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని.. బీఎల్‌వోలే ఓటర్ల ఇంటికి వచ్చి, తగిన పత్రాలు సేకరిస్తారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన కొత్త మార్గదర్శకాలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లకు వివరించామని సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఇకపై ఒకచోట కూర్చొని ఓటర్లను పిలిపించుకోవడం కుదరదని, ఓటర్ల ఇళ్లకే వెళ్లి అవసరమైన పత్రాలు తీసుకుని, ఈసీఐనెట్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఇప్పటికే బీఎల్‌వోలకు ఆదేశాలు జారీచేశామని చెప్పారు.


నోటీసులు అందిన కుటుంబ సభ్యులంతా అందుబాటులో ఉండాల్సిన పనిలేదని.. ఎవరైనా ఒకరు కుటుంబంలోని అందరు ఓటర్ల వివరాలు ఇస్తే సరిపోతుందని వివరించారు. నోటీసులు జారీ అయిన వారిలో ఎవరైనా స్థానికంగా నివాసం లేకపోతే.. ఈఆర్‌వోలు వారిని ఆన్‌లైన్‌లోనే సంప్రదించి వివరాల సేకరణ ప్రక్రియను పూర్తిచేస్తారని తెలిపారు. ఇక ఫారం-6కు డిక్లరేషన్‌ ఇచ్చే అంశంలో ‘సర్‌’ పూర్తయిన రాష్ట్రాలకే మినహాయింపు వర్తిస్తుందని.. తెలంగాణలో సర్‌ ప్రక్రియ కొనసాగుతుండటంతో ఫారం-6కు డిక్లరేషన్‌ తప్పనిసరని స్పష్టం చేశారు.


గడువు పెంచే ప్రసక్తే లేదు..

‘సర్‌’లో భాగంగా తెలంగాణలో 92లక్షల మందికి నోటీసులు ఇచ్చామని.. అందులో ఇప్పటి వరకు 65లక్షల మంది సమాధానం ఇచ్చారని, 54 లక్షల మందిని తుది ఓటరు జాబితాలోకి చేర్చామని తెలిపారు. నవంబర్‌ 5వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని, ఆలోపు మిగతా ఓటర్లను కూడా తుది జాబితాలోకి తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. ‘సర్‌’ ప్రక్రియ గడువును మళ్లీ పొడిగించే ప్రసక్తే లేదని సీఈవో సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుత షెడ్యూల్‌ ప్రకారం.. ఈ నెల 7వ తేదీ వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాల దాఖలుకు అవకాశం ఉందని.. నోటీసుల జారీ, అభ్యంతరాల పరిష్కారానికి నవంబర్‌ 5వరకు అవకాశం ఉందని తెలిపారు. తుది ఓటరు జాబితాను నవంబర్‌ 9న ప్రచురిస్తామని చెప్పారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో 80వేల మందికి నోటీసులు ఇచ్చామని, అందులో 40శాతం మందిని తుది ఓటరు జాబితాలోకి తీసుకొచ్చామని వివరించారు.


ఇవి కూడా చదవండి...
ఆరేళ్ల సంపాదనతోనే మూడు స్టార్‌ హోటళ్లు కొన్నారా?

రూటు మారిన ఎక్స్‌ప్రెస్‌ బస్సు!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 04:51 AM