Share News

ఎమ్మెల్సీ పదవులు ఎవరిని వరించునో!?

ABN , Publish Date - Oct 02 , 2026 | 04:24 AM

త్వరలో ఖాళీ కానున్న మూడు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ సీట్లలో ఒకటి పద్మశాలీ నేతకే ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో ఆ సామాజిక వర్గం నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీటు దక్కించుకునేందుకు ఇప్పటికే తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు.

ఎమ్మెల్సీ పదవులు ఎవరిని వరించునో!?
Revanth Reddy

  • వచ్చే నెలలో 3 గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ

  • ఒకటి పద్మశాలీ నేతకేనని తేల్చి చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి

  • ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ.. పరిశీలనలో నలుగురి పేర్లు

  • మిగిలిన సీట్లలో ఒకటి ఎస్సీకి, మరోటి బ్రాహ్మణ నేతకు...

హైదరాబాద్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): త్వరలో ఖాళీ కానున్న మూడు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ సీట్లలో ఒకటి పద్మశాలీ నేతకే ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో ఆ సామాజిక వర్గం నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీటు దక్కించుకునేందుకు ఇప్పటికే తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. తమ పేర్లనూ పరిగణనలోకి తీసుకోవాలంటూ ముఖ్య నాయకులకు ఫోన్లు చేస్తున్నారు. పద్మశాలీ వర్గానికి కేటాయించే సీటుకు ప్రధానంగా కుడా చైర్మన్‌ గుండు సుధారాణి, ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్‌ ఈరవత్రి అనిల్‌, సిరిసిల్ల డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు కైలా్‌షనేత పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్‌ అయిన గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌ పదవీ కాలం నవంబర్‌ 14న ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ మూడు సీట్లలో ఒకటి పద్మశాలీ నేతకు కేటాయించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మిగిలిన రెండు సీట్లలో ఒకటి ఎస్సీ వర్గానికి, రెండోది బ్రాహ్మణ వర్గానికి కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఎస్సీల్లోనూ మాదిగ సామాజికవర్గానికి కేటాయించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.


ప్రధానంగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, పార్టీ నేత దొమ్మాట సాంబయ్య పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మాజీ మంత్రి పుష్పలీల, పార్టీ సీనియర్‌ నాయకులు వక్కలగడ్డ చంద్రశేఖర్‌, సతీష్‌ మాదిగ సైతం తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు, మాల సామాజిక వర్గానికి చెందిన సంభాని చంద్రశేఖర్‌ పేరు సైతం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, మాల వర్గానికి చెందిన నేతకు సీటు ఇస్తే.. మాదిగ వర్గ నేతకు పార్టీలోగానీ, ప్రభుత్వంలోగానీ ప్రాధాన్య పోస్టు ఇచ్చే అవకావం ఉందని చెబుతున్నారు. ఇక, మూడో సీటును బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ కోటాలో ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్‌రావు, వరంగల్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ నేత గుండెపల్లి దయాసాగర్‌రావు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. కాగా, మూడు సీట్లలో రెండు సీట్లను బీసీలకే కేటాయించాలని బీసీ నేతలు ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అది సాధ్యమైతే.. ఆ సీటుకు తమ పేర్లు పరిగణనలోకి తీసుకోవాలని మున్నూరు కాపు నేత సత్తు మల్లేశం, పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ చరణ్‌కౌశిక్‌ యాదవ్‌ కోరుతున్నారు.


ఇవి కూడా చదవండి...
ఎన్నికల కమిషన్‌, హైదరాబాద్‌ తగలబడిపోతయ్‌

తీర్పు వచ్చే వరకూ.. ఉప ఎన్నిక వద్దు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 04:24 AM