Share News

రైతులకు ఇవ్వాల్సింది ఇచ్చేయండి

ABN , Publish Date - Oct 02 , 2026 | 03:54 AM

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో భూసేకరణ ఆలస్యం కావడం, నిధుల విడుదలలో జాప్యం నేపథ్యంలో.. సీఎం రేవంత్‌ రెడ్డి కలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులకు ఇవ్వాల్సింది ఇచ్చేయండి
Revanth Reddy

  • సాగు నీటి ప్రాజెక్టులకు భూసేకరణ ఆలస్యం అవుతుండడంతో కలెక్టర్లపై సీఎం సీరియస్‌

  • రబీకి నీరివ్వలేని చోట రైతులకు ఆ విషయాన్ని చెప్పేద్దాం

  • లేకుంటే వారు నష్టపోతారు.. క్యాబినెట్‌ భేటీలో రేవంత్‌

హైదరాబాద్‌, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో భూసేకరణ ఆలస్యం కావడం, నిధుల విడుదలలో జాప్యం నేపథ్యంలో.. సీఎం రేవంత్‌ రెడ్డి కలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘గతంలో ప్రాజెక్టులకు భూసేకరణ సరిగా జరగలేదు. దాన్ని వేగవంతం చేసి పూర్తి చేయాలని చెప్పాం. రైతులకు పరిహారంగా ఇవ్వాల్సిన నిధులూ విడుదల చేశాం. కలెక్టర్ల వద్ద రూ. 800 కోట్ల నిధులున్నాయి. అయినా జాప్యం జరుగుతోంది’’ అని క్యాబినెట్‌ భేటీలో ఆయన అసంతృప్తి వెలిబుచ్చారు. భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేసి నిధులు రైతులకు తక్షణమే ఇచ్చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు.. మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. చినకాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కొనసాగుతోందని.. ఇప్పటికే 80శాతం పూర్తయిందని, మిగతాది పూర్తిచేసి ప్రాజెక్టును వేగంగా నిర్మించాలని ఆయన కోరారు. దీంతో భూసేకరణపై క్యాబినెట్‌లో చర్చ జరిగింది. అలాగే.. ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపైనా చర్చ జరిగింది. గత వందేళ్లలో లేనంత అధిక ఉష్ణోగ్రతలు ఈ సీజన్లో నమోదయ్యే అవకాశాలున్నాయని సీఎం పేర్కొన్నారు.


ఇలాంటి పరిస్థితుల్లో నీరు ఎక్కువగా అవసరమయ్యే పంటలు వేస్తే రైతులు నష్టపోతారన్నారు. కాబట్టి, దీనిపై రైతులను ముందే అప్రమత్తం చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. రబీ పంటకు ఎక్కడ నీరిస్తారో, ఎక్కడ నీరివ్వలేరో నిర్మోహమాటంగా ముందే చెప్పేయాలని సూచించారు. అలా ముందుగా చెప్తే రైతులు తొలుత నొచ్చుకున్నా.. తర్వాత అర్ధం చేసుకుంటారన్నారు. నీళ్ల విషయంపై ముందే అప్రమత్తం చేయకపోతే రైతులు నష్టపోతారన్నారు. రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఉత్పత్తి పెంచే చర్యలు తక్షణం చేపట్టాలని సీఎం ఆదేశించారు. కాగా.. క్యాబినెట్‌ భేటీకి ముందు మంత్రుల మధ్య జరిగిన చర్చలో సిరిసిల్ల సభ విజయవంతంగా జరిగిన అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై స్పందించిన సీఎం.. ఇక నుంచి ప్రతి 10 రోజులకూ ఒక మంత్రి ఒకరోజు పూర్తిగా సిరిసిల్లలోనే గడపాలని సూచించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అక్కడే ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సహచర మంత్రులను కోరారు.


22ఏపై చర్చ..

మంత్రివర్గ సమావేశంలో 22ఏ భూములపైనా చర్చ జరిగింది. ఈ విషయంలో కొందరు అధికారులు సరిగా వ్యవహరించలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ముఖ్యంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖల మధ్య సమన్వయం ఏమాత్రం బాగాలేదన్న అభిప్రాయాలను మంత్రులు వ్యక్తం చేశారు. సమస్యలను క్రమక్రమంగా పరిష్కరిస్తున్నా.. ఇంకా పరిష్కరించాల్సింది చాలా ఉందన్నారు. పూర్తిస్థాయిలో పరిష్కరిస్తేనే ప్రజల్లో సంతృప్తి వస్తుందన్నారు. అలాగే త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు బాధ్యతలను మంత్రులకు అప్పగించారు. ఇప్పటికే ప్రకటించిన ఇద్దరు పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత మంత్రులదేనని సీఎం అన్నారు.


అందుకే ఆమె రాలేదు..

ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షురాలిగా గద్వాల విజయలక్ష్మిని ప్రభుత్వం ఇటీవలే నియమించిన విషయం తెలిసిందే. క్యాబినెట్‌ హోదా ఉన్న ఆమెను.. గురువారంనాటి భేటీకి ఆహ్వానించలేదన్న ప్రతిపక్షాల విమర్శలపై అధికారులు స్పందించారు. ఆమెను ప్రభుత్వం ఇటీవలే నియమించినందున ఇంకా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధిత ఫైళ్లు చేరలేదన్నారు. ఈ ప్రక్రియ కొనసాగుతోందని, వచ్చే మంత్రివర్గ సమావేశంలో గద్వాల విజయలక్ష్మి పాల్గొంటారని వారు తెలిపారు.


ఇవి కూడా చదవండి...

దసరా కానుక!

ఎర్రవల్లిలో అధికారుల సర్వే పూర్తి.. కలెక్టర్‌కు నివేదిక

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 03:54 AM