తీర్పు వచ్చే వరకూ.. ఉప ఎన్నిక వద్దు
ABN , Publish Date - Oct 02 , 2026 | 04:07 AM
రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఆసక్తి కలిగిస్తున్న ఖైరతాబాద్ ఉపఎన్నిక వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది.
‘ఖైరతాబాద్’పై ఈసీకి హైకోర్టు ఆదేశం
విజయారెడ్డి పిటిషన్‌తో అనూహ్య మలుపు
దానం నాగేందర్ గెలుపును సవాల్ చేస్తూ 2024లో విజయారెడ్డి ఎన్నికల పిటిషన్
దానిపై తీర్పు వెలువడేంత వరకూ ప్రస్తుత ఉప ఎన్నిక జరపవద్దని తాజాగా విజ్ఞప్తి
దానం అనర్హుడని తీర్పు వస్తే తానే ఎమ్మెల్యే అవుతానని వెల్లడి
అఫిడవిట్ దాఖలు చేయండి..
ఎన్నికల సంఘానికి న్యాయస్థానం ఆదేశం
ఈ నెల 6కు విచారణ వాయిదా
హైదరాబాద్, బంజారాహిల్స్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఆసక్తి కలిగిస్తున్న ఖైరతాబాద్ ఉపఎన్నిక వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైన దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా దివంగత నేత పీ జనార్దన్‌రెడ్డి కుమార్తె పీ విజయారెడ్డి గతంలో దాఖలు చేసిన ఎలక్షన్ పిటిషన్‌పై తీర్పు వెలువడే వరకూ ఉపఎన్నిక నిర్వహించడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. ఎన్నికల సంఘం (ఈసీ) తరఫు న్యాయవాది కూడా దీనికి ప్రాథమికంగా అంగీకరించారు. ఈమేరకు, తీర్పు వెలువడేవరకూ ఉపఎన్నిక నిర్వహించబోమంటూ ఈసీ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. పార్టీ మారినట్లు నిరూపణ కావడంతో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ ఫిరాయింపుల చట్టం ప్రకారం పదవి కోల్పోయిన విషయం తెలిసిందే. ఫలితంగా ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో విజయారెడ్డి పిటిషన్‌తో ఒక్కసారిగా ఈ ప్రక్రియకు బ్రేక్ పడినట్లయింది.
ఇదీ నేపథ్యం
2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన దానం నాగేందర్ విజయం సాధించారు. కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన విజయారెడ్డి రెండోస్థానంలో నిలిచారు. ఎన్నికల ఫలితంపై విజయారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల అఫిడవిట్, ఫారం-26లో దానం నాగేందర్ తప్పుడు వివరాలు ఇచ్చారని, వాస్తవాలు దాచిపెట్టారని.. ఆయనను అనర్హుడిగా ప్రకటించి, రెండోస్థానంలో నిలిచిన తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని పేర్కొంటూ హైకోర్టును ఆశ్రయించారు. 2024 జనవరి 20న దాఖలైన ఎన్నికల పిటిషన్.. జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం ఎదుట విచారణలో ఉంది. ఇటీవల దానం నాగేందర్‌పై వేటు పడటం, ఖైరతాబాద్ ఉప ఎన్నిక జరగనుందన్న వార్తల నేపథ్యంలో.. విజయారెడ్డి తాజాగా గురువారం హైకోర్టు డివిజన్ బెంచ్ ఎదుట పిటిషన్ దాఖలు చేశారు. తన ఎలక్షన్ పిటిషన్‌పై తీర్పు వెలువడే వరకు ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లు లేదా ఉపఎన్నిక నిర్వహించనున్నట్లు నోటిఫై చేయకుండా ఈసీని అడ్డుకోవాలని కోరారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ రామకృష్ణారెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
బీఆర్‌ఎస్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు
విజయారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకట రమణ వాదనలు వినిపించారు. దానం నాగేందర్ ఎన్నిక చెల్లదని తాను దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ (ఈపీ) హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉందని.. అందులో తాను విజయం సాధిస్తే ఓట్లపరంగా రెండోస్థానంలో నిలిచిన తానే ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సదరు ఈపీపై నిర్ణయం వెలువడే వరకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక కోసం నోటిఫై చేయకుండా ఈసీని నిలువరించాలని కోరారు. ‘ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వర్సెస్ తెలంగాణ రాష్ట్ర సమితి అండ్‌అదర్స్’ కేసులో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రస్తుత సందర్భానికి వర్తిస్తుందన్నారు. తమ ఈపీపై తీర్పు వచ్చే వరకూ ఖైరతాబాద్ స్థానాన్ని సాధారణ ఖాళీగా ప్రకటించడానికి, ఉప ఎన్నిక నిర్వహించడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయి స్పందిస్తూ.. పిటిషనర్ వాదనతో తాము ప్రాథమికంగా ఏకీభవిస్తున్నామన్నారు. ఎలక్షన్ పిటిషన్‌పై తీర్పు వెలువడే వరకు ఖైరతాబాద్ స్థానానికి ఉపఎన్నిక నోటిఫికేషన్ ఇవ్వబోమన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈపీపై ఫలితం తేలేవరకు ఖైరతాబాద్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయబోమని పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 6వ తేదీకి వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి...
రియల్ వెర్రి..!
రైతులకు ఇవ్వాల్సింది ఇచ్చేయండి
Read Latest Telangana News And Telugu News