రూటు మారిన ఎక్స్‌ప్రెస్ బస్సు!
ABN , Publish Date - Oct 02 , 2026 | 04:38 AM
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) నడుపుతున్న ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసుల రూటు మార్చడం వివాదాస్పదంగా మారింది.
ఎక్స్‌ప్రె్‌సల స్థానంలో డీలక్స్, లగ్జరీలు
ఖమ్మం, వరంగల్, సూర్యాపేట, మరికొన్ని రూట్లలో మార్పు
‘మహాలక్ష్మి’ వల్లే మార్చారంటూ విమర్శలు
రద్దీకి అనుగుణంగానే మార్పులు: ఎండీ
హైదరాబాద్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) నడుపుతున్న ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసుల రూటు మార్చడం వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ పథకంలో భాగంగా మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ ఆర్జినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. దీంతొ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు, హైదరాబాద్ నుంచి వేర్వేరు ప్రాంతాలకు ప్రయాణంచే సమయంలో మహిళలు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. అయితే, కొద్ది రోజలుగా ఖమ్మం, వరంగల్, సూర్యాపేటతోపాటు మరికొన్ని రూట్లలో ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులు తగ్గాయి. అవసరం మేరకు సూపర్‌లగ్జరీ, డీలక్స్ బస్సులను ఆయా రూట్లలో నడుపుతున్నారు. దీంతో ఎక్స్‌ప్రె్‌సలు లేక సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులు ఎక్కుతున్న మహిళలు చార్జీలు చెల్లిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మహాలక్ష్మి పథకంలో కోత విధించేందుకు ఆర్టీసీ అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులను తగ్గించారని మహిళా ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తే అధికారులు ఆదాయం కోసం ఎక్స్‌ప్రెస్ సర్వీసులను తగ్గించడమేంటని ప్రశ్నిస్తున్నారు. మరోపక్క, ఎక్స్‌ప్రెస్ బస్సులు అందుబాటులో లేక పురుషులు కూడా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో అధిక చార్జీలు చెల్లించి ప్రయాణించాల్సి వస్తుంది. అయితే దసరా పండగకు కొద్ది రోజుల ముందు ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్ని రద్దు చేసి డీలక్స్, సూపర్‌లగ్జరీలు తేవడం ‘స్పెషల్’ సర్వీసుల పేరుతో పండగ పూట అదనపు చార్జీలు వసూలు చేయడంలో భాగమనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పండగ ప్రయాణాల్ని సొమ్ము చేసుకునేందుకే ఆర్టీసీ ఇలా చేస్తోందని విమర్శలూ ఉన్నాయి.
రద్దీకి అనుగుణంగా మార్పు: ఆర్టీసీ ఎండీ
‘మహాలక్ష్మి’ కారణంగా ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులను రద్దు చేసినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి స్పష్టం చేశారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సర్వీసుల్ని నడుపుతుంటామన్నారు. సర్దుబాటులో భాగంగా రద్దీ తక్కువగా ఉన్న మార్గాల్లోని ఎక్స్‌ప్రెస్ బస్సుల్ని రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లకు మార్చడం సాధారణ ప్రక్రియన్నారు. పైగా ఎక్స్‌ప్రెస్ స్థానంలో డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులను నడపడం సాధ్యం కాదన్నారు. ఆర్టీసీ కొత్తగా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్ని కొనుగోలు చేయలేదని, అలాంటప్పుడు ఎక్స్‌ప్రె్‌సల స్థానంలో వాటిని నడపడం సాధ్యం కాదని నాగిరెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి...
నా హోటళ్లకు ముఖ్యమంత్రి ప్రచారం
ఎమ్మెల్సీ పదవులు ఎవరిని వరించునో!?
Read Latest Telangana News And Telugu News